వారే టార్గెట్...జగన్ జిల్లాల టూర్ ఫిక్స్ !
ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నుంచి కీలక నేతలను అరెస్ట్ చేసి నెలల తరబడి జైలులో ఉంచిందని అంటున్నారు.
By: Satya P | 4 Jan 2026 9:52 AM ISTవైసీపీ అధినేత జగన్ జిల్లాల టూర్ కి రంగం సిద్ధం చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే జనవరి నెలాఖరు నుంచి కానీ లేదా ఫిబ్రవరి మొదటి వారం నుంచి కానీ ఆయన జిల్లాల పర్యటన ఉండొచ్చు అని అంటున్నారు. అయితే ముందు నుంచి అనుకున్నట్లుగా మొత్తం 26 జిల్లాలలో పార్లమెంట్ నియోజకవర్గాలలో జగన్ టూర్ ఉంటుందా అంటే అదిపుడు కాదని అంటున్నారు. ప్రస్తుతం జగన్ ఏపీలోని అన్ని జిల్లాలలో తొలి పర్యటనలుగా కొన్ని ప్రాధాన్యతలతో కూడిన ట్రిప్స్ వేయనున్నారు అని చెబుతున్నారు.
ఫిరాయింపు నేతలే గురి :
వైసీపీ అధికారంలో ఉండగా కీలక పదవులు ఇచ్చి ఎంతో బాగా చూసుకున్నా అధికారం పోగానే వైసీపీని విడిచి టీడీపీ కూటమి గూటికి చేరిన కొందరు నేతల తీరు పట్ల జగన్ ఒకింత ఆగ్రహంగా ఉన్నారని చెబుతున్నారు. వారు పార్టీని వీడినపుడు జగన్ సన్నిహిత నేతలతో ఇదే విషయాన్ని ప్రస్తావించారు అని కూడా చెబుతున్నారు. ఇపుడు వారి నియోజకవర్గాలలోనే మొదట పర్యటించడం ద్వారా వైసీపీ బలాన్ని అందరికీ ఒకసారి చూపించడం వారు పార్టీని వీడిన తీరుని క్యాడర్ లో మరోసారి చర్చకు తేవడం ఒక అజెండాగా ఉండబోతోంది అని అంటున్నారు. ఇక ఇందులో ఒక క్లియర్ కట్ సందేశాన్ని కూడా జగన్ పంపించబోతున్నారు అని అంటున్నారు. ఇక మీదట వారు పార్టీ వైపు తిరిగి చూసినా తీసుకునే ప్రసక్తి లేదని చెప్పడమే ఆ ఇండికేషన్ అని అంటున్నారు.
ఆయా జిల్లాలలో :
ఇక ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీని వీడారు, దాంతో అక్కడ జగన్ పర్యటించి సభని నిర్వహిస్తారు అని అంటున్నారు. అలాగే ఉమ్మడి క్రిష్ణా జిల్లా నుంచి సామినేని ఉదయభాను జనసేన తీర్ధం పుచ్చుకున్నారు అక్కడ కూడా ఒక సభ ఉంటుందని చెబుతున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరులో ఒక సభను నిర్వహించాలని చూస్తున్నారుట. అక్కడ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు జనసేనలో చేరారు. అలాగే ఏలూరు నుంచి ఆళ్ళ నాని పార్టీ మారి టీడీపీలో చేరారు. భీమవరం నుంచి గ్రంధి శ్రీనివాస్ వైసీపీకి గుడ్ బై కొట్టారు. దాంతో వీరి నియోజకవర్గాలలో పర్యటించి సభలు పెట్టాలలని చూస్తున్నారుట. ఉదయభాను సొంత నియోజకవర్గం అయిన జగ్గంపెట నుంచే జగన్ జిల్లాల టూర్ స్టార్ట్ అవుతుందని అంటున్నారు.
కూటమి బాధితుల కోసం :
ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నుంచి కీలక నేతలను అరెస్ట్ చేసి నెలల తరబడి జైలులో ఉంచిందని అంటున్నారు. దాంతో వారికి అండగా పార్టీ ఉందని తెలియచెప్పడమే కాకుండా కూటమి ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపేలా వారి నియోజకవర్గాల్లో కూడా జగన్ పర్యటనలు ఉంటాయని చెబుతున్నారు. అలా నెల్లూరు జిల్లా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి జైలు పాలు కావడంతో ఆయన సొంత నియోజకవర్గం సర్వేపల్లిలోనూ, వల్లభనేని వంశీ నియోజకవర్గం గన్నవరంలోనూ, చెవిరెడ్డి భాస్కరరెడ్డి నియోజకవర్గం చంద్రగిరిలోనూ జగన్ పర్యటనలకు షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు. అలాగే మాచర్లలో పిన్నెల్లి సోదరులు తాజాగా అరెస్టు అయ్యారు. దాంతో అక్కడ కూడా జగన్ పర్యటించి క్యాడర్ కి ధైర్యం చెబుతారు అని పార్టీని మళ్ళీ సంసిద్ధం చేస్తారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే కొత్త తరహా వ్యూహంతోనే జగన్ ఈ పర్యటనలు ఉండబోతున్నాయని అంటున్నారు. ఇవి పూర్తిగా పార్టీని పటిష్టం చేసే క్రమంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలుగా చెబుతున్నారు. అలాగే పార్టీలో ఉన్న వారికి అండ లేని వారిని ప్రత్యర్ధులుగా నిలబెడుతూ చేసే పర్యటనలుగా చెబుతున్నారు.
