మావిగన్ సరే.. 3 రాజధానుల మాటేందని జగన్ ను అడగరేం?
మావిగన్.. మావిగన్.. ఏపీ వ్యాప్తంగా ఏ ఇద్దరు కలిసినా.. ఈ అంశం మీదనే చర్చ. కొందరు కామెడీ చేసుకుంటుంటే.. మరికొందరు సీరియస్ వాదనల్ని వినిపిస్తున్నారు.
By: Garuda Media | 9 April 2026 12:00 PM ISTమావిగన్.. మావిగన్.. ఏపీ వ్యాప్తంగా ఏ ఇద్దరు కలిసినా.. ఈ అంశం మీదనే చర్చ. కొందరు కామెడీ చేసుకుంటుంటే.. మరికొందరు సీరియస్ వాదనల్ని వినిపిస్తున్నారు. మొత్తంగా ఏపీ రాజధాని అమరావతికి ప్రత్యామ్నాయంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఈ కొత్త పదం ఇప్పుడు వైరల్ గా మారింది. సీజన్ కు తగ్గట్లు తన వాదనను ఇట్టే మార్చేసుకునే సత్తా ఉన్న జగన్మోహన్ రెడ్డి తొలుత అమరావతికి ఓకే చెప్పటం.. ఆ తర్వాత మూడు రాజధానుల పేరుతో కొత్త వాదనను వినిపించటం.. కట్ చేస్తే.. ఇప్పుడు మావిగన్ పేరుతో కొత్త రాగాలు తీస్తున్న సంగతి తెలిసిందే.
ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఎప్పటికిప్పుడు సరికొత్తగా వాదన వినిపించే విషయంలో జగన అండ్ కోకు సాటి వచ్చే వారే ఉండరు. దీనికి కారణం లేకపోలేదు. ఎదుటోళ్ల తప్పుల్ని ఎత్తి చూపటమేకాదు.. ఆ దిశగా చర్చను తీసుకెళ్లే టాలెంట్ టన్నుల కొద్దీ కనిపిస్తుంటుంది. 2014 ఎన్నికల వేళలో అమరావతికి ముందు నాటి ప్రకాశం జిల్లాలోని దొనకొండను రాజధానిగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని అనర్గళంగా వినిపించిన జగన్.. తర్వాతి కాలంలో అమరావతికి సరేనని చెప్పక తప్పలేదు.
ఆ సమయంలో ఇప్పుడు అమరావతి అంటున్నారు.. మొదట్లో దొనకొండ అన్నారు కదా? అని నిలదీసే అవకాశాన్ని ఇవ్వకుండా ఉండేలా చేయటం వైసీపీకే చెల్లుతుంది. 2019 ఎన్నికల్లో అమరావతిని కంటిన్యూ చేస్తామని చెప్పిన జగన్.. తాను ముఖ్యమంత్రి అయ్యాక.. మూడు రాజధానుల కాన్సెప్టును తెర మీదకు తీసుకురావటమే కాదు.. అందులోని లాజిక్ ను రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయటం.. అధినేత వాదనకు తగ్గట్లే ఆయన అనుచరవర్గం సైతం ఇదే అంశాల్ని వల్లెవేస్తూ.. ఏపీకి మూడు రాజధానుల అవసరాన్ని పదే పదే ప్రస్తావించటం చూసిందే.
2024లో జరిగిన ఎన్నికల్లో అధికారం చేజారి.. అనూహ్య రీతిలో దారుణ ఓటమి ఎదురైన వేళ.. రాజధాని గురించి మాట్లాడింది లేదు. ఎప్పుడైతే ఏపీలోని కూటమి ప్రభుత్వం అమరావతిని ఏపీ శాశ్విత రాజధాని అన్న మాట తెర మీదకు తీసుకొచ్చిందో అప్పటి నుంచి వైసీపీ సరికొత్త వాదనను సిద్ధం చేసుకుంది. పార్లమెంటులో దేశంలోని రాజకీయ పార్టీలు దాదాపుగా అమరావతిని ఏపీ శాశ్విత రాజధాని అన్న మాటకు మద్దతు ఇస్తున్న వేళలో.. మావిగన్ వాదనను ఆవిష్కరించారు.
జగన్మోహన్ రెడ్డికి ఉన్న అతి గొప్ప బలం ఏమంటే.. ఆయన ఎప్పుడు ఏ వాదనను వినిపించినా.. దానికి వెంటనే సరేనని ఓకే చేసే అతివీర భయంకర విధేయ బ్యాచ్ ఉంటుంది. వారు జగన్ చెప్పిన ఏ మాటనైనా ఇట్టే ఒప్పేసుకోవటమే కాదు.. అదే నిజమని అందరిని నమ్మించే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ.. ఎవరైనా వారి వాదనను తప్పు పడుతూ.. మరి ఇంతకు ముందు ప్రస్తావించిన మూడు రాజధానులు ఏమయ్యాయి? అన్న ప్రశ్నను అడిగే అవకాశం ఇవ్వరు. మరింత చిత్రమైన అంశం ఏమంటే.. చివరకు వైసీపీ రాజకీయ ప్రత్యర్థులు సైతం కాలానికి తగినట్లు మారే వాదనను ప్రస్తావించరు. నిలదీసే ప్రయత్నం చేయరు. ఎప్పుడు ఏదనుకుంటే అదే సరైన వాదన నమ్మటం సరే. కానీ.. అంతకు ముందు వినిపించిన వాదన మాటేమిటన్న క్లారిటీ ఇవ్వాల్సిన కనీస బాధ్యత ఉంటుంది కదా? మరి.. దాని సంగతేమిటి? అన్నది అసలు ప్రశ్న.
