నేతలపై జగన్ పట్టు కోల్పోతున్నారా.. ఈ డౌట్ ఎందుకంటే..!
వైసీపీ నేతలపై ఆ పార్టీ అధినేత జగన్ పట్టు కోల్పోతున్నారా అనేది ఇప్పుడు పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలు పార్టీకి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి.
By: Garuda Media | 17 Nov 2025 8:00 AM ISTవైసీపీ నేతలపై ఆ పార్టీ అధినేత జగన్ పట్టు కోల్పోతున్నారా అనేది ఇప్పుడు పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలు పార్టీకి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ప్రధానంగా అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం, కీలకమైన కేసుల్లో వెంటనే స్పందించటం, వివాదాస్పద రీతిలో వ్యాఖ్యలు చేయటం వంటివి పార్టీని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ వ్యవహారం ఇలానే పార్టీని ఇబ్బందికి గురిచేసింది. ఇంతలో ఆయన అరెస్టు కూడా అయ్యారు.
వాస్తవానికి నకిలీ మద్యం కేసును తామే వెలుగులోకి తీసుకొచ్చామని వైసిపి నేతలు చెప్పుకొచ్చారు. కానీ ఈ కేసులో జోగి రమేష్ పాత్ర ఉందని సూత్రధారి అద్దేపల్లి జనార్దన్ రావు చెప్పడంతో కేసు మొత్తం వైసిపి వైపు తిరిగింది. దీనికి వైసిపి నాయకుల అత్యుత్సాహమే ప్రధాన కారణమని సీనియర్ నాయకులు చెప్పుకొచ్చారు. తాజాగా పరకామణి కేసులో కూడా ఇలానే నాయకులు తొందరపడ్డారన్న వాదన నేతల నుంచి వినిపిస్తోంది. శ్రీవారి భక్తులు సమర్పించే కానుకలకు సంబంధించి పరకామణిలో విదేశీ డాలర్ల దొంగతనం జరిగింది.
ఈ కేసులో రవికుమార్ అనే సీనియర్ అసిస్టెంట్ పై కేసులు కూడా నమోదయ్యాయి. దీనికి సంబంధించి ఆనాడు ఫిర్యాదు చేసిన టీటీడీ ఏవీఎస్ ఓ సతీష్ కుమార్ శుక్రవారం విచారణకు హాజరయ్యే క్రమంలో అనంతపురంలోని తాడిపత్రి సమీపంలో రైలు పట్టాల వద్ద విగత జీవిగా కనిపించారు. దీనిపై అటు టిడిపి ఇతర పక్షాలు మౌనంగా ఉండగా వైసీపీ నాయకులు వెంటనే స్పందించారు. వైసీపీ సోషల్ మీడియాలో ఇది ఆత్మహత్య అంటూ ప్రచారం చేశారు.
వాస్తవానికి అసలు ఏం జరిగిందన్నది ఇంకా నిర్ధారణ కాకుండానే అత్యుత్సాహానికి పోయిన వైసిపి నాయకులు కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం అదేవిధంగా సతీష్ కుమార్ కు సంబంధించిన ఫోటోలను వైరల్ చేయడం ఆ పార్టీకి మరిన్ని ఇబ్బందులు తీసుకువచ్చింది. తాజాగా ఇది ఆత్మహత్య కాదు హత్య కేసు అంటూ పోలీసులు నిర్ధారించారు. దీనిపై కేసు నమోదు చేశారు. ఇప్పుడు గతంలో జరిగిన వివేకానంద రెడ్డి హత్య కేసుతో సంబంధం ఉన్నట్టుగా భావిస్తూ ఆ దిశలో విచారణను ముమ్మరం చేశారు. ఇది వైసీపీకి ఇబ్బందులు తీసుకొచ్చే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది.
అసలు ఎవరు నిర్ధారించకుండానే సతీష్ కుమార్ ది ఆత్మహత్య అంటూ ఎలా సంబోధించారని ఎలా ప్రచారం చేశారు అన్న కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. వాస్తవానికి ఏదైనా కీలక విషయంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలనుకున్నప్పుడు పార్టీ నుంచి అనుమతి తీసుకోవాలి. పార్టీలో ఉన్న కీలక నాయకులతోనూ చర్చించాలి. కానీ, ఇది ఏమీ లేకుండా ఎవరి ఇష్టానుసారం వారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వాటిని వైరల్ చేయటం కూడా వైసీపీలో చర్చనీయాంశంగా మారింది.
దీనిని తీవ్రంగా భావిస్తున్న పార్టీ అధిష్టానం సతీష్ కుమార్ కు సంబంధించి ఎవరు పోస్ట్ పెట్టారు అనే విషయంపై ఆరా తీస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకళ్ళు చేస్తున్న తప్పులు పార్టీ మొత్తానికి చుట్టుకుంటున్నాయని అధినేత భావిస్తున్నారు. గతంలో కూడా కర్నూలు బస్సు ప్రమాదం కావచ్చు కోనసీమలో జరిగిన బాలిక వ్యవహారం అనంతరం చోటు చేసుకున్న నిందితుడి ఆత్మహత్య వంటివి కూడా వైసిపి ఇలానే సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసింది. వాస్తవానికి ఇలాంటి కేసుల్లో ప్రజలు సున్నితంగా ఉంటారు.
ఏ చిన్న విషయాన్ని అయినా సీరియస్ గా తీసుకుంటారు. ఇలాంటి సమయంలో వైసిపి అయినా వేరే పార్టీ అయినా ఆచితూచి అడుగులు వేయాలి. ఇవి రాజకీయపరమైన అంశాలు కావు. అత్యంత కీలకమైనటువంటి కేసులు. కానీ, ఇటువంటి వాటిని కూడా ఏదో చిన్న చిన్న అంశాలుగా భావిస్తూ రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేయటం ఇప్పుడు వైసీపీకి ఇబ్బందిగా మారింది. దీనిని అరికట్టకపోతే ముఖ్యంగా సోషల్ మీడియాలో దూకుడుగా ఉన్నటువంటి నాయకులను కంట్రోల్ చేయకపోతే భవిష్యత్తులో పార్టీకి మరిన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అన్నది పార్టీ నాయకులు చెబుతున్న మాట. మరి జగన్ ఏ విధంగా అడుగులు వేస్తారనేది చూడాలి.
