లోకేష్ నలభై...పవన్ పాతిక...జగన్ ముప్పై !
ఈ అంకెలేంటి ఈ లెక్కలేంటి అని అనుకుంటున్నారా. ఏమీ కంగారు పడాల్సింది లేదు. ఈ అంకెలు రాజకీయ గణిత శాస్త్రంలో కీలకమైనవి.
By: Tupaki Desk | 30 May 2025 4:00 PM ISTఈ అంకెలేంటి ఈ లెక్కలేంటి అని అనుకుంటున్నారా. ఏమీ కంగారు పడాల్సింది లేదు. ఈ అంకెలు రాజకీయ గణిత శాస్త్రంలో కీలకమైనవి. మన నాయకులు వారి ఆకాంక్షలకు ప్రతిబింబాలుగా చూడాల్సి ఉంది. ఏపీలో చూస్తే ముగ్గురు భవిష్యత్తు నాయకుల లక్ష్యాలుగా కూడా వీటిని భావించాల్సి ఉంది.
ఏపీలో సుదీర్ఘమైన రాజకీయ జీవితం అందుకున్న వారు చంద్రబాబు. ఆయన రాజకీయ జీవితం 2028 నాటికి అక్షరాలా యాభై ఏళ్ళు. బాబు మాదిరిగా అర్ధ శతాబ్ద రాజకీయం చేయాలని అందరికీ ఉంటుంది. ఆ తరువాత తరంలో చూస్తే ముగ్గురు నాయకులు దానికి తగిన ప్రాతిపదికను తయారు చేసుకుంటున్నారు. వారిలో ఒకాయన ఇప్పటికే ముఖమంత్రి అయ్యారు. ఆయనే జగన్. తన రాజకీయ జీవితం మరో ముప్పయ్యేళ్ళ పాటు కొనసాగిస్తాను అని జగన్ పార్టీ నాయకులకు పదే పదే చెబుతున్నారు.
నాతో కలసి వచ్చే వారు పార్టీ కోసం నిబద్ధతో పనిచేయాలని ఆయన సూచిస్తున్నారు. తాను సుదీర్ఘమైన రాజకీయాన్ని చేస్తాను అని భరోసా ఇస్తున్నారు. ఈ మధ్యలో గెలుపు ఓటములు తనను ఏ మాత్రం ప్రభావితం చేయవని పార్టీ నేతలు కూడా కష్టాలు శాశ్వతం అనుకుని కృంగిపోకుండా ముందుకు అడుగులు వేయాలని జగన్ కోరుతున్నారు. సో జగన్ రాజకీయ జీవితం మరో మూడు దశాబ్దాలు అన్న మాట. అంటే 2055 దాకా జగన్ రాజకీయ రంగంలో క్రియాశీలంగా ఉంటాను అని చెబుతున్నారని అనుకోవాలి.
ఇక టీడీపీకి ఫ్యూచర్ లీడర్, కాబోయే సీఎం గా అందరి చేత పిలిపించుకుంటున్న నారా లోకేష్ మరో నాలుగు దశాబ్దాల రాజకీయం చేస్తాను అని అంటున్నారు. మహానాడులో మూడు రోజుల పాటు జరిగిన కార్యక్రమంలో ఆయన స్పీచ్ వింటే అదే అర్థం అవుతుంది. మరో నాలుగు దశాబ్దాల పాటు టీడీపీని నిలబెడతామని శపధం చేస్తున్నారు. లోకేష్ వయసు ఇపుడు 42 ఏళ్ళు. ఆయన 82 ఏళ్ళ వయసు వచ్చేంతవరకూ తాను ఎత్తిన టీడీపీ జెండాను వదిలిపెట్టను అని అంటున్నారు. సో లోకేష్ భారీ టార్గెట్ నే సెట్ చేసుకున్నారన్న మాట.
ఇక జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విషయం తీసుకుంటే పాతికేళ్ళ రాజకీయం అన్నది ఆయన స్లోగన్. ఆయన అసలైన రాజకీయం 2024 నుంచే స్టార్ట్ అయింది అని చెప్పుకోవాల్సి ఉంటుంది. అన్ని ఆశలు తీరి ఉప ముఖ్యమంత్రి వంటి కీలక పదవి ఆయనను వరించింది. దాంతో ఆయన ప్రజలకు చేయాల్సిన సాయం చేయగలుతున్నారు ఇక ఇదే ఊపుతో ఆయన మరిన్ని సార్లు కూటమి గెలవాలని బలంగా కోరుకుంటున్నారు. అంతే కాదు, పాతికేళ్ళ పాటు రాజకీయం చేయడం ద్వారా ఏపీ రూపురేఖలను మార్చాలని పవన్ తపన పడుతున్నారు.
దాంతో పవన్ రాజకీయ లక్ష్యాలు 2050 దాకా విస్తరించి ఉన్నాయని అంటున్నారు. ఆనాటికి పవన్ వయసు కూడా ఎనభై పడిలో పడుతుందని అంటున్నారు. ఇక జగన్ కూడా మరో ముప్పయ్యేళ్ళు అంటే 80 ఏళ్ళ వయసు దాకా రాజకీయాల్లో చురుకుగా ఉండాలనే భావిస్తున్నారు అన్న మాట. లోకేష్ ది అదే రూట్. సో చంద్రబాబు తో సమానంగా ఎనభయ్యేళ్ళ వయసు తమకు వచ్చేవరకూ తామూ రాజకీయాలు చేస్తామని ఈ ముగ్గురు కీలక నేతలు గట్టిగానే చెబుతున్నారు. సో ఏపీ భవిష్యత్తు రాజకీయం అంతా వీరి చేతుల్లోనే ఉండబోంది అన్న మాట. సో వీరు ఏ వ్యూహాలతో ముందుకు సాగుతారు అన్నది తెలియాలంట్ వెయిట్ అండ్ సీ.
