బాబుకు ఫస్ట్ టైం జగన్ అలా !
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ల మధ్య రాజకీయ ప్రత్యర్ధిత్వం ఎంత భీకరంగా ఉంటుందో అందరికీ తెలిసిందే.
By: Satya P | 22 Nov 2025 9:26 AM ISTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ల మధ్య రాజకీయ ప్రత్యర్ధిత్వం ఎంత భీకరంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరూ కూడా అసెంబ్లీ సమావేశాలలోనూ వాదోపవాదాలు చేసుకుంటూ కనిపించేవారు. ఇక సభలో తప్ప విడిగా వేరేగా ఒకరిని ఒకరు మర్యాదపూర్వకంగా అయినా పలకరించిన సందర్భాలు అయితే పెద్దగా లేవనే అంటారు. మరో వైపు చూస్తే టీడీపీని రాజకీయంగా లేకుండా చేయాలని వైసీపీ అధికారంలో ఉన్నపుడు ప్రయత్నం చేస్తే 2014లోనూ ప్రస్తుతం వైసీపీని గట్టిగా అణచాలని టీడీపీ విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉంది.
తొలిసారి లేఖ :
ఈ నేపథ్యంలో ఆశ్చర్యకరంగా వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక లేఖ రాశారు. అందులో కీలకమైన అంశాన్నే ప్రస్తావించారు. అయితే ఆ విషయం దాని సీరియస్ నెస్ ని పక్కన పెడితే జగన్ బాబుకు ఇప్పటిదాకా లేఖ అయ్హితే రాసింది లేదని అంటున్నారు. ఆయన గతంలో ప్రతిపక్షంలో ఉన్నపుడు కానీ మరెప్పుడు కానీ లేఖ రాసింది లేదనే చెబుతారు. అయితే ఈసారి అది కూడా కూటమి గెలిచి అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు అవుతున వేళ బాబుకి జగన్ ఒక సుదీర్ఘమైన లేఖనే సంధించారు. ఆ లేఖ చూస్తే ఏకంగా తొమ్మిది పేజీలుగా ఉంది.
క్రిష్ణా జలాల విషయమై :
ఏపీకి న్యాయంగా దక్కాల్సిన క్రిష్ణా జలాల విషయంలో కూటమి ప్రభుత్వం అన్యాయం చేయాలని చూస్తే సహించేది లేదని జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు. అంతే కాదు ఈ విషయం మీద క్రిష్ణా ట్రిబ్యునల్ వద్ద గట్టిగా ఏపీ తన వాదనలు వినిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణాకు క్రిష్ణా నదిలో 736 టీఎంసీల నీటిని కేటాయించాలని చూస్తే మాత్రం ఏపీ రైతాంగం తో పాటు ప్రజలు పూర్తిగా నష్టపోతారు అని జగన్ ఆ లేఖలో ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
అల్మట్టి డ్యాం ప్రస్తావన :
చంద్రబాబు ఉమ్మడి ఏపీ సీఎం గా ఉన్నపుడే ఆల్మట్టి డ్యాం విషయంలో 519 మీటర్ల నుంచి 524 మీటర్ల దాకా ఎత్తుని పెంచుకున్నారని దాని వల్ల రాయలసీమకు తీరని అన్యాయం జరిగిందని జగన్ గుర్తు చేశారు. ఇక 2014లో బాబు అధికారంలోకి వచ్చినపుడు కూడా క్రిష్ణా జలాల విషయంలో పట్టించుకోలేదని జగన్ విమర్శించారు. ఇపుడు కూడా అలాంటి పరిస్థితులే ఏర్పడబోతున్నాయని ఆయన అంటున్నారు ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 512 టీఎంసీల నీటిలో ఒక్క చుక్క తగ్గినా ఏపీ రైతాంగం నష్టపోతారని తమ పార్టీ చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు ఈ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని జగన్ కోరారు. మొత్తం మీద ముఖ్యమంత్రిగా చంద్రబాబుని ఉద్దేశించి జగన్ రాసిన అంశాలు సీరియస్ గానే ఉన్నాయి. జగన్ లేఖ రాయడం కూడా సంచలనంగా ఉంది అని అంటున్నారు.
