Begin typing your search above and press return to search.

జగన్ కేటీఆర్ ఒకేసారి...2027 లో ఏం జరగబోతోంది ?

ఏపీ నుంచి జగన్ తెలంగాణా నుంచి కేటీఆర్ ఒకేసారి రంగంలోకి దిగబోతున్నారు. ఈ ఇద్దరు నేతలు లక్ష్యం ఒక్కటే. కుంభ స్థలాన్ని కొట్టడమే.

By:  Satya P   |   13 April 2026 9:21 AM IST
జగన్ కేటీఆర్ ఒకేసారి...2027 లో ఏం జరగబోతోంది ?
X

ఏపీ నుంచి జగన్ తెలంగాణా నుంచి కేటీఆర్ ఒకేసారి రంగంలోకి దిగబోతున్నారు. ఈ ఇద్దరు నేతలు లక్ష్యం ఒక్కటే. కుంభ స్థలాన్ని కొట్టడమే. అధికార పీఠం పట్టడమే. జగన్ అయితే 2017 లో సుదీర్ఘమైన పాదయాత్ర చేపట్టి 2019లో బంపర్ విక్టరీ కొట్టారు. 151 సీట్లతో ఘన విజయం సాధించారు. మరోసారి 2027 లో భారీ ఎత్తున పాదయాత్ర చేస్తాను అని జగన్ ఇప్పటికే పలు మార్లు ప్రకటించరు. ఇక కేటీఆర్ కి పాదయాత్ర ఇదే ఫస్ట్ టైం కాబోతోంది. ఆయన కూడా 2027 లో పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నట్లుగా తెలియచేశారు.

అధికార మార్గం :

ఉమ్మడి ఏపీలో పాదయాత్ర చేసిన హిస్టరీ వైఎస్సార్ కి చంద్రబాబుకు ఉంది. ఇక విభజన ఏపీలో జగన్ కి ఆ క్రెడిట్ ఉంది. ఇపుడు తెలంగాణాలో కేటీఆర్ పాదయాత్రకు తాను రెడీ అని చెప్పడంతో అక్కడ రాజకీయం వేడెక్కబోతోంది. నిజానికి రాజకీయాల్లో పోయిన చోటనే వెతుక్కోవాలని చెబుతారు. పాదయాత్ర అంటే నేరుగా జనాలను కలవడమే. వారి సమస్యలను దగ్గర ఉండి వినడమే. అలా జనంలో ఉంటూ పాపులారిటీని సంపాదించడమే. ఇలా చేసిన వారు అంతా అధికారం అందుకున్నారా అంటే మెజారిటీ మాత్రం విజయం సాధించారు. అందుకే పాదయాత్ర తెలుగు రాజకీయాల్లో ఒక బ్రహ్మాస్త్రంగా మారుతోంది.

జగన్ కి తెలుసు :

ఏపీలో చూసుకుంటే వైఎస్ జగన్ కి అన్నీ తెలుసు. పాదయాత్ర పవర్ ఏంటో ఇంకా బాగా తెలుసు. ఆయన అందుకే 2027 నుంచి 2029 మొదటి దాకా అంటే దాదాపుగా ఇరవై నెలలకు పైగా సుదీర్ఘ పాదయాత్రను ఎంచుకుంటున్నారు. అయిదు వేల కిలోమీటర్లకు పైగా ఈసారి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రతీ గ్రామం తాను టచ్ చేస్తాను అని జగన్ చెబుతున్నారు. ఆ విధంగా రూట్ మ్యాప్ ని కూడా సిద్ధం చేసే పనిలో పార్టీ ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతోంది. మరో వైపు చూస్తే జగన్ కి పాదయాత్ర సెంటిమెంట్ కలిసి వచ్చింది. దాంతో ఆయన మరోసారి జనం వద్దకు వెళ్ళి అక్కడ నుంచే అధికార అందలం అందుకోవాలని చూస్తున్నారు.

కేటీఆర్ కి కొత్త :

ఇక కేసీఆర్ అయితే తెలంగాణా మలి విడత ఉద్యమాన్ని పీక్స్ లోకి చేర్చి అధికారంలోకి వచ్చారు. ఆయనకు పాదయాత్ర చేయాల్సిన అవసరం లేకపోయింది. వరసగా పదేళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో కేటీఆర్ కి కూడా ఆ పరిస్థితి లేదని చెప్పాలి. కానీ 2023లో బీఆర్ఎస్ ఓటమి పాలు అయింది. దాంతో ఈసారి చావో రేవో అన్నట్లుగా 2028 ఎన్నికలు ఉండబోతున్నాయి. దాంతో కేటీఆర్ జనంలోకి రావాల్సిన అనివార్యత ఏర్పడింది. ఆయనే చెప్పినట్లుగా జనంతో కనెక్షన్ తగ్గిందని భావిస్తున్నారు. అందుకోసేమే పాదయాత్ర చేయాలని భావిస్తున్నారు. దాంతో కేటీఆర్ తొలిసారి ఈ పెద్ద రాజకీయ ప్రయోగాన్ని నమ్ముకున్నారని అంటున్నారు.

రాజకీయంగా సంచలనమేనా :

ఇక ఏపీలో చూస్తే కూటమి ప్రభుత్వం మీద జగన్ సంధిస్తున్న అస్త్రమే పాదయాత్ర. తాను ఏకంగా ఎన్నికల దాకా జనంలోనే ఉంటూ వారి సమస్యలు వింటూ అక్కడ నుంచే ప్రభుత్వాన్ని నిలదీస్తాను అని జగన్ చెబుతున్నారు. దాంతో అది ఎన్నికల్లో వైసీపీకి భారీ అడ్వాంటేజ్ కలిగిస్తుందని ఆయన నమ్ముతున్నారు అంతే కాదు రాజకీయ సంచలనాలు నమోదు చేస్తుందని ధీమాగా ఉన్నారు. అదే విధంగా తెలంగాణాలో రేవంత్ రెడ్డి సర్కార్ మీద బీఆర్ఎస్ పూరిస్తున్న పదునైన శంఖారావం కేటీఆర్ పాదయాత్ర అని చెబుతున్నారు. ఈ పాదయాత్ర ద్వారా కేటీఆర్ పాపులారిటీని ఇంకా పెంచుకుని కాబోయే సీఎం గా ప్రొజెక్ట్ అయ్యేందుకు ఆస్కారాలు ఉంటాయని భావిస్తున్నారు. మొత్తానికి పాదయాత్ర అంటే ప్రతీ రోజూ రాజకీయ సందడే. అదే సమయంలో రాజకీయ రచ్చగానే ఉంటుంది. సో ఏపీ తెలంగాణా రాజకీయాలో ఈ ప్రభావం ఏ విధంగా పడుతుందో చూడాల్సి ఉంది.