Begin typing your search above and press return to search.

కేసీఆర్ బస్సు రెడీ...జగన్ సంగతేంటి ?

ఇక కేసీఆర్ కానీ జగన్ కానీ అనేక సార్లు ప్రకటనలు అయితే చేశారు. తాము జనంలోకి వస్తున్నామని పార్టీ మీటింగులలో చెప్పారు. అయితే అవి ఆచరణలో మాత్రం జరగలేదు.

By:  Satya P   |   11 Jun 2026 9:15 AM IST
కేసీఆర్ బస్సు రెడీ...జగన్ సంగతేంటి ?
X

ఏపీ తెలంగాణా రెండు చోట్లా ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రులు అయిన జగన్ కేసీఆర్ రాజకీయం ఒక్కలాగానే సాగుతోంది. ఇద్దరూ అసెంబ్లీకి పోవడం లేదు, అంతే కాదు జనంలోకి కూడా పెద్దగా రావడం లేదు, కేసీఆర్ ఓటమి తరువాత ఎర్రవల్లిలోని తన ఫాం హౌజ్ కే పరిమితం అయ్యారు. అడపా దడపా అక్కడే పార్టీ మీటింగ్స్ ని నిర్వహిస్తున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు. హరీష్ రావు కేటీఆర్ ఇద్దరూ నిలదీస్తున్నా ఆ ప్రభావం అయితే అంతగా కనిపించడం లేదు. అలాగే ఈ ఇద్దరు నేతలూ తెలంగాణాలో పర్యటిస్తున్నారు. బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేస్తున్నారు కానీ రేవంత్ రెడ్డి ధాటికి గులాబీ పార్టీ అయితే పెద్దగా ఆనడం లేదని అంటున్నారు.

జగన్ సైతం :

ఇక ఏపీలో చూస్తే జగన్ కూడా బెంగళూరు నుంచి తాడేపల్లి కి వస్తున్నారు. అక్కడ వీలైనప్పుడల్లా పార్టీ మీటింగ్స్ ని నిర్వహిస్తున్నారు. ఆ మీదట ఆయన పార్టీ నాయకత్వానికి పని చెబుతున్నారు. పోరాటాలు అన్నీ వారి చేతనే చేయిస్తున్నారు. పార్టీలోని ఇతర నాయకుల ద్వారానే అంతా నడిపిస్తున్నారు. ఇక అసెంబ్లీకి వైసీపీ దూరంగా ఉంటోంది. మండలికి మాత్రం హాజరై అక్కడ కూటమిని ఎదుర్కోంటొంది. ఇలా ఎంత చేసినా జగన్ జనంలోకి రావడం లేదు అన్నది అయితే ఉంది. దాంతో రెండేళ్ళ కూటమి పాలనలో పెద్దగా వైసీపీ ప్రభావం రాజకీయంగా కనిపించడం లేదని కూడా అంటున్నారు.

ప్రకటనలతోనే :

ఇక కేసీఆర్ కానీ జగన్ కానీ అనేక సార్లు ప్రకటనలు అయితే చేశారు. తాము జనంలోకి వస్తున్నామని పార్టీ మీటింగులలో చెప్పారు. అయితే అవి ఆచరణలో మాత్రం జరగలేదు. జగన్ అయితే జిల్లాల పర్యటనలు చేస్తామని చెప్పారని పార్టీ వర్గాల భోగట్టా. కానీ అదిగో ఇదిగో అంటూనే అంతా జరిగిపోతోంది. కేసీఅర్ కూడా తెలంగాణ వ్యాప్తంగా మూడు భారీ బహిరంగ సభలు పెట్టి మరీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద సమర భేరీ మోగిస్తామని చెప్పారు. కానీ అది కూడా జరగలేదు అయితే ఇపుడు ఒక ప్రచారం అయితే బీఆర్ఎస్ వర్గాల నుంచి వస్తోంది. తొందరలోనే కేసీఆర్ బస్సు యాత్ర చేస్తారు అని. ఆయన తెలంగాణా వ్యాప్తంగా రాష్ట్రమంతటా బస్సులో తిరిగి జనంతోనూ పార్టీ జనంతోనూ మమేకం అవుతారు అని అంటున్నారు.

జగన్ యాక్షన్ ప్లాన్ :

ఇక జగన్ విషయం తీసుకుంటే 2027లో భారీ పాదయాత్ర ప్రారంభించాలని చూస్తున్నారు అని పార్టీ వర్గాల భోగట్టా. అలా 2029 ఎన్నికల దాకా జనంలో ఉంటే సరిపోతుంది అప్పటికి కూటమి ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వస్తుందని జనంలో ఆ ఇంపాక్ట్ కనిపిస్తుంది అని భావిస్తున్నారు అంటున్నారు. అయితే 2027 జూలై తరువాత పాదయాత్ర ఉంటుందని కూడా చూచాయగా చెబుతున్నారు. కానీ చూస్తే మరో ఏడాదికి పైగా సమయం ఉంది. అంత కాలం పాటు పార్టీలో ఉత్తేజం లేకుండా ఉంటే ఎలా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. పాదయాత్ర చేయవచ్చు కానీ ఈ లోగా జగన్ జిల్లాల పర్యటనలు చేస్తే బాగుంటుంది అన్న సూచనలు కూడా వస్తున్నాయి. ఏపీలో ఉమ్మడి పదమూడు జిల్లాలలో జగన్ పర్యటనలు పెట్టుకుని నెలకు ఒక జిల్లాలో తిరిగినా పార్టీ పూర్తిగా రీ యాక్టివ్ అవుతుందని క్యాడర్ సైతం ఉత్సాహంగా ఉంటుందని అంటున్నారు. మరి వైసీపీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. కేసీఆర్ అయితే బస్సు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ లో ప్రచారం అయితే ఉంది.