Begin typing your search above and press return to search.

విండ్ షీల్డ్ దెబ్బ తిన్న హెలికాఫ్టర్ ఎక్కడ?

ఇటీవల కాలంలో ఒక పార్టీ అధినేత కం మాజీ ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వచ్చిన వేళలో.. హెలిప్యాడ్ వద్ద చోటు చేసుకున్న పరిణామాలు మరెక్కడా చోటు చేసుకోలేదని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   11 April 2025 9:53 AM IST
Mystery Surrounds Jagans Chopper
X

హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు శ్రీసత్యసాయి జిల్లాలోని రామగిరికి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావటం తెలిసిందే. జగన్ పర్యటన వేళ.. జనసమీకరణ చేయకూడదని జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పినప్పటికి.. ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నది అందరూ చూసిందే. ఈ వ్యవహారం ఇప్పుడో వివాదంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి పర్యటనకు వస్తే భద్రత విషయంలో పోలీసులు గాలికి వదిలేశారన్న విమర్శ వైసీపీ నేతలు చేస్తుంటే..తాము చెప్పిన ఏ విషయాన్ని పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వైసీపీ నేతలు వ్యవహరించారన్నది అధికారులు చెబుతున్నారు.

ఇటీవల కాలంలో ఒక పార్టీ అధినేత కం మాజీ ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వచ్చిన వేళలో.. హెలిప్యాడ్ వద్ద చోటు చేసుకున్న పరిణామాలు మరెక్కడా చోటు చేసుకోలేదని చెబుతున్నారు. అసలేం జరిగిందన్న విషయాన్ని పక్కన పెడితే.. ఈ ఎపిసోడ్ మొత్తంలో జగన్ కు భద్రత కల్పించే విషయంలో కూటమి సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్న భావన కలిగినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో పోలీసు అధికారులు తమ తప్పు లేదని.. అంతా వైసీపీ నేతల తీరుతోనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. జగన్ వచ్చిన హెలికాఫ్టర్.. తిరిగి వెళ్లే వేళలో జగన్ ను తీసుకెళ్లకుండా వెళ్లిపోవటం తెలిసిందే. విండ్ షీల్డ్ విరిగినట్లుగా చెప్పటం.. ఆ తర్వాత హెలికాఫ్టర్ ఎక్కడకు వెళ్లిందన్న సమాచారం కోసం ఆరా తీసిన పోలీసులకు షాక్ తగిలిన పరిస్థితి. దీనికి కారణం.. హెలికాఫ్టర్ ఎక్కడకు వెళ్లిందన్న విషయం తేలకపోవటమే. బెంగళూరులోని జక్కూరు నుంచి జగన్ ప్రయాణించిన హెలికాఫ్టర్ బయలుదేరినట్లుగా గుర్తించిన పోలీసులు.. తిరిగి అక్కడకు చేరుకోలేదన్న విషయాన్ని గుర్తించారు.

దీంతో.. హెలికాఫ్టర్ ఎటు వెళ్లిందన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. దీంతో హెలికాఫ్టర్ ను సమకూర్చిన సంస్థను పోలీసులు వివరాలు కోరగా.. వారు స్పందించిన తీరు మరింత ఆశ్చర్యకరంగా మారినట్లు చెబుతున్నారు. తమకు లిఖితపూర్వకంగా వివరాలు అడిగితే.. అప్పుడు మాత్రమే స్పందిస్తామని సంస్థ ప్రతినిధులు చెప్పటంతో పోలీసులు వెనుదిరిగినట్లుగా తెలుస్తోంది. ఇంతకూ హెలికాఫ్టర్ కు ఎంత డ్యామేజ్ జరిగింది? హెలికాఫ్టర్ ఎక్కడకు వెళ్లింది? జగన్ ను వదిలేసి వెళ్లిన పైలెట్ ఆ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారు? హెలికాఫ్టర్ తిరుగు ప్రయాణానికి సంబంధించిన సమాచారం అధికారులకు ఎందుకు ఇవ్వలేదు? లాంటి ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారినట్లు చెబుతున్నారు.