Begin typing your search above and press return to search.

24 కేసులు ఉన్న చంద్రబాబును కొడతారా? వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించిన వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   3 Jun 2025 3:27 PM IST
24 కేసులు ఉన్న చంద్రబాబును కొడతారా?  వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
X

గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించిన వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కానిస్టేబుల్ పై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురి యువకులను తెనాలి పోలీసులు బహిరంగంగా దండించడాన్ని తప్పుపట్టిన జగన్.. యువకుల కుటుంబ సభ్యులను కలిశారు. కేసులు ఉన్నంత మాత్రాన నేరం చేసినట్లు కాదని, కేసు పెట్టిన పోలీసులే తీర్పులిచ్చేస్తారా? అంటూ మాజీ సీఎం ప్రశ్నించారు. కేసులు ఉన్నవారిపై దాడి చేస్తామంటే.. 24 కేసులు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబును కొడతారా? అంటూ పోలీసులను నిలదీశారు జగన్.

తెనాలి పర్యటనలో సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. కానిస్టేబుల్ చిరంజీవిపై దాడి చేశారనే ఆరోపణలతో ముగ్గురు యువకులను పోలీసులు నడిరోడ్డుపై లాఠీతో కొట్టారు. అయితే వారు రౌడీషీటర్లు అని, ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవడం లేదని పోలీసులు చెబుతుండగా, నేరం చేసిన వారిని దండించే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నిస్తున్నారు జగన్. ఎవరినైనా శిక్షించే అధికారం కోర్టులకు మాత్రమే ఉందని అభిప్రాయపడిన మాజీ సీఎం.. తెనాలి పోలీసుల దాడిలో గాయపడిన వారికి న్యాయ సహాయం చేస్తామని, వారి కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

పోలీసుల చేతిలో గాయపడిన జాన్ విక్టర్, రాకేశ్, బాబూలాల్ కుటుంబాలను జగన్ పరామర్శించారు. జాన్ విక్టర్ జూనియర్ లాయరుగా పనిచేస్తున్నాడని, బాబూలాల్ అలియాస్ కరిముల్లా మెకానిక్ గా పనిచేస్తున్నాడని జగన్ చెప్పారు. మంగళగిరికి చెందిన వీరిని తెనాలి పోలీసులు తీసుకువచ్చి కొట్టడమేంటని ఆయన ప్రశ్నించారు. రాకేశ్ అన్న యువకుడు హైదరాబాద్ లో ఉంటున్నాడని, పాత కేసులో కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చిన అతడిని మిగిలిన వారు కలిశారని నాటి సంఘటనను జగన్ తెలిపారు. అయితే సివిల్ డ్రెస్సులో ఐతానగర్ అంబేద్కర్ బొమ్మ వద్దకు వచ్చిన కానిస్టేబుల్ మరో వ్యక్తితో గొడవ పడుతుండగా, ఈ ముగ్గురు అడ్డుకున్నారని, దాంతో కానిస్టేబుల్ ఫిర్యాదుపై పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని తీవ్రంగా గాయపరిచారని జగన్ వెల్లడించారు.

కానిస్టేబుల్ గాయపడితే వెంటనే కేసు ఎందుకు పెట్టలేదని, పోలీసులు అదుపులోకి తీసుకున్న 24 గంటల్లోగా యువకులను కోర్టులో ఎందుకు హాజరు పరచలేదని ప్రశ్నించారు. ముగ్గురు యువకులను నడిరోడ్డుపై కొట్టడం సరికాదని, వారి పరువు తీసే ప్రయత్నం చేశారని విమర్శించారు. కేసు టు టౌన్ పోలీసు స్టేషనులో నమోదైతే, ఆ స్టేషనుకు సంబంధం లేని మరో సీఐ అక్కడికి వచ్చి ఎందుకు దాడి చేశారని నిలదీశారు జగన్. యువకుల జేబులో కత్తిపెట్టి, సంఘటన జరిగిన తర్వాత రౌడీషీట్లు తెరిచారని వెల్లడించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యంగం అమలు చేయడం వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని ఆరోపించారు జగన్. కాగా, తెనాలి పర్యటనలో మాజీ సీఎం జగన్ కు చేదు అనుభవం ఎదురైంది. వైసీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి జగన్ ర్యాలీగా వస్తుండగా, దళిత సంఘాలకు చెందిన నేతలు నల్ల బెలూన్లు ఎగరవేసి నిరసన తెలిపారు.