Begin typing your search above and press return to search.

నాయకుడు కాదు నాటకాల రాయుడు.. చంద్రబాబుపై జగన్ సెటైర్లు

ముఖ్యమంత్రి చంద్రబాబుపై సెటైర్లు వేస్తూ మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. మూడు లక్షల గృహ ప్రవేశాలంటూ హడావిడి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు యథావిధిగా క్రెడిట్ చోరీ చేస్తున్నారని ధ్వజమెత్తారు.

By:  Tupaki Political Desk   |   13 Nov 2025 12:23 PM IST
నాయకుడు కాదు నాటకాల రాయుడు.. చంద్రబాబుపై జగన్ సెటైర్లు
X

ముఖ్యమంత్రి చంద్రబాబుపై సెటైర్లు వేస్తూ మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. మూడు లక్షల గృహ ప్రవేశాలంటూ హడావిడి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు యథావిధిగా క్రెడిట్ చోరీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. బుధవారం అన్నమయ్య జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 లక్షల ఇళ్లను నిర్మించినట్లు ప్రకటించారు. అదేవిధంగా వచ్చే ఉగాదికి 5.90 లక్షల ఇళ్లను పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే సీఎం పర్యటనపై గురువారం స్పందించిన మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ తన ఎక్స్ అకౌంటులో సుదీర్ఘ పోస్టు రాశారు. చంద్రబాబు ప్రభుత్వం ఒక్క ఇంటికీ పట్టా ఇవ్వకుండా, ఒక్క పైసా డబ్బు ఖర్చు చేయకుండా ‘క్రెడిట్ చోరీ’కి పూనుకుందని విమర్శలు గుప్పించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబుపై పలు వ్యంగ్యస్త్రాలు సంధించిన జగన్ ట్వీట్ ను వైసీపీ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి. ‘‘చంద్రబాబుగారూ… మీ కథ, స్క్రీన్‌, ప్లే, దర్శకత్వంలో విజయవంతంగా నడుస్తున్న ‘క్రెడిట్‌ చోరీ స్కీం’ చాలా బాగుంది. పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వడానికి ఈ 18 నెలల కాలంలో ఒక్క గజం స్థలం కూడా సేకరించకుండా.. ఒక్కరికి ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వకుండా… దీనికోసం ఒక్కపైసా కూడా ఖర్చుచేయకుండా… ఒక్కరికి ఒక్క ఇల్లుకూడా మంజూరు చేయకుండా… గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి స్థలాల్లో నిర్మాణంలో ఉన్నవాటిని పట్టుకుని “ఇళ్లన్నీ మేమే కట్టేశాం” అంటూ పచ్చి అబద్ధాలను కళ్లార్పకుండా, ఏ మాత్రం సిగ్గుపడకుండా, బల్లగుద్దీ మరీ చెప్తున్నారు’’ అంటూ ట్వీట్ చేశారు జగన్. అంతేకాకుండా గృహ నిర్మాణంపై క్రెడిట్‌ మీదేనంటూ మీరు చేస్తున్న క్రెడిట్‌ చోరీ స్కీం హేయంగా ఉంది. ఇతరుల కష్టాన్ని తన గొప్పతనంగా చెప్పుకునేవాడు నాయకుడు కాదు, నాటకాల రాయుడు అంటారని జగన్ ధ్వజమెత్తారు.

చంద్రబాబు ప్రభుత్వం ప్రారంభించామని చెప్పుకుంటున్న 3,00,092 ఇళ్లలో ఒక్క ఇంటిపట్టా కూడా కూటమి ప్రభుత్వంలో ఇవ్వలేదని మాజీ సీఎం తెలిపారు. 3,00,092 ఇళ్లలో 1,40,010 ఇళ్లు తన ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యే దశకు చేరుకున్నట్లు జగన్ వివరించారు. 87,380 ఇళ్లు శ్లాబ్‌ లెవల్‌ వరకూ పూర్తయ్యాయి. 66,845 ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని జగన్ వెల్లడించారు. ఇవికాక 2023 అక్టోబరు 12న ఒకేసారి 7,43,396 ఇళ్లలో ఒకేరోజు గృహప్రవేశాలతో మా ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని జగన్ ప్రకటించారు. ఇన్ని వాస్తవాలు కళ్ళముందే ఉన్నా… అసలు వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఏమీ చేయనట్టుగా, మీరే అన్నీ చేసినట్టుగా పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్న మీ స్కీం చాలా హేయం అంటూ జగన్ ధ్వజమెత్తారు.

తమ ప్రభుత్వంలో 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల ఇళ్ల పట్టాలను మహిళల పేరున రిజిస్ట్రేషన్‌ చేయించామని తెలిపారు. 21.75 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చామన్నారు. కోవిడ్‌లాంటి మహమ్మారి ద్వారా తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొంటూ 9 లక్షలకుపైగా ఇళ్లను మా హయాంలోనే పూర్తిచేసినా, అన్నీ మీరే చేశారన్నట్టుగా చెప్పడమే కాకుండా, మీ ఎల్లోమీడియా ద్వారా ప్రచారం చేయించుకుని, ఆ క్రెడిట్‌ కొట్టేయాలనుకుంటున్న మీ స్కీం చాలా హేయం చంద్రబాబు అంటూ జగన్ విమర్శలు గుప్పించారు. ఒకరి కష్టాన్ని కొట్టేయడంలో, ఒకరి ఐడియాను మీదిగా చెప్పుకోవడంలో, ఆ పేదల ఇళ్లస్థలాలను సైతం లాక్కునే ప్రయత్నం చేయడం, అసలు ఆ క్రెడిట్‌ చోరీలో మీకు మీరే సాటి అంటూ జగన్ వ్యంగ్యస్త్రాలు సంధించారు.