Begin typing your search above and press return to search.

కూటమి టార్గెట్- జగన్ కొత్త విమర్శలు ఇంపాక్ట్ ?

ఏపీలో కూటమి ప్రభుత్వం మీద వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ విమర్శలు చేయడం సహజమే.

By:  Satya P   |   20 Feb 2026 6:00 AM IST
కూటమి టార్గెట్- జగన్ కొత్త విమర్శలు ఇంపాక్ట్ ?
X

ఏపీలో కూటమి ప్రభుత్వం మీద వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ విమర్శలు చేయడం సహజమే. ఆయన ఎపుడూ చేస్తూనే ఉంటారు. అందులో రొటీన్ గా చేసేవి కూడా చాలా ఉంటాయి. అయితే తాజాగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ కూటమి మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా కూటమిలోనూ ఇటు ప్రజలలలోనూ కొత్త ఆలోచనలు రేకెత్తించేలా జగన్ సరికొత్త విమర్శలు ఉన్నాయని అంటున్నారు.

విలాసం అంటూ :

ఈ ఆరోపణ ఇప్పటిదాకా ఏపీలో ఏ రాజకీయ పార్టీ కానీ ప్రత్యేకించి వైసీపీ నుంచి కానీ ఎవరూ చేయలేదు అని చెప్పాల్సి ఉంది. మూడు పవర్ సెంటర్లు కూటమిలో ఉన్నాయని విమర్శలు అయితే ఉన్నాయి. దానికి జత కలిపి జగన్ చేసిన ఈ సరికొత్త ఆరోపణలు కూటమిలోనూ జనంలోనూ చర్చకు పెట్టేలా ఉన్నాయి. నిజానికి మూడు పార్టీల పొత్తుతో ఏర్పాటు అయిన కూటమి ప్రభుత్వంలో టీడీపీది పెద్దన్న పాత్ర. ఆ పార్టీకి మొత్తం 164 సీట్లలో 135 సీట్లు ఉన్నాయి. ఇక జనసేనకు 21 సీట్లు, బీజేపీకి 8 సీట్లు ఉన్నాయి. చంద్రబాబు సీఎం. దాంతో ఆయన నాయకత్వం వహిస్తారు. ఆయనే కీలకంగా చెప్పాలి. కానీ జగన్ చేస్తున్న ఈ విమర్శలు చూస్తే చంద్రబాబు, లోకేష్ పవన్ ముగ్గురు విలాసాలకు ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారు అని అంటున్నారు.

జనంలో చర్చ కోసమేనా :

ఈ ముగ్గురికీ ప్రత్యేక విమానాలు ప్రత్యేక హెలికాప్టర్లు ఉన్నాయని అంటున్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో ఉంటే ఈ తరహా విలాసాలు అవసరమా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు దేశంలో బాధ్యత కలిగిన పదవులలో ఉన్న వారు ఎవరైనా ఈ విధంగా వ్యవహరిస్తున్నారా అని జగన్ నిలదీస్తున్నారు. సాధారణంగా ప్రజల సొమ్ముతో ఎవరైనా సోకు చేస్తున్నారు అంటే సగటు ప్రజానీకంలో వ్యతిరేకత వస్తుంది. జగన్ ఈ విమర్శలను చేయడం ద్వారా కూటమి ప్రభుత్వ పెద్దల గురించి జనం లోకి వెళ్లాలనే కోరుకుంటున్నారు అని అంటున్నారు.

అప్పుల ప్రస్తావన :

ఇక ఏపీలో అప్పులు కూడా అధికంగా కేవలం ఇరవై నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం చేసింది అని జగన్ చెప్పడం వెనక ఉద్దేశ్యం కూడా జనంలో ఆలోచనలు రేకెత్తించడమే అని అంటున్నారు. మొత్తం అయిదేళ్ళ తమ పాలనలో మూడున్నర లక్షల కోట్ల అప్పు చేస్తే కేవలం 20 నెలలలో మూడు లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు అని జగన్ చెబుతున్నారు. ఇంతలేసి అప్పులు చేసినా అభివృద్ధి లేదని సంపద సృష్టి జరగడం లేదని ఆయన అంటున్నారు.

సంక్షేమం మీద కూడా :

తాము ఇచ్చిన హామీలను నూటికి 99 శాతం నెరవేర్చామని జగన్ చెబుతున్నారు. అదే కూటమి పాలకులు అయితే సూపర్ సిక్స్ హామీలను అరకొరగానే చేస్తూ వచ్చారని సామాజిక పెన్షన్లలో ఇరవై నెలలలో ఆరు లక్షలకు పైగా కోత వేశారని కొత్త పెన్షన్లు ఇవ్వడం లేదని జగన్ విమర్శించారు. అదే విధంగా ఉచిత్ గ్యాస్ ఏడాదికి మూడు సిలిండర్లు అంటూ చెప్పినా ఎంతమందికి ఇచ్చారు అన్నది కూడా తెలియదని అన్నారు. ఇలా సూపర్ సిక్స్ హామీల మీద జగన్ చేసిన విమర్శలతో తామే సంక్షేమానికి చాంపియన్స్ అని చెప్పుకోవడంతో పాటు కూటమి ఏమీ చేయలేదని ఒక మేసేజ్ ని జనంలోకి పంపుతున్నారని అంటున్నారు. మొత్తం మీద జగన్ మీడియా సమావేశంలో ఏపీకి అప్పులు నెరవేరని హామీలు సంపద సృష్టి లేదు అని చెబుతూనే కూటమి పెద్దలు జల్సాలు అన్నది హైలెట్ చేశారు. మరి ఇవి జనంలోకి ఏ మేరకు వెళ్ళి ఇంపాక్ట్ కూటమి ప్రభుత్వం మీద పడుతుందో చూడాల్సి ఉంది.