చెవిరెడ్డి అరెస్ట్ పై జగన్ వ్యాఖ్యలు.. సిద్ధం సభలు గుర్తు చేస్తున్న జనాలు!
వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మద్యం కేసులో సిట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 19 Jun 2025 9:54 PM ISTవైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మద్యం కేసులో సిట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చెవిరెడ్డి విజయవాడలోని జిల్లా జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇలా మద్యం కేసులో సిట్ అధికారులు చెవిరెడ్డిని అరెస్ట్ చేయడంపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డికి సర్టిఫికెట్ ఇచ్చారు!
అవును... వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మద్యం కేసులో అరెస్టు చేయడంపై జగన్ స్పందించారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. చెవిరెడ్డి అమాయకుడని సర్టిఫికెట్ ఇచ్చారు. రాష్ట్రంలో కూటమి సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని.. దీనిని దారి మళ్లించేందుకే తమ పార్టీ నాయకులను అరెస్టు చేస్తున్నారని జగన్ చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా ఇప్పటివరకూ కేసులు మోపబడి, అరెస్టులు కాబడిన వైసీపీ నేతల చిట్టాను విప్పారు. ఇందులో భాగంగా.. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, వల్లభనేని వంశీ, నందిగాం సురేష్, పుష్ప శ్రీవాణి, విడదల రజనీ, మెరుగు నాగార్జున, పేర్ని నాని, కొడాలి నాని.. ఇలా అందరిపైనా కేసులు పెట్టారని జగన్ అన్నారు.
ఇదే సమయంలో... సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు.. వైవీ సుబ్బారెడ్డి, ఆయన కుమారుడు.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమరుడు మిథున్ రెడ్డి.. ఇలా వైసీపీ నాయకులందరిపైనా అక్రమ కేసులు పెడుతున్నారని జగన్ మండిపడ్డారు. ఇదే సమయంలో తన హయాంలో పని చేసిన అధికారులపైనా కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తున్నారని జగన్ తెలిపారు.
ఈ సందర్భంగా... చెవిరెడ్డన్న అరెస్ట్ నిజంగా ఆశ్చర్యం అనిపించిందని.. చీమకు కూడా అపకారం చేయడం అంటే ఆయనకు తెలీదని.. అంత అమాయకుడని.. అయినా.. ఆయనను అరెస్టు చేశారని చెప్పిన జగన్... ఇది దారుణం కాదా అని చంద్రబాబును అడుతున్నా అని అన్నారు. లిక్కర్ కేసులో తప్పుడు స్టేట్ మెంటు కోసం.. గన్ మన్ మదన్ ను తీవ్రంగా హించారని.. ఆ విషయం ఆయనే చెప్పారని తెలిపారు.
దీనిని బట్టి సిట్ విచారణ ఏ స్థితిలో అడ్డగోలుగా సాగుతోందో అర్ధం చేసుకోవచ్చని జగన్ వ్యాఖ్యానించారు. ఇదే క్రమంలో.. లిక్కర్ కేసులో ఎలాంటి లోపాలు జరగలేదని.. అయినప్పటికీ ఉద్దేశ పూర్వకంగానే కేసులు పెట్టారని చెప్పిన జగన్... చెవిరెడ్డితో పాటు ఆయన కొడుకును కేసులో ఇరికించారని అన్నారు.
ఈ సందర్భంగా... ‘సిద్ధం’ సభల్లో ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల గురించి జగన్ చేసిన ప్రసంగాలు, ఇచ్చిన సర్టిఫికెట్లు గుర్తుకు తెచ్చుకుంటున్నారని అంటున్నారు. నాడు ఐదేళ్లు ఆ నాయకుడి పెర్ఫార్మెన్స్ మొత్తం ప్రజలు చూసిన తర్వాత, ఆ నాయకుడిపై జనానికి ఒక క్లారిటీ వచ్చాక కూడా... జగన్ తన ప్రసంగం మాత్రం తాను చేసి రాకుండా... ఎమ్మెల్యే అభ్యర్థిని పొగడ్తలతో ముంచెత్తి, వారు అమాయకులని చెప్పిన ఘటనలు గుర్తు చేసుకుంటున్నారు!
మర్డర్ కేసులు ఉన్న ఎమ్మెల్యేలు, ఐదేళ్లు అరాచకం చేసిన నేతలు, అవినీతిలో కూరుకుపోయారనే విమర్శలు మూటగట్టుకున్న మంత్రులను సైతం జగన్... "అమాయకుడు.. మంచివాడు" అని ప్రత్యేకంగా ప్రస్థావించడం కూడా అప్పట్లో బౌన్స్ బ్యాక్ అయ్యిందని తలచుకుంటున్నారు!
