Begin typing your search above and press return to search.

ధర్మానకు కేంద్ర కార్యాలయ పగ్గాలు.. వైసీపీలో కీలక మార్పులు?

వైసీపీలో కీలక మార్పులు దిశగా ఆ పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటోందని ప్రచారం జరుగుతోంది. పార్టీ వాణిని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే విషయంలో పార్టీ పెద్దలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   2 Jan 2026 7:47 PM IST
ధర్మానకు కేంద్ర కార్యాలయ పగ్గాలు.. వైసీపీలో కీలక మార్పులు?
X

వైసీపీలో కీలక మార్పులు దిశగా ఆ పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటోందని ప్రచారం జరుగుతోంది. పార్టీ వాణిని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే విషయంలో పార్టీ పెద్దలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం పార్టీ నేతలు మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నా, అనుకున్నంత రీచ్ లభించడం లేదని పార్టీ హైకమాండ్ గుర్తించిందని చెబుతున్నారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వైసీపీ తరఫున ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు. కానీ, వారు ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తున్నట్లుగానే ఉంది కానీ, పార్టీ పట్ల ప్రజల్లో సానుకూల దృక్పథం పెంచడంలో అనుకున్నంత ఫలితం సాధించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోందని అంటున్నారు.

అదే సమయంలో పార్టీ రాష్ట్ర సమన్వయకర్త, ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ వాణిని వినిపిస్తున్నా ప్రజలను ఆకట్టుకోవడం లేదన్న అభిప్రాయమూ కేడర్ నుంచి వ్యక్తమవుతోంది. దీంతో పార్టీలో సీనియర్ నేతలకు కేంద్ర కార్యాలయ బాధ్యతలు అప్పగించాలని మాజీ సీఎం జగన్మోహనరెడ్డి భావిస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం పార్టీలో ఉన్న సీనియర్లలో మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, రెవెన్యూ శాఖ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో మిగిలిన నేతలు అందరికన్నా సీనియర్లు. వీరిలో బొత్స విశాఖ వేదికగా అప్పుడప్పుడు మీడియాలో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, రాజధానిలో ఆయన అందుబాటులో ఉండటం లేదు. దీంతోపాటు రాజధానిలో పార్టీ ప్రధాన కార్యాలయంలో సమన్వయం చేయడంలో పలు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు వైసీపీ అధిష్టానం గుర్తించిందని అంటున్నారు.

దీంతో పార్టీ కార్యాలయ సమన్వయ బాధ్యతలతోపాటు కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ వాణిని వినిపించే బాధ్యతను మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు అప్పగించాలని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డికి ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే ఈ విషయంలో ధర్మానతో జగన్ చర్చించారని అంటున్నారు. ఆయన కూడా ఈ ప్రతిపాదన పట్ల సానుకూలంగా ఉన్నా, రాజధాని ప్రాంతంలో నివాసం లేకపోవడం వల్ల కొద్దిరోజులపాటు సమయం అడిగారని అంటున్నారు. మాజీ మంత్రి ధర్మాన ఏ విషయంలో అయినా విషయ పరిజ్ఞానంతో మాట్లాడతారనే అభిప్రాయం ఉంది. ఇలా మాట్లాడే వారు పార్టీలో మరెవరూ లేరన్న వాదన కూడా ఉంది. దీంతో ధర్మానకు పార్టీ కార్యాలయంలో కూర్చొబెట్టి ప్రభుత్వం తీసుకునే విధాన నిర్ణయాలపై నిలదీయాలని వైసీపీ ఆలోచిస్తోందని అంటున్నారు.

ప్రస్తుతం వైసీపీ తరఫున ఎవరు మాట్లాడినా ప్రభుత్వంపై విమర్శలు చేయడానికే పరిమితమవుతున్నారు. ప్రధానంగా కొద్దిమంది నేతలు ఆవేశంగా మాట్లాడుతూ, కొంత పరిధి దాటుతున్నట్లు కనినిపిస్తున్నారని వైసీపీ అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయని అంటున్నారు. గతంలో కొందరు నేతలు ఇలా మాట్లాడటం వల్లే పార్టీపై ప్రజల్లో దురాభిప్రాయం ఏర్పడిందన అంటున్నారు. దీన్ని సరిచేసుకునే ప్రయత్నంలో భాగంగా ధర్మాన వంటి వారికి బాధ్యతలు అప్పగించాలని వైసీపీ అధిష్టానం ఆలోచన చేస్తోందని చెబుతున్నారు. దీనివల్ల పార్టీ వాదన మాత్రమే ప్రజల్లోకి వెళుతుందని, ఇతర విమర్శలను పక్కన పెట్టినట్లు అవుతుందని అంటున్నారు.