Begin typing your search above and press return to search.

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

అంతే కాదు ఎన్నికల్లో ఎలా గెలవాలో అన్నది బాబు అండ్ టీం క్లారిటీగా తెలియచెప్పింది అని జగన్ కామెంట్స్ చేశారు.

By:  Satya P   |   4 Nov 2026 2:36 PM IST
ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !
X

ఏపీలో చంద్రబాబు జగన్ ల మధ్య ఉన్నది కేవలం రాజకీయ వైరం అని ఎవరూ అనుకోరు. అది వ్యక్తిగత స్థాయిలో కూడా ఉందని భావించే వారూ నమ్మే వారూ ఉన్నారు. దానికి ఉదాహరణలు కూడా ఉన్నాయని చెబుతారు. ఈ ఇద్దరూ ఎక్కడా నేరుగా కలసిన సందర్భాలు లేవు, ఎవరు సీఎం గా ఉన్నా రెండవవారు ముఖం చాటేసే వైఖరినే ప్రదర్శిస్తూ వచ్చారు. అయితే సోషల్ మీడియా ద్వారా ఒకరి పుట్టిన రోజుకు మరొకరు శుభాకాంక్షలు మాత్రం చెప్పుకుంటారు. అంతవరకే అది. అలాంటిది నేరుగా చంద్రబాబుకు జగన్ కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశారు అంటే అందులో చాలానే మ్యాటర్ ఉండాలిగా. అందుకే అంతా దాని గురించే విశ్లేషిస్తున్నారు.

జగన్ ఏమన్నారంటే :

కంగ్రాట్స్ చంద్రబాబు గారూ అంటూ ఏపీలో అర్బన్ బాడీస్ ఎన్నికల్లో సక్సెస్ తరువాత జగన్ ట్వీట్ చేశారు. ఇది అందరినీ ఆకట్టుకుంది. బాబు గెలుపుకి ఆయన అసలైన రాజకీయ ప్రత్యర్ధి జగన్ ఎలా కంగ్రాట్స్ చెబుతారు అని అని ఆలోచించేవారే ఎక్కువ. మరి ఆ కంగ్రాట్స్ వెనకనే ఎన్నో సెటైర్లు ఎన్నో కామెంట్స్ దట్టించి మరీ జగన్ వదిలారు. అదే ఇపుడు రాజకీయంగా వైరల్ అవుతోంది. చంద్రబాబుని ని ఒక టీం గా జగన్ చేశారు. ఆ టీం లో రాష్ట్ర ఎన్నికల సంఘం ఉంది, అలాగే పోలీసు యంత్రాంగం ఉంది. అలా టీం చంద్రబాబుకు జగన్ కంగ్రాట్స్ చెప్పారన్న మాట. ఇది సెటైరికల్ గా గట్టిగా గుచ్చుకోవాలని అలాగే చర్చ సాగాలనే జగన్ ఈ ట్వీట్ వేశారు అని అంటున్నారు.

చాన్స్ ఇవ్వలేదు :

అంతే కాదు ఎన్నికల్లో ఎలా గెలవాలో అన్నది బాబు అండ్ టీం క్లారిటీగా తెలియచెప్పింది అని జగన్ కామెంట్స్ చేశారు. అందులోనూ ప్రతిపక్షానికి పోటీ చేసేందుకు కనీసం అవకాశం ఇవ్వకుండా ఎలా చేయవచ్చూ ప్రతీ దశలోనూ చూపించారు అని కూడా కామెంట్స్ చేశారు. నామినేషన్ల దాఖలు దశ నుంచి హైజాక్ చేస్తూ వచ్చారని, స్క్రూటినీ, విత్ డ్రాయల్, పోలింగ్ ఏజెంట్లను బయటకు పంపించడం, రిగ్గింగ్ చేసుకోవడం, పోల్ పర్సెంటేజ్ ని కూడా మానేజ్ చేయడం, కౌంటింగ్ హైజాక్ చేయడం ఇవన్నీ కూడా గెలుపు ఎలా సాధించాలో చేసి చూపించారని జగన్ తన కంగ్రాట్స్ మెసేజ్ లోనే హాట్ కామెంట్స్ గా చెప్పుకొచ్చారు అన్న మాట.

ఎలక్షన్ కానే కాదు :

అందువల్ల అర్బన్ బాడీస్ కి జరిగినవి ఎన్నికలు కానే కాదని సెలెక్షన్ మాత్రమే అని జగన్ తేల్చేశారు. ప్రజలు ఎవరూ ఎన్నుకోలేదని కూడా జగన్ అంటున్నారు. ఇలాంటివి చూసినపుడు ఎన్నికల సంస్కరణల అవసరం ఎంత ఉందో మరింతగా అర్ధం అవుతోంది అన్నట్లుగా జగన్ మాట్లాడారు. మొత్తానికి ఒక వైపు అర్బన్ బాడీస్ లో కూటమి విజయ పరంపర కొనసాగింది. వైసీపీ దారుణంగా ఓటమిని అందుకుంది. దీనికి జగన్ నుంచి వచ్చిన రియాక్షన్ ఇలా షాకింగ్ గానే ఉంది. ఓటమి ఎపుడూ బాధాకరంగానే ఉంటుంది. ప్రత్యర్ధి గెలుపుని కూడా తక్కువ చేసి చూడడం జరుగుతుంది. వైసీపీ విషయం తీసుకుంటే తమకు చాన్స్ ఇవ్వలేదని ఆరోపిస్తోంది. అదే సమయంలో ఏపీలో పారదర్శకంగానే ఎన్నికలు జరిగాయని అధికార పక్షం అంటోంది. ఈ రెండు కామెంట్స్ కి మధ్యలో ప్రేక్షకులు మాత్రం ప్రజలు. వారికి అన్నీ తెలుసు. ఎవరేమి మాట్లాడినా అందులో ఎంత మేరకు నిజం ఉంది అన్నది ఇంకా బాగా తెలుసు అంటున్నారు.