పరకామణి చోరీపై జగన్ షాకింగ్ కామెంట్స్.. భక్తుల రియాక్షన్ ఏంటంటే?
తిరుమల పరకామణి చోరీ కేసుపై మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన కామెంట్స్ విస్తృత చర్చకు దారితీస్తున్నాయి.
By: Tupaki Political Desk | 5 Dec 2025 10:41 AM ISTతిరుమల పరకామణి చోరీ కేసుపై మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన కామెంట్స్ విస్తృత చర్చకు దారితీస్తున్నాయి. గురువారం మీడియాతో మాట్లాడిన జగన్ వివిధ అంశాలపై స్పందించారు. ఇందులో తిరుమల పరకామణి చోరీ కేసుపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పరమ పవిత్రమైన శ్రీవారి ఆలయంలో దొంగతనం జరిగిందని చెబుతూ, దేశంలో చాలా ఆలయాల్లో దొంగతనాలు జరుగుతుంటాయని, అదేవిధంగా తిరుమలలో జరిగింది చిన్న చోరీగా మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ సీఎం మాట్లాడిన వీడియోను టీడీపీ సోషల్ మీడియా విస్తృతంగా వైరల్ చేస్తోంది.
తిరుమల పరకామణి చోరీ కేసు రాజీపై కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో చోరీ జరగగా, నిందితుడితో అప్పటి టీటీడీ పెద్దలు రాజీ చేసుకున్నారు. ఈ విషయంపై అప్పట్లోనే తీవ్రవిమర్శలు వినిపించగా, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఆ వివాదం సర్దుమణిగింది. అయితే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ జర్నలిస్టు పరకామణి కేసు రాజీ చేసుకోవడాన్ని తప్పుబడుతూ హైకోర్టులో పిటిషన్ వేశాడు. రాజీ కుదర్చుకోవడం చట్ట బద్దం కాదని, నిబంధలకు విరుద్ధంగా నడుచుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టును ఆశ్రయించాడు. ఈ విషయంపై హైకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చోరీ కేసును రాజీ చేసుకోవడం తప్పంటూ వ్యాఖ్యానించడమే కాకుండా, సీఐడీ విచారణకు ఆదేశించింది.
హైకోర్టు ఆదేశాల ప్రకారం సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో విచారణ పూర్తయింది. శుక్రవారం ఈ కేసును హైకోర్టులో విచారించనున్నారు. ఈ నేపథ్యంలో జగన్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. 9 అమెరికన్ డాలర్లను చోరీ చేస్తుండగా, తమ హయాంలోనే పట్టుకున్నామని, అదో చిన్న కేసు అంటూ జగన్ వివాదాన్ని తేలిగ్గా చూపే ప్రయత్నం చేయడంపై భక్తులు షాక్ తిన్నారని వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాకుండా 72 వేల రూపాయల విలువైన డబ్బు చోరీ జరిగితే, దొంగ ప్రాయశ్చిత్తంగా 14 కోట్లు విలువైన ఆస్తులను స్వామి వారికి రాసివ్వడం జగన్ చెప్పడాన్ని భక్తులు తప్పుబడుతున్నారు. 72 వేలు విలువైన డాలర్లను దొంగతనం చేసిన వాడు 14 కోట్ల ఆస్తులను తిరిగి ఇచ్చాడంటే, అతడికి అంత ఆస్తి ఎక్కడ నుంచి వచ్చింది అనే విషయంపై విచారణ జరపాలి కదా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
అంతేకాకుండా దొంగను ఒక్కరోజు కూడా జైలులో పెట్టకపోవడం, ఆయనతో రాజీ చేసుకోవాలని ప్రతిపాదనను ఎవరు ఆమోదించారన్న విషయాలు ఇప్పుడు వివాదమని అంటున్నారు. ఈ విషయాలు ఏవీ ప్రస్తావించకుండా తిరుమల ఆలయంలో దొంగతనాన్ని.. ఇతర ఆలయాల్లో దొంగతనాలతో ముడిపెట్టే ప్రయత్నం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే టీటీడీ నిర్వహణలో గత ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తిరుమల పరకామణి చోరీపై జగన్ చేసిన వ్యాఖ్యలు మరింత అగ్గి రాజేలా చేస్తున్నాయని అంటున్నారు.
