Begin typing your search above and press return to search.

స్థానిక ఎన్నికలు...జగన్ సంచలన నిర్ణయం ?

ఏపీలో అధికార విపక్షం మధ్య భీకరమైన రాజకీయ సమరం సాగుతోంది. ఎవరికి ఎవరూ తగ్గేలా కనిపించడం లేదు.

By:  Satya P   |   10 Sept 2025 9:21 PM IST
స్థానిక ఎన్నికలు...జగన్ సంచలన నిర్ణయం ?
X

ఏపీలో అధికార విపక్షం మధ్య భీకరమైన రాజకీయ సమరం సాగుతోంది. ఎవరికి ఎవరూ తగ్గేలా కనిపించడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు వర్సెస్ మాజీ ముఖ్యమంత్రి జగన్ ల మధ్య గత పదకొండేళ్ళుగా విభజన ఏపీలో పాలిటిక్స్ ఇదే తీరున జరుగుతోంది. ఈ క్రమంలో మూడు ఎన్నికలు జరిగితే రెండు సార్లు చంద్రబాబు సీఎం అయ్యారు, ఒకసారి ముఖ్యమంత్రిగా జగన్ అయ్యారు. ఇక ఈ మధ్యలో రాజకీయంగా అనేక పరిణామాలు సంభవించాయి.

అసెంబ్లీతో ఆరంభం :

ఇదిలా ఉంటే 2024లో భారీ ఓటమి వైసీపీకి ఎదురైంది. దాంతో నాటి నుంచి అసెంబ్లీకి జగన్ ఆయన పార్టీ ఎమ్మెల్యేలు రావడం లేదు. ఆ విధంగా అసెంబ్లీకి బాయ్ కాట్ అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని కూడా చెబుతున్నారు. అది కుదరదని నిబంధనల ప్రకారం వీలు లేదని ప్రభుత్వం అంటోంది. ప్రజలు మీకు హోదా ఇవ్వలేదని చెబుతోంది. దాంతో వైసీపీ అసెంబ్లీకి రావడం లేదు.

స్థానిక ఎన్నికల విషయంలో :

మరో వైపు చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలను కూడా వైసీపీ బాయ్ కాట్ చేస్తుందా అన్న కొత్త చర్చ మొదలైంది. బుధవారం జగన్ తాడిపత్రిలోని పార్టీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడినపుడు విలేకరుల నుంచి ప్రశ్న ఎదురైంది. స్థానిక ఎన్నికల్లో కూడా ఈవీఎంలను వాడుతారని అంటున్నారు, దీని మీద మీ అభిప్రాయం చెప్పండి అని జగన్ ని అడిగినపుడు ఆయన పేపర్ బ్యాలెట్ అయినా ఈవీఎంలు అయినా చంద్రబాబు పోలీసులను పెట్టించి ఎన్నికలు జరిపిస్తే ఒక్కటే కదా అని బదులిచ్చారు. దానికి ఆయన పులివెందుల ఒంటిమెట్ట జెడ్పీటీసీ ఎన్నికలను ఉదహరించారు. పోలీసులను వాడుకుంటూ దౌర్జన్యం చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు.

కేంద్ర బలగాలతో నిర్వహించాలి :

కేంద్ర ప్రభుత్వ బలగాలు ఆధ్వర్యంలో ఎన్నికలు జరిపిస్తే సజావుగా జరుగుతాయని నమ్మకం కలుగుతుందని జగన్ అన్నారు. ఎంపీ ఎమ్మెల్యేల ఎన్నికల సమయంలో అయితే పేపర్ బ్యాలెట్ గురించి కోరవచ్చు అని అన్నారు. స్థానిక ఎన్నికల్లో మాత్రం లోకల్ పోలీసులతోనే అంతా జరిపిస్తారు కాబట్టి సక్రమంగా ఎన్నికలు జరగవేమో అన్న అనుమానాన్ని అయితే ఆయన వ్యక్తం చేశారు అని అంటున్నారు.

దూరంగానే ఉంటారా :

జగన్ చెప్పిన మాటలను బట్టి చూస్తే కనుక తొందరలో ఏపీలో జరగబోతున్న లోకల్ బాడీ ఎన్నికల్లో వైసీపీ దూరంగానే ఉంటుంది అని అంటున్నారు. ఎందుకంటే పోటీ చేసినా అధికార కూటమి ముందు సరితూగలేదు, పైగా ఆ వైపు నుంచి వచ్చే దూకుడుని సైతం తట్టుకోలేరు అని అంటున్నారు. ఇక ఎటూ అధికార పక్షమే గెలుస్తుంది అది దౌర్జన్యం చేశారనా లేక తమను ఇబ్బందులు పెట్టారనా ఏ విధంగా విపక్షం ఆరోపణలు చేసినా కూడా విజయం మాత్రం కూటమికే దక్కుతుంది అని అంటున్నారు. దాంతో ఎందుకొచ్చిన పోటీ అన్న ఆలోచనతో వైసీపీ ఉందా అన్న చర్చ సాగుతోంది.

ఇక పార్టీ వారు అంతా ఎంత కష్టపడినా ఫలితాలు చేదుగా వస్తే అది 2029 ఎన్నికల మీద ప్రభావం చూపుతుందని కూడా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే గెలిచిన వైసీపీ వారు కూడా పార్టీలో ఉంటారు అన్న నమ్మకం కూడా లేదని అంటున్నారు. అందువల్ల లోకల్ బాడీ ఎన్నికలు అని ఫోకస్ ఆ వైపు పెట్టే కంటే జనంలో ఉంటూ ప్రభుత్వ విధానాల మీద పోరాటం చేయాలన్నదే వైసీపీ ఆలోచనగా ఉంది అని అంటున్నారు. అదే కనుక జరిగితే మాత్రం వైసీపీ మరో బాయ్ కాట్ కి సిద్ధం అవుతోంది అని అనుకోవాల్సి ఉంటుంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.