చంద్రబాబు పై నిప్పులు, అయ్యన్నపై సెటైర్లు... జగన్ సంచలన వ్యాఖ్యలు!
అవును... వైసీపీ అధినేత జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
By: Raja Ch | 23 Oct 2025 3:33 PM ISTవైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను ఆయన ప్రస్థావించారు. ఇందులో భాగంగా... నకిలీ మద్యం వ్యవహారం, విశాఖ డాటా సెంటర్ పై జరుగుతున్న ప్రచారం.. ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, రైతుల సమస్యలు మొదలైన విషయాలపై స్పందించారు.
అవును... వైసీపీ అధినేత జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధానంగా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అత్యంత హాట్ టాపిక్ గా మారిన నకిలీ మద్యం అమ్మకాలు, బెల్ట్ షాపుల వ్యవహారం, విశాఖ డాటా సెంటర్ తో పాటు పలు కీలక విషయాలపై స్పందించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో ప్రైవేటు మద్యం మాఫియా నడుస్తోంది!:
రాష్ట్రంలో ప్రైవేటు మద్యం మాఫియా నడుస్తోందని.. పోలీసుల భద్రత మధ్య గ్రామాల్లో మద్యం అమ్మకాలు నడుస్తున్నాయని చెప్పిన జగన్.. రాష్ట్రంలో ఎటు చూసినా నకిలీ మద్యం ఫ్యాక్టరీలే కనిపిస్తున్నాయని అన్నారు. ఆక్షన్లు వేసి మరీ బెల్లు షాపులు నిర్వహిస్తున్నారని.. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారని.. వాటాల్లో తేడా రావడంతో ఈ నకిలీ వ్యవహరం బయటకు వచ్చిందని జగన్ అన్నారు.
ఇదే క్రమంలో.. ములకల చెరువులోనే 20,208 నకిలీ మద్యం బాటిళ్లు దొరికాయని.. 1,050 లీటర్ల స్పిరిట్ కూడా దొరికిందని.. వీటితో వేల బాటిళ్లు నకిలీ మద్యం తయారు చేయవచ్చని జగన్ తెలిపారు. ఇదే క్రమంలో.. ఇబ్రహీంపట్నంలోనూ, అనకాపల్లి జిల్లా పరవాడలోనూ నకిలీ మద్యం ఫ్యాక్టరీల వ్యవహారం బయటకు వచ్చిందని అన్నారు.
ఇదే సమయంలో... అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, రేపల్లే, నెల్లూరులోనూ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డాయని.. వీటిల్లో లక్షల బాటిళ్ల నకిలీ మద్యం తయారు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రైవేటు మాఫియా ఆధ్వర్యంలోని మద్యం షాపులకు బెల్టుషాపులు, ఇల్లీగల్ పర్మిట్ రూమ్ లకు ఈ నకిలీ మద్యం సరఫరా చేస్తున్నారని.. నేడు ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యమే అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆర్గనైజ్డ్ గా క్రైమ్ చేయడం చంద్రబాబుకు అలవాటే!:
రాష్ట్రంలో నకిలీ మద్యం ఈ స్థాయిలో విస్తరిస్తుంటే.. ప్రజలను తప్పు దోవ పట్టించడానికి ఆయన దొంగల ముఠా, ఓ వర్గం మీడియా సిద్ధంగా ఉండనే ఉందని మొదలుపెట్టిన జగన్... ఆర్గనైజ్డ్ గా క్రైమ్ చేయడం చంద్రబాబు, లోకేష్ లకు అలవాటేనని అన్నారు. ఈ క్రమంలో... టాపిక్ డైవర్షన్ లో భాగంగా ఎదుటివారిపై బురద చల్లుతారని.. ఎవరైనా ప్రశ్నిస్తే వారిని జైలుకు పంపే ప్రయత్నం చేస్తారని అన్నారు.
ఇదే సమయంలో... నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టింది చంద్రబాబు మనుషులే.. లిక్కర్ షాపులకు పంపేది చంద్రబాబు మనుషులే.. బెల్ట్ షాపులకు పంపేది చంద్రబాబు మనుషులే.. అమ్మకునేది వాళ్ల కింది మనుషులే.. అని ఆరోపించిన జగన్... సీబీఐ విచారణ జరిపితే మూలాలు బయటకు వస్తాయనే భయంతోనే బాబు 'సిట్' ముద్దు అంటున్నారని అన్నారు.
వైసీపీ వేసిన బీజానికి కొనసాగింపే విశాఖ గూగుట్ డాటా సెంటర్!:
ఈ సందర్భంగా... వైసీపీ ప్రభుత్వం, అదానీ, కేంద్ర ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వాల సమిష్టి కృషే విశాఖ గూగుల్ డాటా సెంటర్ అని చెప్పిన జగన్... 2023లోనే డాటా సెంటర్ కు శంకుస్థాపన కూడా చేశామని వెల్లడించారు. క్రెడిట్ చోరీలో చంద్రబాబు పీక్.. పర్ఫార్మెన్స్ వీక్ అని ఈ సందర్భంగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. వేరే వాళ్లకి దక్కాల్సిన క్రెడిట్ ను చోరీ చేయడంలో బాబు ఎప్పుడూ ముందుంటారని అన్నారు.
హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబుకు సంబంధం లేదు!:
నేడు విశాఖకు గూగుల్ డాటా సెంటర్ రప్పించిన విషయంలో వైసీపీ క్రెడిట్ ని చోరీ చేస్తున్న చంద్రబాబు... గతంలో హైదరాబాద్ సైబర్ టవర్స్ విషయంలోనూ ఇలాగే చేశారని అన్నారు. హైటెక్ సిటీకి ఆరు ఎకరాల్లో పునాది వేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అని.. అయితే, చంద్రబాబు ఆ విషయాన్ని ఏనాడూ చెప్పుకోరని చెప్పిన జగన్... అసలు చంద్రబాబుకి 20 ఏళ్లపాటు హైదరాబాద్ తో సంబంధమే లేదని అన్నారు.
2004, 2009 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారని.. ఆ తర్వాత పదేళ్లు కేసీఆర్ సీఎంగా ఉన్నారు.. ఇలా 20 ఏళ్ల పాటు హైదరాబాద్ తో చంద్రబాబు ఏమీ సంబంధం లేకపోయినా.. ఈ 20 ఏళ్లలో జరిగిన అభివృద్ధి కూడా తనదేనంటూ బిల్డప్ ఇస్తుంటారని అన్నారు. వాస్తవానికి 2004 వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచే హైదరాబాద్ లో నిజమైన అభివృద్ధి మొదలైందని.. ఈ విషయాన్ని గణాంకాలే చెబుతున్నాయని అన్నారు.
అయ్యన్నపాత్రుడిపై జగన్ సెటైర్లు!:
ఇలా సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన జగన్.. అసెంబ్లీ స్పీకర్ అయన్నపాత్రుడి దగ్గరకు వచ్చేసరికి సెటైర్లు వేశారు. ఇందులో భాగంగా... అనకాపల్లి పరవాడలో అయ్యన్నపాత్రుడి సన్నిహితుడి ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారు చేస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. ఆయన సన్నిహితుడు రుత్తలరాము అనే వ్యక్తి దీనిని నడిపిస్తున్నాడని అన్నారు. ఈ సందర్భంగా వారిద్దరూ కలిసి ఉన్న ఫోటో చూపిస్తూ.. 'చూడండి.. ఇద్దరు ఎంత బాగా నవ్వుతున్నారో.. స్మార్ట్ గా ఉన్నారు' అంటూ జగన్ సెటైర్స్ వేశారు.
