Begin typing your search above and press return to search.

మా పోలీసులు....కూటమి పోలీసులూ....జగన్ కామెంట్స్ వైరల్!

తన ప్రభుత్వం హయాంలో పోలీసులు ప్రజలతో ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవారని ప్రజలకు అనుకూలంగా పోలీసులు ఆ రోజు ఉన్నారంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   16 July 2025 5:34 PM IST
మా పోలీసులు....కూటమి పోలీసులూ....జగన్ కామెంట్స్ వైరల్!
X

తన ప్రభుత్వం హయాంలో పోలీసులు ప్రజలతో ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవారని ప్రజలకు అనుకూలంగా పోలీసులు ఆ రోజు ఉన్నారంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ అవుతున్నాయి. ఆనాడు పోలీసులను ఉపయోగించి విపక్షాలను కట్టడి చేసే ప్రయత్నం చేయడం జరిగిందనే కదా అంతా మొత్తుకున్నారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

ఏపీలో ఒక చెడు సంప్రదాయం అంటూ వచ్చిందంటే అది వైసీపీ హయాంలోనే కదా మొదలైంది అని గుర్తు చేస్తున్నారు. కూటమి ఏలుబడిలో పోలీసులు తమను తమ పార్టీ వారిని కట్టడి చేస్తున్నారు అని జగన్ విమర్శలు చేసే క్రమంలో తామేంతో మంచి పోలీసింగ్ వ్యవస్థను అందించామని చెప్పుకోవడం పట్ల ప్రతి విమర్శలు వస్తున్నాయి.

ఆనాడు పోలీసులు ప్రజల సమస్యలను సామరస్యంగా పరిష్కరించారాని అంతే కాక టీడీపీ జనసేన వంటి ప్రతిపక్ష పార్టీల సమస్యలను కూడా పరిష్కరించారని జగన్ చెప్పుకొచ్చారు. తమ హయాంలో పోలీసులు గర్వంగా గౌరవంగా పనిచేసారు అని జగన్ చెప్పారు. పోలీస్ వ్యవస్థలో సంస్కరణలు అమలు చేసామని అన్నారు అంతే కాదు స్పందన వంటి కార్యక్రమల ద్వారా పరిష్కారాలు చూపామని జగన్ చెప్పారు. ప్రతిపక్షాలకే ఎక్కువ న్యాయం చేశామని జగన్ అంటున్నారు.

అయితే జగన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విమర్శలకు దారితీస్తున్నాయి. నిజానికి వైసీపీ ఏలుబడిలోనే రాజకీయ నాయకులనే కాకుండా అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకోవడానికి పోలీసులను అధికారాన్ని పెద్ద ఎత్తున దుర్వినియోగం చేశారని టీడీపీ, జనసేన వంటి ప్రతిపక్ష పార్టీలు తీవ్రమైన ఆరోపణలు చేశాయని పాత విషయాలను చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా ఎత్తి చూపుతున్నారు.

అంతే కాదు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అనేక సంఘటనల గురించి కూడా వారు ప్రస్తావిస్తున్నారు. విశాఖలో చూస్తే డాక్టర్ సుధాకర్‌ను అరెస్టు చేసిన తీరు వివాదాస్పదం అయిందని గుర్తు చేస్తున్నారు. అంతే కాకుండా ఆనాటి వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజును అరెస్టు చేసిన విధానం కానీ అదే విధంగా అనేక మంది టీడీపీ, జనసేన నాయకులు అరెస్టు చేసిన తీరు కానీ తలచుకున్న వారు ఏమి గర్వంగా నాడు పని చేయించారు అని ఎదురు ప్రశ్నిస్తున్నారు.

జగన్ హయాంలో పోలీసులు ప్రజలకు అనుకూలంగా కాకుండా వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకుందని కూడా నిందిస్తున్నారు. జగన్ తాజా ప్రకటనలు పాత విషయాలను వేరే విధంగా మార్చి చెప్పడమే అని అంటున్నారు. అలా చేసినా కూడా అవి మాసిపోవని అంటున్నారు

ఇక జగన్ కూటమి ప్రభుత్వం మీద పోలీసుల మీద తీవ్ర విమర్శలు అయితే చేశారు. కూటమి పాలనలో పోలీసులను ముందు పెట్టి తమను అణచేందుకు ప్రయత్నం చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో తాను చేసిన ఆనేక పర్యటనలో తన మీద తన పార్టీ కార్యకర్తల మీద కేసులు పెడుతూ భయానక వాతావరణ సృష్టిస్తున్నారని జగన్ ద్వజమెత్తారు.

చంద్రబాబుకు మూడ్ ఉంటేనే తనకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ దక్కుతోందని లేకపోతే లేదని ఆయన విమర్శించారు. సత్తెనపల్లి, పొదిలి సహా తన పర్యటనలలో అల్లర్లు అలజడి సృష్టించాలని ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. తన సభలకు జనాలు రావడం తాను ప్రజా సమస్యల మీద మాట్లాడడం కూటమి పెద్దలకు ఏమాత్రం నచ్చడం లేదని జగన్ అన్నారు ఇక గుంటూరు మిర్చియార్డులో తాను రైతులను పరామర్శిస్తే తనపైనే తిరిగి కేసులు పెట్టారని జగన్ విమర్శించారు.

కూటమి పెద్దలు తమకు నచ్చని పోలీసు అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తున్నారని జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇలా అనేక మంది అధికారులను ఖాళీగా కూర్చోబెట్టారని అన్నారు. ఈ అవమానాలు భరించలేక సిద్ధార్ధ్ కౌశల్ వంటి మంచి పోలీసు అధికారులు రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోతున్నారని జగన్ అన్నారు. ఇక డీజీ స్థాయి అధికారులు అయిన పీఎస్ ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్, డీఐజీ విశాల్ గున్నీ లాంటి అధికారుల మీద తప్పుడు కేసులు బనాయించి అరెస్టులు సస్పెండ్ చేస్తున్నారని జగన్ మండిపడ్డారు.

తనకు అనుకూలంగా ఉన్న పోలీసు అధికారులను పెట్టుకుని అక్రమ వసూళ్ళకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. మద్యం ఇసుక బెల్ట్ షాపుల విషయంలో ఏమి జరిగినా ఒక గ్యాంగ్ ని పెట్టి మరీ వసూళ్ళు బెదిరింపులు వసూలు చేస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీలో అక్రమ కలెక్షన్ జోరుగా సాగుతోందని పెదబాబు చినబాబు స్థాయిలోకి అందుతోందని అన్నారు.