Begin typing your search above and press return to search.

జగన్ దృష్టిలో ఆ రెండు పార్టీలూ ?

తాజాగా మీడియా సమావేశంలో కూడా జగన్ అదే మాట అన్నారు. ఏపీలో వైసీపీయే ప్రజలలోకి వచ్చి పోరాటాలు చేయాలని అన్నారు.

By:  Tupaki Desk   |   17 July 2025 6:00 PM IST
జగన్ దృష్టిలో ఆ రెండు పార్టీలూ ?
X

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ మనసులో ఉన్నది దాచుకోరు బయటకే చెప్పేస్తారు. ఆయన చాలా కాలంగా ఒక్కటే మాట అంటున్నారు. ఏపీలో ఏకైక ప్రతిక్షం ఉందని అది వైసీపీయే అని అంటున్నారు. తాజాగా మీడియా సమావేశంలో కూడా జగన్ అదే మాట అన్నారు. ఏపీలో వైసీపీయే ప్రజలలోకి వచ్చి పోరాటాలు చేయాలని అన్నారు. జనాలు కూడా కూటమి ప్రభుత్వం చేసే తప్పులను వైసీపీకే చెప్పుకుంటున్నారని తమకు అండగా నిలవాలని కోరుతున్నారని జగన్ అంటున్నారు.

కూటమిని నిలదీసేది ఎదిరించేది ఏకైక పార్టీ వైసీపీ మాత్రమే అని జగన్ క్లెయిం చేసుకుంటున్నారు. ఆయన వరకూ ఇది బాగానే ఉన్నా ఏపీలో ప్రతిపక్షంలో వేరే పార్టీలు లేవా ఉంటే అవి జగన్ దృష్టిలో పడలేదా అన్న చర్చ సాగుతోంది. ఏపీలో ఉభయ వామపక్షాలు ఉన్నాయి. సీపీఐ సీపీఎం తమ విధానంలో ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నారు. వారు కూడా ఎన్నో ప్రజా పోరాటాలు చేస్తూనే ఉన్నారు.

స్మార్ట్ విద్యుత్ మీటర్లను బిగించవద్దని కోరినా ప్రజలకు పన్నుల వడ్డింపు వద్దని చెప్పినా వివిధ వర్గాలకు న్యాయం చేయాలని గొంతు ఎత్తినా వామపక్షాలు ముందు ఉంటున్నాయని అంటున్నారు. అంతే కాదు ఏపీలో కర్షక కార్మిక సమస్యలలతో పాటు ఉద్యోగ నిరుద్యోగ వర్గాల సమస్యలను సైతం వామపక్షాలు ప్రస్తావిస్తూ వస్తున్నాయి.

మరి వామపక్షాలను జగన్ ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదు అన్న చర్చ వస్తోంది. సీపీఐ విషయానికి వస్తే వారు జగన్ ని బాబుని కలిపి విమర్శిస్తారు అందువల్ల పోనీ విరోధ భావం ఉండొచ్చు కానీ ప్రజా సమస్యల విషయంలో ఏక రూపంగా ఉండాల్సిన అవసరం లేదా అని అంటున్నారు. సీపీఎం అయితే జగన్ విషయం పెద్దగా మాట్లాడదు, పైగా నిర్మాణాత్మకమైన పోరాటాలు చేస్తుంది. మరి ఆ పార్టీ కూడా విపక్షంలో లేదా అన్న చర్చ సాగుతోంది.

ఇంకో వైపు చూస్తే కాంగ్రెస్ విపక్షంలోనే ఉంది. తన సొంత చెల్లెలు షర్మిల సారధ్యంలో కాంగ్రెస్ కొంత వరకూ వ్యక్తిగత అజెండా తీసుకున్నా కాంగ్రెస్ సిద్ధాంతాలు విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదని అంటున్నారు. జాతీయ స్థాయిలో ఇండియా కూటమికి పెద్దన్నగా ఉంటూ ఎన్డీయే ప్రభుత్వాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ ఏపీలో విపక్షంగా ఎందుకు కాలేకపోయింది అన్నదే వైసీపీ అధినాయకత్వం చెప్పాలని అంటున్నారు.

వైసీపీ విషయం తీసుకుంటే ఒంటరిగా పోటీ చేయడానికే ఆ పార్టీ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుందని అంటున్నారు పొత్తులకు చూడదని చెబుతున్నారు. అందువల్ల వైసీపీ సోలో ఫైట్ చేయవచ్చు కాక ఏపీలో ఏకైక విపక్షం తామే అని చెప్పుకోవడం ఏమిటి అని అంటున్నారు. అయితే విపక్షంలో ఏకైక పెద్ద పక్షంగా వైసీపీ చెప్పుకోవచ్చు అంతే తప్ప తామే వన్ అండ్ ఓన్లీ అంటే ఎలా కుదురుతుందని అంటున్నారు. మరి జగన్ ఆలోచనల ప్రకారం చూస్తే కాంగ్రెస్ వామపక్షాలు కూడా కూటమిలో బయట మిత్రులు అన్న భావన ఏమైనా ఉందా అన్న చర్చ అయితే సాగుతోంది.