Begin typing your search above and press return to search.

చిత్తూరులో జగన్ టూరుకు ఓకే.. కండీషన్స్ అప్లై!

ఈ నెల 9న మాజీ సీఎం జగన్ చిత్తూరు జిల్లా పర్యటనకు పోలీసులు అనుమతిచ్చారు. కానీ, కొన్ని షరతులు విధించారు.

By:  Tupaki Desk   |   7 July 2025 1:31 PM IST
చిత్తూరులో జగన్ టూరుకు ఓకే.. కండీషన్స్ అప్లై!
X

ఈ నెల 9న మాజీ సీఎం జగన్ చిత్తూరు జిల్లా పర్యటనకు పోలీసులు అనుమతిచ్చారు. కానీ, కొన్ని షరతులు విధించారు. దీంతో మరో రెంటపాళ్ల ఎపిసోడ్ పునరావృత్తమవుతుందా? అనే చర్చ జరుగుతోంది. ఈ నెల 9న చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో తోతాపురి మామిడి రైతులను పరామర్శించేందుకు మాజీ సీఎం జగన్ పర్యటించనున్నారని, అనుమతి ఇవ్వాలని వైసీపీ పోలీసులకు దరఖాస్తు చేసింది. జగన్ పర్యటన సందర్బంగా పది వేల మంది రైతులు, కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉన్నందున తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని కూడా ఆ లేఖలో వైసీపీ కోరింది.

వైసీపీ వినతి మేరకు మాజీ సీఎం జగన్ పర్యటనకు పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే 10 వేల మంది వస్తారని వైసీపీ విన్నవించగా, కేవలం 500 మంది మాత్రమే రావాలని పోలీసులు తెలిపారు. మార్కెట్ యార్డులో స్థలం తక్కువగా ఉన్నందున పది వేల మందికి అవకాశం లేదని తెలిపారు. అదేసమయంలో ర్యాలీలు, రోడ్ షోలు చేయకూడదని షరతు విధించారు. దీంతో వైసీపీ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

గత పర్యటనల్లో చోటుచేసుకున్న దుర్ఘటన నేపథ్యంలో మాజీ సీఎం పర్యటనకు షరతులు విధించినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే మాజీ సీఎం జగన్ ఎక్కడకు వెళ్లినా వైసీపీ భారీ సంఖ్యలో జనసమీకరణ చేస్తూ బల ప్రదర్శన చేస్తోందని అంటున్నారు. గుంటూరు మిర్చియార్డులో రైతుల పరామర్శకు వెళ్లిన నుంచి జనంలో తన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదన్న సంకేతాలిలిస్తున్నారు మాజీ సీఎం జగన్. గత నెల 18న రెంటపాళ్ల పర్యటనలో కూడా ఇదే విధంగా వందలాది కార్లు, వేల మంది కార్యకర్తలతో భారీ ప్రదర్శన నిర్వహించారు.

తాడేపల్లి నుంచి రెంటపాళ్లకు సుమారు 110 కిలోమీటర్ల దూరం ఉంటే దాదాపు పది గంటల పాటు ప్రయాణించారు. అడుగడుగునా కార్యకర్తలు గుమికూడా జగన్ కాన్వాయ్ ముందుకు వెళ్లకుండా అడ్డుకోవడంతో పర్యటన ఆలస్యమైందని అప్పట్లో వైసీపీ వివరణ ఇచ్చింది. అయితే ఈ పర్యటనలో మూడు కార్లు, వంద మందికి మాత్రమే పోలీసులు అనుమతిచ్చారు. భారీ జన సమూహం ఉండకుండా చూసేందుకు సెక్షన్ 30 అమలు చేయడంతోపాటు రెంటపాళ్ల వెళ్లే మార్గంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అయితే వైసీపీ నేతలు ఈ చెక్ పోస్టులు తొలగించడంతో కేసులు నమోదు చేశారు. ఇదే సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ చేశారన్న కారణంగా గుంటూరు జిల్లాకు చెందిన సుమారు 113 మందిపై కేసులు నమోదు చేశారు.

మరోవైపు ఇదే తరహాలో నెల్లూరు పర్యటనకు జగన్ వ్యూహం రచించగా, ర్యాలీకి అవకాశం లేకుండా పోలీసులు అనుమతించడంతో ఆ పర్యటనను మాజీ సీఎం జగన్ రద్దు చేసుకున్నారు. ఇక చిత్తూరులోనూ భారీ ర్యాలీగా మామిడి యార్డుకు వెళ్లాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు. అందుకే పది వేల మందికి అనుమతి ఇవ్వాలని ముందుగా దరఖాస్తు చేశారు. అయితే గత పర్యటనలను గుర్తు చేస్తూ పోలీసులు కేవలం 500 మందికి మాత్రమే అనుమతిచ్చారు. దీంతో వైసీపీ ఎలాంటి వ్యూహం అమలు చేస్తుందనే ఆసక్తి కనిపిస్తోంది. ఏది ఏమైనా జగన్ పర్యటనకు పోలీసులు అనుమతించడంతో వైసీపీ భారీ ప్రదర్శనకు రంగం సిద్ధం చేస్తోందని అంటున్నారు.