ఏం సాధించినట్టు.. జగన్ పర్యటనపై జనం టాక్...!
వైసీపీ అధినేత జగన్.. తాజాగా చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పర్యటించారు. యధావిధిగా పోలీసుల ఆంక్షలు పక్కదారి పట్టాయి.
By: Tupaki Desk | 10 July 2025 4:46 PM ISTవైసీపీ అధినేత జగన్.. తాజాగా చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పర్యటించారు. యధావిధిగా పోలీసుల ఆంక్షలు పక్కదారి పట్టాయి. భారీ ఎత్తున తరలి వచ్చిన కార్యకర్తలు, నాయకులతో కలిసి ఆయన రైతుల ను పరామర్శించారు. వారి సమస్యలు విన్నారు. అయితే.. వారికి ప్రత్యక్షంగా ఏమీ చేయలేనని చెప్పారు. అంతేకాదు.. ప్రభుత్వంపై తాను ఒత్తిడి తీసుకువస్తేనే.. ఈ మాత్రం అయినా.. జరుగుతున్నాయని తెలిపారు. దీనిపై రైతుల్లోనూ అసహనం ఏర్పడింది.
గతంలో వైసీపీ హయాంలో కూడా ఇదే సమస్య వెంటాడిందని.. అప్పుడు జగన్ ఏమీ చేయలేకపోయారని మెజారిటీ రైతులు వ్యాఖ్యానించారు. నిజానికి అప్పట్లోనూ మామిడితోపాటు.. చిత్తూరు జిల్లాలో టమోటా రైతులు ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై టమోటాలను పారబోసి నిరసన తెలిపారు. అయినప్పటికీ.. జగన్ బయటకు రాలేదు. ఇక, మామిడి రైతులు.. కరోనా సహా.. తర్వాత రెండేషళ్ల పాటు పంటల జోలికి కూడా పోలేదు. అప్పట్లో ఈ రైతులను గాలికి వదిలేశారన్న వాదన వినిపించింది.
కానీ.. జగన్ మాత్రం మౌనంగానే ఉండిపోయారు. ఇక, ఇప్పుడు తగుదునమ్మ అంటూ.. రైతులను పరామర్శించేందుకు వెళ్లినా.. ఇది రాజకీయ పర్యటననే తలపించిందన్న వాదన బలంగా వినిపించింది. అధికార పార్టీ విమర్శలు గుప్పించినట్టుగానే.. వైసీపీ నాయకులు.. హద్దులు మీరడం, దీనిని రైతు యాత్రగా కంటే కూడా.. రాజకీయ యాత్రగా మార్చడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. అంతేకాదు.. రైతులకు ఏమీ చేయలేనని చెప్పేందుకు జగన్ అక్కడకు వెళ్లడంఎందుకన్న వాదనా వినిపించింది.
ప్రభుత్వాన్ని తిట్టేందుకు ఈ పర్యటన పెట్టుకున్నారన్న విమర్శలు కూడా వినిపించాయి. ఇక, సర్కారు ఏమన్నా.. జగన్ పర్యటనలతో ఉలిక్కిపడిందా..? అంటే.. అదేమీ లేదు. ముందుగానే కేంద్రంతో చర్చిం చి.. మామిడి రైతులను ఆదుకునేలా నిధులు ఇవ్వాలని కోరింది. మంత్రి అచ్చెన్నాయుడు రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించి.. వచ్చారు. రైతులకు మేలు చేయాలన్న సంకల్పంతోనే ఈ పర్యటన పెట్టుకున్నారు. కానీ, జగన్ తన పర్యటనతోనే ప్రభుత్వం దిగి వచ్చిందని చెప్పడంపై నెటిజన్లు సైతం ఎద్దేవా చేస్తున్నారు.
