జగన్ 'ఇలా.. ఇలా..' : చంద్రబాబు మరోలా!
ఈ సన్నివేశం అందరినీ ఆకట్టుకుంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో నేతలు ఒక్కొక్కరిది ఒక్కోస్టైల్ అంటూ చర్చ జరుగుతోంది.
By: Tupaki Political Desk | 15 July 2026 2:00 PM ISTరాజకీయ నేతలకు తమ మాటే ఒక ఆయుధం. బాడీ లాంగ్వేజ్ (వ్యవహారశైలి/ఆహర్యం) ప్రజలను కనెక్ట్ చేసే బలమైన వారధి. వేదికపైకి రాగానే చేసే చిన్న సైగ, పదే పదే పలికే ఒక పదబంధం, లేదా ఒక ప్రత్యేకమైన శైలి ఆ నాయకుడికి ప్రజల్లో ఒక ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్‌ను క్రియేట్ చేస్తాయి. తాజాగా భీమవరం సభలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనదైన ట్రేడ్ మార్క్ శైలిలో అక్వా రైతుల సమస్యలను ఎలుగెత్తి చాటారు. అక్వా రైతుల సమస్యలను తెలుసుకునేందుకు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన జగన్ ప్రభుత్వం చెప్పిన విధంగా ఫీడ్, సీడ్ ధరలు తగ్గలేదని నిరూపించేందుకు రైతులతో ‘ఇలా.. ఇలా.. ఇలా..’ చేతులు ఊపండని జగన్ చెప్పించారు. ఈ సన్నివేశం అందరినీ ఆకట్టుకుంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో నేతలు ఒక్కొక్కరిది ఒక్కోస్టైల్ అంటూ చర్చ జరుగుతోంది.
జగన్మోహన్ రెడ్డి : పదే పదే.. గట్టిగా..
మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రసంగాల్లో ఒక లయ ఉంటుంది. ప్రభుత్వాన్ని విమర్శించేటప్పుడు ఒక పదాన్ని రెండు మూడు సార్లు నొక్కి చెప్పడం ఆయన అలవాటు. "ఇలా.. ఇలా.. ఇలా..", "గట్టిగా చేతులు ఊపండి" అంటూ కార్యకర్తలను ఉత్సాహపరచడం, సభలో జోష్ నింపడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. తన ప్రసంగాల్లో భావోద్వేగాలను పండించడంలో, ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలను గుప్పించడంలో జగన్ తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నారని చెబుతుంటారు.
చంద్రబాబు స్టైల్ విక్టరీ
ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు తనదైన హుందాతనంతో ప్రజలకు అభివాదం చేస్తుంటారు. వేదికపై ఎక్కగానే రెండు వేళ్లతో 'విక్టరీ సింబల్' చూపడం ఆయన ట్రేడ్ మార్క్. ఇది కేవలం ఒక సైగ మాత్రమే కాదు, కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపే ఒక సంకేతం. దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబును చూడగానే అభిమానులు సైతం విక్టరీ సింబల్ చూపుతుంటారు. తెలుగు నేలపై మరే నేతకు ఇటువంటి అభివాదం ఉండదు. చంద్రబాబు మాదిరిగానే టీడీపీ నాయకులు, కార్యకర్తలు సైతం విక్టరీ సింబల్ తోనే అభివాదాలు చేస్తుంటారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి : కుయ్.. కుయ్..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాట తీరులో ఉండే నేర్పు, ప్రజలకు అర్థమయ్యే సరళత అద్భుతం. ఆయన ప్రసంగాలంటేనే ఒక భరోసా. ఉదాహరణకు, 108 అంబులెన్స్ సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆయన చెప్పిన "కుయ్.. కుయ్.. కుయ్.. అంటూ అంబులెన్స్ వస్తుంది" అనే మాట ఇప్పటికీ అందరికీ గుర్తే. సంక్లిష్టమైన పథకాలను కూడా సామాన్యుడికి అర్థమయ్యేలా, తన మాటలతో వారి మనసు గెలుచుకోవడం వైఎస్సార్‌కే చెల్లిందని ఆయన అభిమానులు చెబుతుంటారు.
కేసీఆర్: యాసలో ఆత్మగౌరవం
తెలంగాణకు చెందిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉపన్యాస శైలిని ఎవరూ అనుకరించలేరు. తెలంగాణ యాసను, సంస్కృతిని తన మాటల్లో జోడించి, ప్రజల్లో ఆత్మగౌరవాన్ని రగిల్చడం ఆయన ప్రత్యేకత. చమత్కారాలు, వ్యంగ్యస్త్రాలు, పురాణ గాథలు, ఉర్దూ, తెలుగు పదాల మిశ్రమంతో ఆయన చేసే ప్రసంగాలు సభికులను కట్టిపడేస్తాయి. "ఏం జరగాలి?", "ఏం కావాలి?" అని ఆయన పలికే తీరులో ఒక రకమైన ఆవేశం, వాదన కనిపిస్తుంది.
రేవంత్ రెడ్డి: దూకుడు.. ఆవేశం
ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగాల్లో దూకుడు కనిపిస్తుంది. ఆయన మాటల్లో ఆవేశం, వాస్తవాలను ఎత్తిచూపే ధైర్యం ఉంటాయి. ప్రత్యర్థులను అడ్రస్ చేసే విధానం, ప్రజల సమస్యలపై స్పందించే తీరులో ఒక రకమైన 'కౌంటర్' ఫాలో అవుతుంటారు. ప్రజలతో నేరుగా కనెక్ట్ అయ్యేందుకు ఆయన వాడే భాష, ఉపయోగిస్తున్న బాడీ లాంగ్వేజ్ ఆయనకు యువతలో ఒక ప్రత్యేక క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి.
నాయకుల వ్యవహారశైలి గమనిస్తే బహిరంగ సభలు లేదా సమావేశాల్లో నాయకుడు చెప్పే అంశం ఎంత ముఖ్యమో, దాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నారనేది అంతకంటే ముఖ్యమని అంటున్నారు. తమదైన హావభావాలు, ట్రేడ్ మార్క్ మాటలతో ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకోవడం మన నేతల నైజం అంటున్నారు.
