నచ్చని పేరుతో లోకేష్ ని కెలికిన జగన్
ఇక లేటెస్ట్ గా జగన్ మంత్రి లోకేష్ చూస్తున్న విద్యా శాఖ మీద తన ట్విట్టర్ ని గురి పెట్టారు.
By: Tupaki Desk | 30 Jun 2025 9:41 AM ISTవైఎస్ జగన్ ఇపుడు ఎక్కువగా ట్విట్టర్ హ్యాండిల్ కి పని చెబుతున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ ని వేదికగా ఉపయోగించుకుంటున్నారు. అదే సమయంలో వీలుంటే ఆయన మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. అయితే మీడియా సమావేశాలు తరచూ నిర్వహించడం కుదరదు కాబట్టి ట్విట్టర్ ని మాత్రం బాగానే సౌండ్ చేయిస్తున్నారు.
ఇక లేటెస్ట్ గా జగన్ మంత్రి లోకేష్ చూస్తున్న విద్యా శాఖ మీద తన ట్విట్టర్ ని గురి పెట్టారు. ఆయన ఏపీలో ఇంజనీరింగ్ అడ్మిషన్ల విషయంలో ప్రభుత్వం చేస్తున్న తాత్సారం మీద తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ ట్వీట్ ఇలా ఉంది.
రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఏపీఈసెట్ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ. ఈసెట్ రిజల్ట్స్ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదు. మరోవైపు రేపటి నుంచి ఇంజినీరింగ్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం అవుతున్నాయి. ఇంజినీరింగ్ రెండో ఏడాదిలో అడ్మిషన్లకోసం 34వేల మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఈసెట్ పరీక్షలు రాస్తే అందులో 31,922 మంది ఉత్తీర్ణత సాధించారు. గతనెల మే 15న ఫలితాలు వెలువడినా, ఇప్పటికీ కౌన్సెలింగ్ ప్రక్రియపై షెడ్యూల్ విడుదలచేయకపోవడం, ఆ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడం, విద్యావ్యవస్థలో నెలకొన్న దారుణ పరిస్థితులకు మరో నిదర్శనం. అమాత్యా మేలుకో.. పప్పూ నిద్ర వదులు.
ఇదన్న మాట. ఈ ట్వీట్ లో తప్పు ఏమీ లేదు. ప్రభుత్వాన్ని విపక్ష నేతగా జగన్ విమర్శించడం సహజం. పైగా విద్యా వ్యవస్థలో తాను అనుకున్న పొరపాట్లు ఏమైనా ఉంటే సరిచేయమని లేదా మేల్కోమని చెప్పే హక్కు ఆయనకు ఉంది. అయితే ఇంత ట్వీటూ చేసిన జగన్ చివరిలో మాత్రం పప్పూ నిద్ర వదులు అని లోకేష్ ని ఎక్కడో కెలికారు.
లోకేష్ కి పప్పు అన్న పేరు పెట్టింది వైసీపీ వారే. ఆయనను 2014 నుంచి అలాగే పిలుస్తూ వచ్చారు. సోషల్ మీడియాలో కూడా అదే పిలుపుతో లోకేష్ మీద సెటైర్లు వేసేవారు అయితే వీరంతా పార్టీలో చిన్న స్థాయి నాయకులు. ఇక ఒకరిద్దరు అగ్ర నాయకులు లోకేష్ ని పప్పు నాయుడూ అని ఎద్దేవా చేసినా అది వారి స్థాయికి ఒక రేంజికే పరిమితం. జగన్ వరకూ చూస్తే ఆయన ఎపుడూ ఎవరినీ హార్ష్ గా విమర్శించినది లేదు.
తన పార్టీ వారిని ఆయన కట్టడి చేయలేకపోయారు అన్న నిందలే ఆయన మీద ఉన్నాయి. కానీ తాజాగా లోకేష్ మీద జగన్ పెట్టిన ట్వీట్ లో మాత్రం పప్పూ అని సంభోధించడం పట్ల చర్చ సాగుతోంది. జగన్ వంటి నాయకుడు సీఎం చేసిన వారు ఇలా నిక్ నేమ్ తో ప్రత్యర్ధులను నేరుగా విమర్శించడం ఎంతవరకూ మేలు చేస్తుంది, ఈ విధానం ఏ మేరకు కరెక్ట్ అన్న చర్చ కూడా వస్తోంది.
ఇక చూస్తే లోకేష్ ని ఒకపుడు పప్పు అన్న వారే ఇపుడు మెచ్చుకుంటున్నారు. 2019 నుంచి ఈ రోజు దాకా చూస్తే లోకేష్ తన గ్రాఫ్ ని అంతకంతకు పెంచుకుంటూ పోతున్నారు. ఆయన పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కీలకంగా మారారు. ఆయన రాజకీయంగా మంచి పరిణతి చూపిస్తున్నారు.
ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలీ అంటే ఆయన జగన్ మోహన్ రెడ్డి గారూ అని సంభోదించి ట్వీట్లు చేస్తారు. ఆ విధంగా లోకేష్ హుందాగా వ్యవహరిస్తూంటే సీఎం చేసిన జగన్ మాత్రం పప్పూ అని ఎద్దేవా చేయడం పట్ల చర్చ సాగుతోంది. ఇది జగన్ స్థాయికి తగనిదని అంటున్నారు. ఇలా చేయడం ద్వారా తన మీద పై స్థాయి వారు నేరుగా మరింత దారుణంగా ట్వీట్లు పెట్టేందుకు అవకాశం ఇస్తున్నారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
