జగన్ నిర్ణయంపై చర్చ... వైసీపీ అధినేత లెక్కలేమిటో?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం మరోసారి చర్చలకు దారి తీస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంలో వైఎస్సార్‌సీపీ తీసుకున్న తాజా నిర్ణయం వివిధ వర్గాల్లో చర్చనీయాంశమైంది
By: Tupaki Desk | 24 Aug 2025 11:37 AM ISTఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం మరోసారి చర్చలకు దారి తీస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంలో వైఎస్సార్‌సీపీ తీసుకున్న తాజా నిర్ణయం వివిధ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అధికార ప్రతిపక్షం ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ప్రకటించడమే కాకుండా, తమకు ఉన్న పార్లమెంటు సభ్యులంతా ఒకే అభ్యర్థికి ఓటేయనున్నారని స్పష్టం చేసింది. పార్టీ నిర్ణయం కావడం సహజమే అయినా, ఈ నేపథ్యంలో గతం గుర్తుకు వస్తోందని విశ్లేషకులు సూచిస్తున్నారు.
విమర్శలు మరిచి మద్దతు?
ఎందుకంటే, ఎన్నోసార్లు వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రజల మదిలో నిలిచిపోయాయి. ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, విభజన చట్టం కింద అమలు కావాల్సిన హామీలు లేకుండా కేంద్రానికి మద్దతు ఇవ్వం అని గతంలో పదే పదే జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు కూడా ఇదే వాగ్దానం పునరుద్ఘాటించారు. కానీ ఇప్పుడు ఏ మాత్రం షరతులు లేకుండా మద్దతు ప్రకటించడమేంటి అన్న ప్రశ్న సహజంగానే వస్తోంది.
రాజకీయ లెక్కలేనా?
ఇక జనసేన–బీజేపీ–టీడీపీ కలయికను రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టిందని విమర్శించిన జగన్, తాను ప్రకటించిన మద్దతుతో ఏం సాధించబోతున్నారన్నది స్పష్టంగా చెప్పకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది. రాష్ట్రానికి మేలు జరిగేలా ఏమైనా అంగీకారాలు తీసుకువచ్చారా? లేక కేవలం రాజకీయ లెక్కలు మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రయోజనం వైసీపీకా.. రాష్ర్టానికా?
ప్రస్తుతం ఈ నిర్ణయంతో వైసీపీకి నిజంగా ఏ ప్రయోజనం దక్కబోతోంది? రాష్ట్రానికి ఉపయోగం కలుగుతుందా? లేక గతంలో చేసిన విమర్శలన్నీ మాటలకే పరిమితమయ్యాయా? అనే అంశంపై రాజకీయ విశ్లేషకులు ఆలోచన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కేంద్రానికి బలంగా నిలబడి రాష్ట్ర హక్కులు సాధిస్తామని చెప్పిన జగన్, మరోవైపు షరతులు లేకుండా మద్దతు ప్రకటించడం ఆయన వైఖరిపై కొత్త చర్చకు దారితీస్తోంది.
బీజేపీ వైఖరేంటో..
ప్రస్తుత పరిస్థితుల్లో ఉప రాష్ర్టపతి ఎన్నికకు వైసీపీ మద్దతు అవసరం లేదు. కానీ బీజేపీ కోరకున్నా వైసీపీ మద్దతు పలకడం చర్చనీయాంశమైంది. అయితే ఇది జగన్ కు కొత్తేమీ కాదు. గతంలో తాను అధికారంలో ఉన్నప్పుడూ బీజేపీ కూటమికి చాలా బిల్లులకు బహిరంగంగానే మద్దతు ఇచ్చాడు. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా బీజేపీకి అవసరం లేకున్నా భవిష్యత్ లో ఎప్పుడైనా ఉపయోగపడే అవకాశం లేకపోలేదు. ఇందుకు కారణం బీజేపీ పార్లమెంట్ సీట్లు తగ్గడమే. ఈ కోణంలో కూడా బీజేపీ జగన్ మద్దతును కాదనలేకపోతున్నది.
