రప్ప రప్పా ఎఫెక్ట్: 4 జిల్లాలు.. 16 కేసులు.. 100 మంది నిందితులు!
అవును... ఈ నెల 21న వైఎస్ జగన్ పుట్టినరోజున, ఆ తర్వాత రాష్ట్రంలో పలు చోట్ల పొట్టేళ్లను బలి ఇవ్వడం, ఆ రక్తంతో జగన్ ఫ్లెక్సీలకు అభిషేకం చేశారనే ఆరోపణలు వినిపించడం జరిగిన సంగతి తెలిసిందే!
By: Raja Ch | 28 Dec 2025 10:45 AM ISTవైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలు తెలుగు రాష్టరంలోన్నే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కేకులు కట్ చేయడం, పండ్లు పంచిపెట్టడం, అన్నదానాలు, వస్త్రదాణాలు, రక్తదానాలు చేయడం జరిగింది. మరోవైపు రోడ్లపై కత్తులతో హల్ చల్, పొట్టేళ్ల బలులు వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండో పనిపై పోలీసులు స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు.
అవును... ఈ నెల 21న వైఎస్ జగన్ పుట్టినరోజున, ఆ తర్వాత రాష్ట్రంలో పలు చోట్ల పొట్టేళ్లను బలి ఇవ్వడం, ఆ రక్తంతో జగన్ ఫ్లెక్సీలకు అభిషేకం చేశారనే ఆరోపణలు వినిపించడం జరిగిన సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో ఈ విషయాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారంపై పోలీసులకు పలు ఫిర్యాదులు అందాయని అంటున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 4 జిల్లాల్లో 16 మందిపై కేసులు నమోదు చేశారు.
ఇందులో భాగంగా... అనంతపురం జిల్లా, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఆరేసి చొప్పున.. చిత్తూరులో మూడు, తీర్పుగోదావరి జిల్లాలో ఒక కేసు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 100 మందికి పైగానే నిందితులున్నారని అంటున్నారు. వీరిలో ఇప్పటికే 63 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని కోర్టులో హాజరుపరిచారు. మరోవైపు ఇప్పటికే పరారీలో ఉన్నవారిని గాలిస్తున్నారు. మరికొందరికి నోటీసులు ఇచ్చి విచారించారు.
శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లె మండలం భానుకోటలోని ప్రభుత్వ పాఠశాల వద్ద ఈ నెల 21వ తేదీ రాత్రి పొట్టేలు తల నరికి, ఆ రక్తంతో జగన్ ఫోటో ఉన్న ఫ్లెక్సీకి అభిషేకం చేసిన వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు 13 మందిని అరెస్టు చేశారు. వీరందరినీ కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఇదే సమయంలో ధర్మవరంలోనూ జగన్ ఫోటో ఉన్న ఫ్లెక్సీకి రక్తాభిషేకం చేశారని 8 మందిని అరెస్ట్ చేశారు.
ఈ క్రమంలో ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం తూర్పుచోడవరంలో అంతా చూస్తుండగా పెద్ద కత్తితో పొట్టేలు తల నరికి ఆ రక్తంతో జగన్ ఫోటో ఉన్న ఫ్లెక్సీకి అభిషేకం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురిని శనివారం అరెస్ట్ చేసిన పోలీసులు.. నల్లజర్ల చెక్ పోస్ట్ నుంచి ప్రభుత్వాసుపత్రి వరకు నడిరోడ్డుపై నడిపిస్తూ తీసుకెళ్లారు. ఈ చర్యపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు!
నిందితులకు బెయిల్!:
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫోటో ఉన్న ఫ్లెక్సీ వద్ద పొట్టేలును బలిచ్చిన ఘటనలో అరెస్టైన ఏడుగురు నిందితులకు తాడేపల్లిగూడెం కోర్టు బెయిల్ మంజూరు చేసిందని వైసీపీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి వాముశెట్టి పరమేశ్వరరావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం చోడవరంలో చోటు చేసుకున్న ఈ వ్యవహారంలో పోలీసులు నిందితులను శనివారం కోర్టులో హాజరుపరచగా.. నిందితుల తరుపు వాదనలు విన్న కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
