జగన్‌కు భారీ ఊరట.. సింగయ్య కేసులో హైకోర్టు ఆర్డర్!
ఈ పర్యటన సమయంలో నే సింగయ్య అనే పార్టీ కార్యకర్తల జగన్ కాన్వాయ్ కింద పడి.. తర్వాత ఆసుపత్రిలో మృతి చెందారు.
By: Tupaki Desk | 1 July 2025 3:28 PM ISTవైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు భారీ ఊరట లభించింది. జగన్‌ను విచారించవద్దని పోలీసులను ఆదేశిస్తూ.. హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత నెల జూన్‌లో జగన్ గుంటూరు జిల్లా రెంటపాళ్ల గ్రామంలో పర్యటించారు. ఈ సమయంలో భారీ ఎత్తున అభిమానులు కదలి వచ్చారు. ఈ పర్యటన సమయంలో నే సింగయ్య అనే పార్టీ కార్యకర్తల జగన్ కాన్వాయ్ కింద పడి.. తర్వాత ఆసుపత్రిలో మృతి చెందారు.
దీనిపై పోలీసులకు సింగయ్య భార్య ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. జగన్ కాన్వాయ్ డ్రైవర్.. రమణ్యను పోలీసులు అరెస్టు చేశారు. ఈయనను ఏ1గా పేర్కొన్నారు. ఇక, జగన్ ను ఏ2గా, ఈ కారులో ప్రయాణించిన ఇతర మాజీ మంత్రులపై కూడా పోలీసులు కేసు పెట్టారు. ఇక, దీనికి సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. చివరకు ఈ కేసు హైకోర్టుకు చేరింది. తమపై పెట్టిన కేసులను కొట్టివేయాలని కోరుతూ.. మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజనీలు కోరారు.
తనపై కూడా కేసు పెట్టడంతో జగన్ కూడా హైకోర్టును ఆశ్రయించారు. గతంలోనే దీనిపై విచారణ జరగ్గా.. మంగళవారం(జూలై 1 వరకు) ఎవరిపైనా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. తాజాగా మంగళ వారం జరిగిన విచారణలో పోలీసుల తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఫోరెన్సిక్ నివేదిక రావాల్సి ఉందని.. దీనిని సమర్పించేందుకు మరింత బలమైన వాదనలు వినిపించేందుకు రెండు వారాల వరకు సమయం కావాలని కోరారు.
దీనికి సమ్మతించిన కోర్టు.. వచ్చే రెండు వారాల వరకు కూడా అసలు ఈ కేసు విచారణను కూడా చేపట్ట వద్దని తేల్చి చెప్పింది. దీంతో జగన్‌కు బిగ్ రిలీఫ్ లభించింది. కాగా.. తనపై రాజకీయ కక్ష పూరితంగా కేసు పెట్టారంటూ.. జగన్ కోర్టులో తన వాదనలు వినిపించడం గమనార్హం. దీనిపై హైకోర్టు ఎలాంటి కామెంట్లు చేయలేదు.
