మళ్లీ యలహంకకు వెళ్లిన జగన్.. ఇది ఎన్నోసారో తెలుసా?
2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైసీపీ అధినేత జగన్ ఎక్కువగా బెంగళూరు యలహంక ప్యాలెస్ లోనే గడుపుతున్నారని టీడీపీ విమర్శిస్తోంది.
By: Tupaki Desk | 20 Sept 2025 3:52 PM IST2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైసీపీ అధినేత జగన్ ఎక్కువగా బెంగళూరు యలహంక ప్యాలెస్ లోనే గడుపుతున్నారని టీడీపీ విమర్శిస్తోంది. ఇప్పుడు కూడా అసెంబ్లీ సమావేశాలకు డుమ్మాకొట్టిన మాజీ సీఎం.. బెంగళూరు వెళ్లిపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు అసెంబ్లీ, మండలి సమావేశాలు జరుగుతుండగా, విపక్ష హోదా ఇవ్వలేదన్న కారణం చూపి జగన్ అసెంబ్లీకి వెళ్లడం లేదు. తనతోపాటు ఎమ్మెల్యేలు ఎవరూ అసెంబ్లీకి రారని ప్రకటించారు. ఇదే సమయంలో విపక్ష హోదా ఉండటంతో శాసనమండలి సమావేశాలకు వైసీపీ సభ్యులు హాజరవుతున్నారు. అయితే వారికి అందుబాటులో ఉంటూ మార్గనిర్దేశం చేయాల్సిన వైసీపీ అధినేత శుక్రవారం బెంగళూరు వెళ్లిపోయారని ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.
గత ఎన్నికల్లో ఎదురైన ఓటమితో ప్రతిపక్ష నేత జగన్ ఎక్కువగా బెంగళూరులోనే ఉంటున్నారు. వైసీపీని ప్రారంభించకముందు జగన్ బెంగళూరులో నివాసం ఉండేవారన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన స్వస్థలం కడపకు బెంగళూరు దగ్గరగా ఉండటం, సొంత వ్యాపారాలు కారణంగా అనుకూలంగా ఉంటుందని జగన్ తండ్రి సీఎంగా ఉన్నప్పుడు యలహంకలో విలాసవంతమైన భవనం నిర్మించుకున్నారు. ఈ భవనం తర్వాత హైదరాబాద్ లోని లోటస్ పాండులో కూడా మరో భవనం నిర్మించారు. వైసీపీ స్థాపించిన తర్వాత రాష్ట్ర విభజన వరకు అంటే 2014 వరకు హైదరాబాద్ నుంచి జగన్ రాజకీయ కార్యకలాపాలు నిర్వహించేవారు. 2019 ఎన్నికలకు ముందు తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్న తర్వాత.. మకాం ఇక్కడికి మార్చారు. రాజకీయం కూడా తాడేపల్లి కేంద్రంగానే కొనసాగించారు.
అయితే 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ తీరులో పూర్తిగా మార్పు వచ్చిందని చెబుతున్నారు. నెలలో ఒకటి రెండు సార్లు మాత్రమే తాడేపల్లి వచ్చి, ఓ రెండు రోజులు ఉండి వెళ్లిపోతున్నారు. మిగిలిన రోజులు మొత్తం బెంగళూరులోనే ఉంటున్నట్లు వైసీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్రానికి వచ్చిన జగన్.. అసెంబ్లీ జరిగే సమయంలో తాను మీడియాతో మాట్లాడతానని గతంలో చెప్పారు. ప్రతిపక్ష హోదా ఇవ్వని కారణంగా సభలో తనకు ప్రజాసమస్యలు లేవనెత్తేందుకు తగినంత సమయం ఇవ్వరని జగన్ చెబుతున్నారు. అందుకే అసెంబ్లీ జరిగిన సమయంలో మీడియా ముఖంగానే ప్రజా సమస్యలు వెలుగులోకి తెస్తానని చెప్పారు.
ఇక ఈ నెల 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవ్వగా, బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చిన జగన్.. పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ఎల్పీ మీటింగు నిర్వహించారు. తనకు ప్రతిపక్ష నేతగా గుర్తిస్తే అసెంబ్లీకి వస్తానని మరోసారి పునరుద్ఘాటించారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గకపోవడంతో రెండు రోజులుగా జరుగుతున్న సభకు ఆయన వెళ్లలేదు. ఇక శని, ఆదివారాలు సభకు విరామం కావడంతో జగన్ మళ్లీ యథావిధిగా బెంగళూరు వెళ్లిపోయారు. సోమవారం మళ్లీ ఆయన తాడేపల్లి వస్తారా? లేదా? అన్నది మాత్రం క్లారిటీ లేదు. అయితే సీఎం పదవి నుంచి దిగిపోయిన తర్వాత జగన్ 51వ సారి బెంగళూరు వెళ్లారంటూ టీడీపీ ప్రకటించింది. భవిష్యత్తులోనూ జగన్ బెంగళూరులోనే ఉంటారని చెప్పడమే కాకుండా ఆయన విమానంలో ప్రయాణిస్తున్న ట్రిప్పులను లెక్కపెడుతుండటం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
