బాబుకు థాంక్స్...జగన్ సంచలనం
ఇవన్నీ ఇలా ఉంటే వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ తొలిసారి కూటమి ప్రభుత్వం చేసిన దానిని మెచ్చుకున్నారు.
By: Tupaki Desk | 13 May 2025 7:00 PM ISTఏపీలో రాజకీయం ఎలా నడుస్తుందో అందరికీ తెలిసిందే. అధికార పక్షానికి ప్రతిపక్షానికి మధ్య ఉప్పు నిప్పులా పరిస్థితి ఉంటుంది. ఒకరి గురించి ఒకరు మంచి చెప్పుకోరు, కానీ ఎప్పటికప్పుడు చెడునే చూస్తారు. ఘాటైన విమర్శలు చేస్తూ ఉంటారు.
ఇక ఒక ప్రభుత్వం మంచి చేసినపుడు ఫలానా మంచి చేస్దిందని చెప్పాలి. అపుడే ఆ ప్రభుత్వం చెడు చేసినా చెబితే ప్రభుత్వ పెద్దల్లూ ఔను కదా అనుకుంటారు. జనాలూ నమ్ముతారు. అదే అసలైన నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్రగా ఉంటుంది. ఏపీలో గత కొన్నేళ్ళుగా అలాంటి నిర్మాణాత్మకమైన పాత్ర అన్నది కరవు అయింది.
అయిదేళ్ళ పాటు ఏపీని పాలించిన వైసీపీ హయాంలో మంచి ఉంది చెడూ ఉంది. అయితే మంచి చేసినపుడు దానిని పక్కన పెట్టేసి చెడునే ఎక్స్ పోజ్ చేయడం రాజకీయంగా మేలైన వ్యూహం అయితే కావచ్చు. కానీ ప్రతిపక్షం లో ఉన్న వారు అలా చేయకూడదు అన్నదే అంతా అంటారు. ఇక వైసీపీ విషయం తీసుకుంటే గత ఏడాది గా కూటమి ప్రభుత్వం తీరుని తప్పు పడుతూనే వస్తోంది.
కూటమి ప్రభుత్వం కూడా ఈ ఏడాదిలో మంచి పనులు చేసినవి ఉన్నాయి. ఇక పొరపాట్లు ఏవో ఉండవచ్చు. అది సహజం. అలా చేసినపుడు ప్రజలకు ఇది ఇబ్బంది అని చెప్పడమే విపక్ష పాత్ర. ఆ విధంగా ప్రభుత్వాన్ని ప్రజలకు అవసరమైన పనులు చేయమని ఒత్తిడి తేవాల్సిన బాధ్యత కూడా ప్రతిపక్షానిదే.
ఇవన్నీ ఇలా ఉంటే వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ తొలిసారి కూటమి ప్రభుత్వం చేసిన దానిని మెచ్చుకున్నారు. బాబు ముఖ్యమంత్రిత్వంలో కూటమి సర్కార్ కి ధన్యవాదాలు కూడా చెప్పారు. అది ఏమితి ఏ సందర్భంలో అంటే శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలలో మురళీ నాయక్ అనే తెలుగు జవాన్ మరణించారు. ఆ జవాన్ కుటుంబాన్ని పరామర్శించిన తరువాత మీడియాతో మాట్లాడిన జగన్ కూటమి ప్రభుత్వం జవాన్ కుటుంబానికి 50 లక్షల ఎక్స్ గ్రెషియా ఇవ్వడాన్ని ఆయన మెచ్చుకున్నారు.
ఇది మంచి విధానమని అన్నారు. పోరాటం చేస్తూ జవాన్ మరణిస్తే ఆ కుటుంబానికి యాభై లక్షలు ఇవ్వాలని ఆ మొత్తాన్ని పెంచినది వైసీపీ ప్రభుత్వమే అని ఆయన గుర్తు చేశారు. ఆ సంప్రదాయాన్ని ప్రారంభించినది తమ ప్రభుత్వం అయితే దానిని కొనసాగించిన కూటమి ప్రభుత్వానికి థాంక్స్ అని జగన్ అన్నారు. దాంతో జగన్ ఈ విధంగా కూటమి ప్రభుత్వాన్ని తొలిసారి మెచ్చుకున్నారు అని అంతా అంటున్నారు.
ఇదే తీరున ప్రభుత్వం ఏ మంచి పని చేసినా మెచ్చుకుంటూ తప్పులు చేస్తే నిలదీసిన నాడు వైసీపీ నిర్మాణాత్మక పంధా అన్నది మరింత ఎక్కువగా జనంలోకి వెళ్తుందని అంతా అంటున్నారు. రాజకీయాలు అంటేనే ప్రజల కోసం కాబట్టి వైసీపీ అయినా మరో పార్టీ అయినా బేషజాలు పక్కన పెట్టి ప్రజా హితం రాష్ట్ర హితం అన్న కోణంలో ప్రతీ విషయాన్ని ఆలోచించి తగిన సూచనలు కానీ లేక విమర్శలు కానీ చేస్తే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుంది అని అంటున్నారు.
ఇక మురళీ నాయక్ కుటుంబానికి వైసీఎపీ తరఫున జగన్ పాతిక లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు. తమ పార్టీ ఎపుడూ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని అన్నారు. మురళీ అంటే ఇపుడు ఒక స్పూర్తి అని కూడా కొనియాడారు. ఆయన తాను చనిపోతూ దేశాన్ని రక్షించారు అని జగన్ అన్నారు.
