Begin typing your search above and press return to search.

జగన్ మీద కాంగ్రెస్ కి కోపం అలాగే ఉందా ?

జగన్ కాంగ్రెస్ ని వీడడం కొత్త పార్టీని పెట్టుకోవడంతో ఆ పార్టీ అధినాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేయడం జగన్ జైలుకు వెళ్ళడం ఇలా చాలా జరిగాయి.

By:  Tupaki Desk   |   7 April 2025 9:00 PM IST
జగన్ మీద కాంగ్రెస్ కి కోపం అలాగే ఉందా ?
X

వైఎస్సార్ కి కాంగ్రెస్ కి ఉన్న బంధం భావోద్వేగపూరిత మైనది. వైఎస్సార్ సోనియా గాంధీకి అత్యంత విధేయుడిగా మెలిగారు. ఒక విధంగా చెప్పాలీ అంటే ఆయన సోనియా కుటుంబ సభ్యుడు అన్నంతగా సాన్నిహిత్యం నెరిపారు. అయితే ఆయన మరణానంతరమే వైఎస్సార్ ఫ్యామిలీకి కాంగ్రెస్ కి మధ్య గ్యాప్ వచ్చింది. జగన్ కాంగ్రెస్ ని వీడడం కొత్త పార్టీని పెట్టుకోవడంతో ఆ పార్టీ అధినాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేయడం జగన్ జైలుకు వెళ్ళడం ఇలా చాలా జరిగాయి.

అలా కాంగ్రెస్ తో జగన్ కి ఆదిలోనే చెడింది. జగన్ రాజకీయ జీవితం కాంగ్రెస్ తో ప్రారంభం అయినా ఆయన మాత్రం వేరుగానే తన పాలిటిక్స్ కి రూట్ వేసుకున్నారు. కాంగ్రెస్ ఎంపీగా ఏణ్ణర్థం పాటు మాత్రమే ఆయన కొనసాగారు. ఇక కాంగ్రెస్ తో జగన్ కి గ్యాప్ ఎలా వచ్చింది ఎవరి వైపు తప్పు ఎంత ఉంది అన్నది రాజకీయ పండితులు ఎవరికి వారుగా ఎన్నో సార్లు విశ్లేషించారు. అయితే రాజకీయాల్లో ఇవన్నీ సహజం అని కూడా అనుకున్నారు.

కానీ జగన్ విషయంలో మాత్రం రాజకీయాలకు అతీతమైన విరోధమే కాంగ్రెస్ పట్ల కొనసాగుతోంది. ఆయన కాంగ్రెస్ వైపునకు చూసేందుకు ఇష్టపడడం లేదు. కాంగ్రెస్ వైపు నుంచి ఆయనకు పిలుపులు వచ్చాయా సంప్రదింపులు జరిగాయా అన్నది మరో విషయం అయితే కలలో కూడా ఆ ఆలోచన జగన్ చేయడం లేదని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.

దానికి తన వ్యక్తిగత కారణాలతో పాటు రాజకీయ కారణాలు కూడా అనేకం ఉన్నాయి. వ్యక్తిగతంగా అయితే జగన్ తనను పదహారు నెలల పాటు జైలులో పెట్టించిన కాంగ్రెస్ ని క్షమించలేకపోతున్నారు అని అంటారు. రాజకీయంగా చూస్తే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా వైసీపీ వైపు ఉంది. ఆ పార్టీకి దగ్గర చేరినా పొత్తు పెట్టుకున్నా కోరి మరీ ఆ పార్టీని బలోపేతం చేసినట్లు అవుతుందని వ్యూహంగా ఉందని చెబుతారు. సో జగన్ వైపు నుంచి విషయం క్లియర్ గానే ఉంది.

కాంగ్రెస్ ని ఎట్టిపరిస్థితుల్లోనూ దూరంగానే పెట్టాలి అన్నది ఆయన రాజకీయ ప్రధాన సిద్ధాంతంగా ఉంది. మరి కాంగ్రెస్ వైపు నుంచి ఏ విధంగా ఉంది అన్నదే ఇంకో చర్చ. కాంగ్రెస్ ఫక్తు రాజకీయ పార్టీ. ఎన్నో పార్టీలతో విభేదించింది. తిరిగి పొత్తు కలిపింది. మమతా బెనర్జీ వంటి వారు కాంగ్రెస్ ని ఎంతగానో విభేదించి బయటకు వెళ్ళారు. తిరిగి ఆమె పార్టీతో పొత్తు పెట్టుకుంది కాంగ్రెస్.

అలాగే శరద్ పవార్ పార్టీతోనూ పొత్తు పెట్టుకుంది. హిందూత్వ నినాదంతో బీజేపీ కంటే ఫైర్ బ్రాండ్ గా ఉన్న ఉద్ధవ్ ఠాక్రే శివసేనతోనూ పొత్తు పెట్టుకుంది. ఇలా చూస్తే ఎంతో మందితో కాంగ్రెస్ కలిసింది. తెలంగాణాలో టీడీపీతో కూడా చేతులు కలిపింది. మరి కాంగ్రెస్ కుటుంబానికి చెందిన వైఎస్ జగన్ తో ఎందుకు కలవడం లేదు అన్నది చర్చగా ఉంది.

అయితే కాంగ్రెస్ అధినాయకత్వం వైపు నుంచి ఏ మేరకు ప్రయత్నాలు జరిగాయో తెలియదు కానీ జగన్ వల్లే ఏపీలో కాంగ్రెస్ కి మనుగడ లేదన్న విషయంలో ఆ పార్టీ హైకమాండ్ ఒక నిశ్చయమైన అభిప్రాయంతో ఉంది అని అంటున్నారు. జగన్ తనంతట తాను వచ్చి కాంగ్రెస్ లో తన పార్టీని కలిపి ఒక నాయకుడిగా ఉంటానంటే అభ్యంతరం ఉండదు కానీ ఏపీలో మాత్రం వైసీపీని రాజకీయంగా లేపే ప్రయత్నాలకు మద్దతుగా ఉండకూడదని కాంగ్రెస్ పెద్దల ఆలోచన అని చెబుతారు

అందుకే జగన్ సొంత చెల్లెలు షర్మిలనే ముందు పెట్టి ఏపీలో రాజకీయం నడిపిస్తున్నారు అని అంటున్నారు. నిజానికి కాంగ్రెస్ పెద్దలు ఏ అంచనాలు వేసుకుని ఆమెను ఏపీసీసీ చీఫ్ గా చేశారో తెలియదు కానీ ఆమె వల్ల కాంగ్రెస్ కి పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. అదే సమయంలో టీడీపీ లాభపడింది జగన్ దారుణంగా నష్టపోయారు. అయితే తాము ప్రయోజనం పొందకపోయినా జగన్ కి నష్టం కలిగితే చాలు అన్న ఆలోచనలతోనే కాంగ్రెస్ పెద్దలు షర్మిలను కొనసాగిస్తున్నారా అన్న చర్చ కూడా ఉంది.

ముందు వైసీపీ వీక్ అవాలి. ఆ మీదట తాము బలపడవచ్చు ఇదే కాంగ్రెస్ వ్యూహంగా ఉంది అని అంటున్నారు. అందుకే జగన్ మీద షర్మిలను ప్రయోగిస్తున్నారని ఆమె టీడీపీ కూటమిని పక్కన పెట్టి జగన్ ని విమర్శిస్తున్నా పెద్దల మద్దతు ఉండబట్టే ఇదంతా జరుగుతోంది అని అంటున్నారు సో. ఏపీలో వైసీపీ వీక్ కావాలని కూటమి పార్టీలతో పాటు కాంగ్రెస్ కూడా కాచుకుని కూర్చుంది అన్న మాట. జగన్ మీద కోపంతోనే ఇదంతా చేస్తున్నారా అంటే జవాబు అందరికీ తెలిసిందే మరి