వారిని తిట్టొద్దు సార్.. జగన్ కు ఓ అమూల్య సలహా!
అయితే అధినేత అంతరంగం ఏంటో కానీ, పార్టీ బలోపేతం కోసం వరుస సమావేశాలు నిర్వహిస్తూ, పనిచేయని నేతలకు క్లాసు తీసుకుంటున్నారు.
By: Tupaki Desk | 2 May 2025 8:48 PM ISTమాజీ ముఖ్యమంత్రి జగన్ అధికారంలో ఉండగా, ప్రభుత్వంలో చాలా మంది సలహాదారులు ఉండేవారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా సజ్జల రామక్రిష్ణారెడ్డి వ్యవహరించగా, శాఖల వారిగా చాలా మంది సలహదారులుగా పనిచేసేవారు. వీరి ఎలాంటి సలహాలిచ్చేవారో? ముఖ్యమంత్రి హోదాలో జగన్ వాటిని స్వీకరించేవారో తెలియదు కానీ, విపక్షంలోనూ కొందరు జగన్ కు సలహాదారులుగా వ్యవహరిస్తున్నారు. అయితే వారిచ్చిన సలహాలను అధినేత జగన్ యథావిధిగా పాటిస్తున్నారా? లేదో? మాత్రం అంతుచిక్కడం లేదంటున్నారు.
ఎన్నికల్లో పరాజయం తర్వాత వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని అంటున్నారు. దీంతో చాలా మంది నేతలు పార్టీని వదిలి వెళ్లిపోతున్నారు. ఉన్నవారు బయటకు వెళ్లేందుకు సమయం కోసం ఎదురుచూస్తున్నారని అంటున్నారు. కానీ, అధినేత జగన్ మాత్రం వెళ్లిన వారు వెళ్లినా అన్నట్లే ప్రవర్తిస్తున్నారు. పార్టీలో కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుందామని భావిస్తున్నారు. అయితే ఉన్న నేతలను కూడా కాపాడుకోవాలని జగన్ కు ఓ ముఖ్య సలహాదారు చెప్పారని అంటున్నారు. పార్టీని బతికించుకోవాలంటే లీడర్లు బయటకు వెళ్లకుండా అడ్డుకట్ట వేయాలని ఆ సలహాదారు సూచించారట..
అయితే అధినేత అంతరంగం ఏంటో కానీ, పార్టీ బలోపేతం కోసం వరుస సమావేశాలు నిర్వహిస్తూ, పనిచేయని నేతలకు క్లాసు తీసుకుంటున్నారు. అంతా నేనే చేయాలంటే ఎలా? జిల్లా స్థాయిలో మీరు కూడా కష్టపడాలి కదా? అంటూ జగన్ ప్రశ్నిస్తున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలతోపాటు క్రిష్ణా, గుంటూరు జిల్లాల్లో పార్టీ పరిస్థితి అధ్వానంగా తయారైందని అధినేత ఆందోళన చెందుతున్నారని అంటున్నారు. ఈ క్రమంలో ఆ జిల్లా నేతల తీరుపై ఇటీవల అసహనం వ్యక్తం చేశారట మాజీ సీఎం జగన్.
దీంతో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కీలక నేత ప్రసాదరాజు పనితీరుపై అధినేత జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే పార్టీని వీడేందుకు రెడీ అవుతున్న ప్రసాద్ రాజు, ఈ పరిణామంతో బయటకు వెళ్లేందుకు కారణం దొరికినట్లు చెబుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే సలహాదారు అప్రమత్తమై.. అలా తిట్టొద్దు సార్ అంటూ అధినేతకు చెప్పినట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో నేతలను మందలిస్తే వారు పార్టీ వీడి వెళ్లిపోతారని ఆందోళన వ్యక్తం చేశారంటున్నారు. అయితే అధినేత జగన్ మాత్రం ఎవరి సలహాలు స్వీకరించే రకం కాదని, పనిచేయని నేతల విషయంలో కఠినంగానే వ్యవహరించాని నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.
