Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు స్ట్రాంగ్ వార్నింగ్.. జువ్వలదిన్నెలో జగన్ పర్యటన సక్సెస్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

By:  Tupaki Political Desk   |   15 April 2026 3:45 PM IST
చంద్రబాబుకు స్ట్రాంగ్ వార్నింగ్.. జువ్వలదిన్నెలో జగన్ పర్యటన సక్సెస్
X

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ను సందర్శించిన ఆయన స్థానిక మత్స్యకారులతో భేటీ అయ్యారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును ఎండగడుతూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ‘కళ్లు మూసి తెరిచేలోపే మూడేళ్లు గడిచిపోతాయి.. వచ్చేది మళ్లీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

మత్స్యకారుల పొట్ట కొడుతున్నారని ధ్వజం

జువ్వలదిన్నె హార్బర్ పనులు పూర్తై రెండేళ్లు గడుస్తోందని, హార్బర్ ను జాతికి అంకితం చేసి ఏడాదిన్నర అవుతున్నా.. ఇప్పటికీ మత్స్యకారులకు ఎందుకు అప్పగించలేదని మాజీ సీఎం జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం మత్స్యకారులకు మేలు చేయకపోగా, వారి పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. స్థానిక మత్స్యకారులను ఇక్కడి నుంచి తరిమేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని, దీని వెనుక టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల హస్తం ఉందని మండిపడ్డారు.

మంత్రి లోకేష్ పై విమర్శలు

మార్చి 12న మంత్రి నారా లోకేష్ జువ్వలదిన్నెను సందర్శించిన కొద్ది రోజులకే, సీజ్ చేసిన బోట్లను అక్రమంగా తరలించారని జగన్ గుర్తు చేశారు. ఎంపీ బీదా సోదరులు ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని, బోట్లు ఎత్తుకెళ్లిన వారికి సీఎం కొడుకు ఆశీస్సులు ఉన్నాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులకు అప్పగించిన బోట్లను దౌర్జన్యంగా తీసుకెళ్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు.

చంద్రబాబుకు స్ట్రాంగ్ వార్నింగ్

మత్స్యకారుల హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని జగన్ స్పష్టం చేశారు. "జువ్వలదిన్నెతో సహా పది ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల సొంతం. ఈ హార్బర్లను వారి నుంచి చంద్రబాబు తాత కూడా వేరు చేయలేడు" అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇక్కడ కొనసాగుతున్న ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని, తమ ప్రభుత్వం రాగానే తరలిస్తామని మాజీ సీఎం జగన్ హామీ ఇచ్చారు.