Begin typing your search above and press return to search.

జగన్ పై దాడి.. ఆ పోలీసులపై యాక్షన్ తీసుకోవాలి : రిటైర్డ్ డీజీ ఏబీవీ

మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఎన్నికల సమయంలో రాయితో దాడి చేశారన్న కేసులో వాస్తవం లేదని రిటైర్డ్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు

By:  Tupaki Desk   |   3 Jun 2025 8:25 PM IST
జగన్ పై దాడి.. ఆ పోలీసులపై యాక్షన్ తీసుకోవాలి : రిటైర్డ్ డీజీ ఏబీవీ
X

మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఎన్నికల సమయంలో రాయితో దాడి చేశారన్న కేసులో వాస్తవం లేదని రిటైర్డ్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. గజ మాల దెబ్బను రాజకీయ ప్రయోజనాల కోసం రాయి దాడిగా చిత్రీకరించారని, ఈ కేసులో అమాయక యువకులను బలి పశువులను చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులు నిందితులుగా చెబుతున్న వారిపై పోలీసులు విచక్షణా రహితంగా దాడి చేశారని, కూటమి ప్రభుత్వం స్పందించి ఆ పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మాజీ సీఎం జగన్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఏబీ వెంకటేశ్వరరావు ఎన్నికల సమయంలో విజయవాడలో జరిగిన దాడి ఘటనపై మీడియాతో మాట్లాడారు. అసలు దాడి జరగకుండానే రాజకీయ ప్రయోజనం కోసం ఈ కేసు చిత్రీకరించారని, కూటమి ప్రభుత్వం తక్షణం ఆ కేసును ఎత్తివేయాలని కోరారు. మనుషుల జీవితాలను, శవాలను తొక్కుకుంటూ రాజకీయాలు చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ ఏబీవీ విమర్శించారు. గజ మాల వేసినప్పుడు తగిలిన దెబ్బను అప్పటికప్పుడు రాయి దాడిగా చిత్రీకరించానని ఆయన ఆరోపించారు.

రాయితో దాడి చేశారనే నెపంతో బలహీనుడైన సతీశ్ అనే యువకుడిని బలి చేశారని, అకారణంగా 45 రోజులు జైలులో పెట్టారని ధ్వజమెత్తారు. జగన్ పై దాడి కేసును ఎదుర్కొంటున్న సతీశ్, అతడి కుటుంబ సభ్యులను ఏబీ వెంకటేశ్వరరావు పరామర్శించారు. ‘‘వడ్డెర కులానికి చెందిన యువకుడి జీవితాన్ని, అతడి కుటుంబ భవిష్యత్తును నాశనం చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత కూడా తప్పుడు కేసును కొట్టివేయకుండా నేటికీ తిప్పుతున్నారు. ఇవాళ్టికి కేసులో ఎలాంటి పురోగతి లేదు. బాధితులకు రూ.2 లక్షలు ఇస్తామని మభ్యపెట్టారు. వాళ్లపై ఏ రకమైన థర్డ్ డిగ్రీ ప్రయోగించారో వింటే గుండె తరక్కుపోతోంది. నేటికి చేతితో అన్నం తినలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంత దుర్మార్గం చేసిన పోలీసులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. సమాజానికి ఏం సందేశం ఇవ్వాలి అనుకుంటున్నారు’’ అని ఏబీవీ వ్యాఖ్యానించారు.

బాధితులు చేసిన తప్పేంటి? ఏ మాత్రం సంబంధం లేని సాక్ష్యం లేని కేసులో ఎందుకు బాధపడాలి? అంటూ ప్రశ్నించారు. ఈ కేసులో బాధితులను బలిపశువులు చేసిన అధికారులపై ప్రభుత్వం, డీజీపీ, సీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసును తక్షణమే మూసివేయాలని, బెయిల్ బాండ్స్ రద్దు చేసి కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వాలి. ప్రభుత్వం బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. మాజీ సీఎం జగన్ హయాంలో చోటుచేసుకున్న పలు ఘటనలకు వ్యతిరేకంగా ఏబీవీ పోరాడుతున్నారు. 2019 ఎన్నికల సమయంలో విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ పై దాడి చేసి ఐదేళ్లు జైలులో ఉన్న నిందితుడు శ్రీనివాసరావుకు మద్దతుగా పోరాటం ఆరంభించిన ఏబీవీ ఆ తర్వాత కాకినాడలో డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో పునఃవిచారణకు డిమాండ్ చేశారు. అదేవిధంగా డాక్టర్ సుధాకర్ కేసుతోపాటు బాపట్లలో బాలుడు అమరనాథ్ హత్య కేసు, విజయవాడ గులకరాయి దాడి కేసుపై జగన్ కు వ్యతిరేకంగా పనిచేస్తానని ఏబీవీ చెబుతున్నారు.