Begin typing your search above and press return to search.

ఆ కార్లు భారత్ లోకి ఎప్పటికి రానివ్వను.. తేల్చేసిన కేంద్ర మంత్రి

మానవ ప్రమేయం లేకుండా రోడ్లపై పరుగులు తీసే కార్లు కొంతకాలం కిందటే అభివ్రద్ధి చెందిన పలు దేశాల్లోకి వచ్చినా.. ఈ మధ్యనే అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   17 Dec 2023 6:54 PM GMT
ఆ కార్లు భారత్ లోకి ఎప్పటికి రానివ్వను.. తేల్చేసిన కేంద్ర మంత్రి
X

అత్యాధునిక సాంకేతికతకు కేరాప్ అడ్రస్ గా చెప్పే డ్రైవర్ లెస్ కార్లకు సంబంధించి కేంద్రంలో కీలక మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్న నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్య చేశారు. డ్రైవర్ లెస్ కార్.. రొబోటిక్ కారు.. పేరు ఏదైనా డ్రైవర్ అవసరం లేకుండా నడిచే కారును భారత్ రోడ్ల మీద నడవనివ్వనంటూ ఆయన స్పష్టం చేశారు. మానవ ప్రమేయం లేకుండా రోడ్లపై పరుగులు తీసే కార్లు కొంతకాలం కిందటే అభివ్రద్ధి చెందిన పలు దేశాల్లోకి వచ్చినా.. ఈ మధ్యనే అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.

తాజాగా ఐఎంఎం నాగపూర్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న నితిన్ గడ్కరీ.. దేశంలోని రోడ్ల భద్రత సమస్యల్ని ప్రస్తావిస్తూ.. వాటిని తగ్గించటానికి కేంద్రం తీసుకుంటున్న అనేక చర్యల్ని ప్రస్తావించారు. కార్లలో ఆరు ఎయిర్బ్యాగుల్ని చేర్చటం.. రోడ్లపై ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాల్ని గుర్తించి వాటి నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

అంతేకాదు.. ఎలక్ట్రిక్ మోటర్స్ చట్టాల్ని బలోపేతం చేసినట్లుగా చెప్పారు. ప్రమాదాలకు పాల్పడే వారికి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పిన నితిన్ గడ్కరీ.. డ్రైవర్ లెస్ కార్ల కారణంగా పలువురు డ్రైవర్ సోదరులకు ఉపాధి లేకుండా పోతుందన్న విషయాన్ని పేర్కొన్నారు. డ్రైవర్ల జీవనోపాధిని కోల్పోయే ప్రమాదం ఉన్న కార్లను దేశంలో తిరగనివ్వనని.. తాను ఎప్పటికి వాటిని అనుమతించనని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. టెస్లాకు సైతం చురకలు వేశారు.

చైనాలో కార్లను తయారు చేసి.. భారతదేశంలో అమ్ముతామంటే కుదరదన్న నితిన్ గడ్కరీ.. భవిష్యత్తు ఇంధనంగా హైడ్రోజన్ ప్రాముఖ్యతకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని చెప్పటం గమనార్హం. దీనికి సంబంధించిన అధునాతన సాంకేతికతను స్వీకరించటానికి ప్రభుత్వం ఎప్పుడు ముందు ఉంటుందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.