Begin typing your search above and press return to search.

గురుగ్రామ్ దంపతుల ఐవీఎఫ్ విషాదం.. పుట్టిన కవల పిల్లలు తమ రక్తం కాదని తేల్చిన డీఎన్ఏ.. అసలు సంతానం ఎక్కడ?

తాజాగా గురుగ్రామ్‌కు చెందిన ఒక దంపతుల జీవితంలో చోటుచేసుకున్న ఘోర కలియుగ విచిత్రం.. మానసిక వేదన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

By:  A.N.Kumar   |   16 Jun 2026 1:23 PM IST
గురుగ్రామ్ దంపతుల ఐవీఎఫ్ విషాదం.. పుట్టిన కవల పిల్లలు తమ రక్తం కాదని తేల్చిన డీఎన్ఏ.. అసలు సంతానం ఎక్కడ?
X

సంతానోత్పత్తి కోసం అధునాతన వైద్య విధానాలను ఆశ్రయించే వారికి భరోసా ఇవ్వాల్సిన కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు లాభార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తూ రోగుల జీవితాలతో ఆడుకుంటున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా గురుగ్రామ్‌కు చెందిన ఒక దంపతుల జీవితంలో చోటుచేసుకున్న ఘోర కలియుగ విచిత్రం.. మానసిక వేదన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) ప్రక్రియలో జరిగిన తీవ్రమైన నిర్లక్ష్యం మోసం కారణంగా.. తమకు పుట్టిన కవల పిల్లలు అసలు తమ రక్తానికి సంబంధించిన వారే కారని డీఎన్ఏ పరీక్షల్లో తేలడంతో ఆ దంపతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఈ వ్యవహారంలో ఢిల్లీలోని ఒక ప్రముఖ ఫెర్టిలిటీ ఆస్పత్రిపై కోర్టు ఆదేశాల మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

అసలేం జరిగింది?

ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉన్న ఆ గురుగ్రామ్ దంపతులు.. తమ కుటుంబాన్ని మరింత విస్తరించుకోవాలనే కోరికతో 2024 చివరలో ఢిల్లీలోని ఒక ప్రసిద్ధ ఐవీఎఫ్ కేంద్రాన్ని ఆశ్రయించారు. వైద్యుల చికిత్స అనంతరం 2025 మే నెలలో ఐదు ఆరోగ్యకరమైన ఎంబ్రియోలు (భ్రూణాలు) సిద్ధమైనట్లు ఆస్పత్రి వర్గాలు వారికి సమాచారం అందించాయి. ల్యాబ్ రికార్డుల ప్రకారం.. వాటిలో మూడు ఎంబ్రియోలను మహిళ గర్భాశయంలో విజయవంతంగా ప్రవేశపెట్టారు.

వైద్యుల ప్రక్రియ ఫలించి.. ఈ ఏడాది (2026) జనవరి 5వ తేదీన ఆ మహిళ కవల బాలికలకు జన్మనిచ్చింది. అయితే పిల్లలు పుట్టిన కొద్దిరోజులకే దంపతులలో అనుమానాలు మొదలయ్యాయి. ఆ కవలల రూపురేఖలు, శారీరక లక్షణాలు తల్లిదండ్రులిద్దరితోనూ ఏమాత్రం పోలిక లేకుండా ఉండటమే ఇందుకు కారణం.

డీఎన్ఏ పరీక్షల్లో విస్తుపోయే నిజాలు

తమ అనుమానాన్ని నివృత్తి చేసుకునేందుకు ఆ దంపతులు స్వతంత్రంగా రెండు వేర్వేరు ప్రయోగశాలల ద్వారా డీఎన్ఏ పరీక్షలు చేయించారు. వచ్చిన నివేదికలు చూసి ఆ దంపతులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. జన్మించిన కవల పిల్లలిద్దరికీ, ఆ దంపతులకు ఎలాంటి జీవసంబంధం (రక్తసంబంధం) లేదని తేలింది. విచిత్రం ఏంటంటే.. ఆ పుట్టిన కవలలు కూడా ఒక తల్లితండ్రీ బిడ్లలు కాదు.. ఆ ఇద్దరు కవల పిల్లలకు కూడా పరస్పరం ఎలాంటి జన్యుపరమైన పోలికలు లేవని.. వారు వేర్వేరు దాతలకు చెందిన వారని నివేదికలు వెల్లడించాయి. దీంతో తమ అసలైన సంతానం (ఎంబ్రియోలు) ఏమయ్యాయో తెలియక తమకు అన్యాయం జరిగిందని దంపతులు పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు వెంటనే స్పందించకపోవడంతో వారు న్యాయస్థానం తలుపు తట్టారు.

కోర్టు సీరియస్.. ఆస్పత్రి వాదనలు తిరస్కరణ

బాధిత దంపతుల పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ కోర్టు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించింది. ఐవీఎఫ్ ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగాయని అభిప్రాయపడుతూ ఆస్పత్రి యాజమాన్యంపై తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఫోర్జరీ, నిబంధనల ఉల్లంఘనలతో పాటు ఇది శిశువుల అక్రమ రవాణా లేదా అపహరణ కోణం కూడా కావచ్చునని దంపతుల అసలు సంతానం ఎక్కడ ఉందో తేలాలని కోర్టు వ్యాఖ్యానించింది.

ఆస్పత్రి వాదన ఇదీ..

దంపతుల సొంత అండాలు, వీర్యకణాలతో సరైన ఎంబ్రియోలు ఏర్పడలేదు. అందుకే వారి లిఖితపూర్వక సమ్మతితోనే అనామక దాతల ఎంబ్రియోలను ఉపయోగించాం అని ఆస్పత్రి కోర్టులో వాదించింది. అయితే ఈ వాదనను దంపతులు పూర్తిగా ఖండించారు. సమ్మతి పత్రాలపై ఉన్న సంతకాలు నకిలీవని.. ఆ రికార్డుల్లో చూపిన సమయానికి తాము ఆపరేషన్ థియేటర్ లో అనస్థీషియా స్పృహ లేని ప్రభావంలో ఉన్నామని ఆధారాలతో సహా పేర్కొన్నారు. రికార్డుల్లో స్పష్టమైన తేడాలు ఉండటంతో ఆస్పత్రి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

విచారణ ముమ్మరం.. మానవత్వానికి నిదర్శనం

ప్రస్తుతం కోర్టు ఆదేశాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. దీనితో పాటు దేశంలో సహాయక ప్రజనన సాంకేతికతను పర్యవేక్షించే ఏఆర్టీ , సరోగసీ నియంత్రణ చట్టం పరిధిలోని అధికార యంత్రాంగం కూడా ఈ ఆస్పత్రి లైసెన్స్, రికార్డులపై ప్రత్యేక విచారణ ప్రారంభించింది.

ఇంతటి మోసం, చట్టపరమైన పోరాటం, తీవ్రమైన మానసిక వేదన అనుభవిస్తున్నప్పటికీ.. ఆ దంపతులు మానవత్వాన్ని చాటుకున్నారు. తప్పు చేసింది ఆస్పత్రి యాజమాన్యమే కానీ ఆ పసికందులు కాదని, అందుకే ఆ కవల బాలికలను తాము ఎంతో ప్రేమతో పెంచుకుంటున్నామని వారు ప్రకటించారు. తమకు జరిగిన అన్యాయానికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని, తమ నిజమైన పిల్లల పరిస్థితి ఏంటో తేలాలని వారు డిమాండ్ చేస్తున్నారు.