ఇవాంకా ట్రంప్ హత్యకు ఇరాన్ టెర్రరిస్ట్ కుట్ర? సంచలన నిజాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన ఒక భయానక కుట్ర ఉదంతం ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది.
By: A.N.Kumar | 23 May 2026 11:17 AM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన ఒక భయానక కుట్ర ఉదంతం ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ట్రంప్ పెద్ద కుమార్తె ఇవాంకా ట్రంప్ హత్యకు ఇరాన్‌కు చెందిన ఓ ఉగ్రవాది పక్కా ప్లాన్ వేసినట్లు వెలుగులోకి వచ్చిన వార్తలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. రాజకీయ ప్రతీకారం ఎంతటి ప్రమాదకర స్థాయికి చేరుతుందో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణగా నిలుస్తోంది.
కమాండర్ సులేమానీ హత్యకు ప్రతీకారంగానేనా..?
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ తో సంబంధాలు ఉన్న 32 ఏళ్ల మహమ్మద్ బాఖర్ సాద్ దావూద్ అల్ సాదీ అనే వ్యక్తి ఈ కుట్రకు తెరలేపాడు. 2020లో ఇరాన్ అగ్రశ్రేణి కమాండర్ ఖాసీం సులేమానీ ని అమెరికా దళాలు హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలనే క్రూరమైన ఆలోచనతోనే అతను డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ను టార్గెట్ చేసినట్లు అమెరికా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. రాజకీయ కక్షల కోసం అమాయక కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకోవడంపై అంతటా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
తుర్కియేలో అరెస్ట్.. ఎఫ్‌బీఐ ఆపరేషన్‌తో తప్పిన ముప్పు!
ఈ కుట్రను అమలు చేసేందుకు సదరు ఉగ్రవాది తీవ్రంగానే ప్రయత్నించినట్లు ఆధారాలు లభించాయి. మొదట తుర్కియేలో పట్టుబడిన మహమ్మద్‌ను తదుపరి విచారణ నిమిత్తం అమెరికాకు తరలించారు. అక్కడ అమెరికా గూఢచార సంస్థలు విచారించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.
లభించిన కీలక ఆధారాలు:
ఫ్లోరిడాలో ఇవాంకా ట్రంప్ కుటుంబం నివసిస్తున్న నివాసానికి సంబంధించిన పూర్తి బ్లూప్రింట్లు బయటపడింది.. ఆమె ఇంటి భద్రతా వలయానికి సంబంధించిన రహస్య ఫోటోలు బయటపడ్డాయి. సదరు నిందితుడు సోషల్ మీడియా వేదికగా కూడా ఇవాంకా ఇంటి ఫోటోలను షేర్ చేస్తూ రెసిడెన్స్ ఏరియాపై నిఘా పెట్టినట్లు నిర్ధారణ అయింది. ఈ కుట్ర కార్యరూపం దాల్చి ప్రమాదకర స్థాయికి చేరుకునేలోపే అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ అత్యంత చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని అదుపులోకి తీసుకుంది. దీంతో ఒక పెద్ద అంతర్జాతీయ విపత్తు తృటిలో తప్పినట్లయింది.
అంతర్జాతీయ విశ్లేషకుల హెచ్చరిక
ఈ ఘటన కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన భద్రతా లోపం మాత్రమే కాదు.. ప్రపంచ దేశాలకు ఒక గంభీరమైన హెచ్చరిక అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఉగ్రవాదం, ద్వేషపూరిత రాజకీయాలు ఏ క్షణంలోనైనా ఎవరి జీవితాలనైనా చీకట్లోకి నెట్టేయగలవని ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది.
దేశాల మధ్య సిద్ధాంతపరమైన విభేదాలు.. రాజకీయ ప్రతీకారాలు ఎన్ని ఉన్నప్పటికీ.. అమాయకులు, వారి కుటుంబాల ప్రాణాలను పణంగా పెట్టడం అమానుషమని ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. భయాన్ని ఆయుధంగా మార్చుకునే శక్తులు పెరుగుతున్న వేళ ప్రజాస్వామ్య దేశాలు, అంతర్జాతీయ భద్రతా వ్యవస్థలు మరింత సమన్వయంతో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
చివరకు ద్వేషం కంటే మానవత్వమే గొప్పదని.. ప్రతీకారం కంటే శాంతి మార్గమే ఎంతో శక్తివంతమైనదని ఈ ఘటన ప్రపంచానికి మరోసారి చాటిచెప్పింది.
