ఖైదీలకు గుడ్ న్యూస్.. తమ భాగస్వాములతో ప్రైవేట్‌గా గడిపేందుకు స్పెషల్ రూమ్స్
ప్రేమకు హద్దుల్లేవు.. జైలు గోడలు కూడా ప్రేమకు అడ్డురాదు.. ఈ మాటలకు సరిగ్గా సరిపోయే విధంగా ఇటలీలో ఖైదీల కోసం సరికొత్త శకం మొదలైంది.
By: Tupaki Desk | 19 April 2025 2:00 PM ISTప్రేమకు హద్దుల్లేవు.. జైలు గోడలు కూడా ప్రేమకు అడ్డురాదు.. ఈ మాటలకు సరిగ్గా సరిపోయే విధంగా ఇటలీలో ఖైదీల కోసం సరికొత్త శకం మొదలైంది. ఇకపై తమ జీవిత భాగస్వాములతో గోప్యంగా కలుసుకునే అవకాశం వారికి లభించనుంది. ఈ మార్పు ఇటలీతో పాటు ప్రపంచంలోని పలు దేశాల జైళ్లలో సరికొత్త చర్చకు దారి తీసింది. ఇంతకీ ఏం జరిగిందంటే..ఇటలీలోని జైలు అధికారులు ఖైదీల కోసం ప్రత్యేకంగా ఏకాంత గదులను సిద్ధం చేశారు. అవును చదువుతున్నది నిజమే. తమ భార్యలు లేదా ప్రియురాళ్లతో ఏకాంతంగా సమయం గడిపేందుకు వీలుగా అక్కడి జైలు అధికారులు స్పెషల్ రూమ్స్‌ను ఏర్పాటు చేశారు. ఖైదీలకు తమ భాగస్వాములతో వ్యక్తిగతంగా కలుసుకునే హక్కు ఉందని గతేడాది అక్కడి ఉన్నత న్యాయ స్థానం తీర్పు ఇవ్వడంతో ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
మధ్య ఇటలీలోని ఉంబ్రియా ప్రాంతంలో ఉన్న ఒక జైలులో సరికొత్త సదుపాయం ఈ శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ విషయం తెలిసిన ఖైదీల హక్కుల కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ గదులను ఉపయోగించే ఖైదీల వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి భంగం కలగకుండా చూడాలని వారు కోరుతున్నారు. ఖైదీలకు తమ జీవిత భాగస్వాములు లేదా ఎక్కువ కాలం సహజీవనం చేస్తున్న వారిని ఎలాంటి ఆటంకాలు లేకుండా ములాఖత్ సమయంలో కలుసుకునే హక్కు ఉందని, ఆ సమయంలో జైలు సిబ్బంది కూడా అక్కడికి రాకూడదని ఇటలీ రాజ్యంగ న్యాయస్థానం గతేడాది తీర్పు ఇచ్చింది. ఈ తీర్పునకు అనుగుణంగానే జైలు అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. నిజానికి ఇలాంటి సౌకర్యం యూరప్‌లోని అనేక దేశాల్లో ఎప్పటి నుంచో ఉంది. ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, నెదర్లాండ్స్, స్వీడన్‌లోని కొన్ని జైళ్లలో ఖైదీల కోసం ప్రత్యేకంగా ఏకాంత గదులు అందుబాటులో ఉన్నాయి.
యూరప్ లోనే అత్యధిక ఖైదీలు ఉన్న దేశాలలో ఇటలీ కూడా ఒకటి. అధికారిక లెక్కల ప్రకారం ఇక్కడ 62వేల మందికి పైగా ఖైదీలు వివిధ నేరాలకు గాను శిక్షలను అనుభవిస్తున్నారు. జైళ్ల సామర్థ్యం కంటే ఈ సంఖ్య దాదాపు 21 శాతం ఎక్కువ. అంతేకాదు, గత కొంతకాలంగా ఇటలీ జైళ్లలో ఖైదీల ఆత్మహత్యలు కూడా భారీగా పెరుగుతున్నాయి. మానసిక ఒత్తిడితో చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు అధికారులు ఇది వరకే అనేక చర్యలు తీసుకున్నారు. ఖైదీలు తమ కుటుంబ సభ్యులతో ఎక్కువసార్లు ఫోన్‌లో మాట్లాడేందుకు కూడా జైలు అధికారులు అవకాశం కల్పించారు. ఇప్పుడు తాజాగా తమ భాగస్వాములతో ఏకాంతంగా కలుసుకునేందుకు అనుమతిస్తున్నారు. ఈ నిర్ణయం ఖైదీల మానసిక స్థితిని మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.
