ఐటీ ఫ్రెషర్స్ కంటే ప్లంబర్సే ఎక్కువ సంపాదిస్తున్నారట..!
ఐటీ ఉద్యోగులు ఈ పరిస్థితిని ఇలా వివరిస్తున్నారు. అమిత్ కుమార్ అనే ఐటీ ఎంప్లాయీ మాట్లాడుతూ.. "డిగ్రీ ఉన్నదంత మాత్రాన ఉద్యోగం రావడం లేదు. స్కిల్స్ లేనిదే కంపెనీలు ఆహ్వానించడం లేదు.
By: Tupaki Desk | 25 July 2025 10:00 PM ISTఒకప్పుడు ఇంజినీరింగ్ చదివి.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పొందితే "లైఫ్ సెటిల్ అయిపోతుంది" అనే మాట చాలా నమ్మకంగా వినిపించేది. అయితే ఈ రోజుల్లో ఆ నమ్మకం సన్నగిల్లుతోంది. దీనికి కారణం మారుతున్న మార్కెట్ పరిస్థితులు. సాంకేతిక రంగంలో పెరుగుతున్న పోటీ, విపరీతమైన శిక్షణ అవసరం, ప్యాకేజీల తగ్గుదల వంటివి ఒకవైపు ఉంటే.. మరోవైపు నైపుణ్యం ఆధారిత వృత్తుల్లో ఆదాయం గణనీయంగా పెరిగింది. ఇప్పుడు చాలామంది ఐటీ ఫ్రెషర్స్ కంటే ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, మెషిన్ టెక్నీషియన్లు మంచి ఆదాయం సంపాదిస్తున్నారు.
ఎందుకు ఇలా జరిగింది?
ఈ మార్పునకు కొన్ని ప్రధాన కారణాలున్నాయి.. ప్రతి సంవత్సరం లక్షల మంది ఇంజినీర్లు గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్నారు. అయితే వీరందరికీ తగినన్ని ఉద్యోగాలు లభించడం లేదు. దీని ఫలితంగా కంపెనీలు తక్కువ జీతాలకే అసంఖ్యాకమైన రెజ్యూమ్‌లను పొందుతున్నాయి. ఫ్రెషర్లకు బేసిక్ పే సంవత్సరానికి ₹3-4 లక్షల మధ్య నుండి ఎక్కువగా ఎదగడానికి సంవత్సరాలు పడుతోంది. ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వర్క్, కార్పెంట్రీ వంటి నైపుణ్యం అవసరమయ్యే వృత్తులకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ రంగాల్లో నిపుణులు కొంతకాలంలోనే నెలకు ₹50,000 నుంచి ₹1,00,000 వరకు సంపాదిస్తున్నారు. ముఖ్యంగా మెట్రో నగరాల్లో వీరి సేవలకు దక్కే డిమాండ్ అధికం. ఐటీ రంగంలో కూడా ఇప్పుడు కోడింగ్, డేటా సైన్స్, డెవ్‌ఒప్స్ వంటి ప్రత్యేక నైపుణ్యాలే డిమాండ్‌లో ఉన్నాయి. కేవలం సాధారణ డిగ్రీ సరిపోవడం లేదు. అదే సమయంలో, నైపుణ్యం అవసరమయ్యే కార్మిక వృత్తుల్లో కూడా ప్రాక్టికల్ నైపుణ్యాలే మంచి ఆదాయానికి మార్గం చూపుతున్నాయి. ఇంజినీరింగ్ కాకుండా ఇతర సాంకేతిక వృత్తుల అవసరం పెరిగింది. గృహ నిర్మాణం, లోహకర్మ, రిపేరింగ్ వంటి సేవలు ఇప్పటికే డిజిటల్ యాప్‌లు అర్బన్ క్లాప్, హౌస్ జాయ్ ద్వారా అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా ప్లంబర్లకు, ఇతర స్కిల్‌డ్ వర్కర్లకు పెద్ద సంఖ్యలో క్లయింట్లు లభిస్తున్నారు.
ఐటీ ప్రొఫెషనల్స్ మాటల్లో...
ఐటీ ఉద్యోగులు ఈ పరిస్థితిని ఇలా వివరిస్తున్నారు. అమిత్ కుమార్ అనే ఐటీ ఎంప్లాయీ మాట్లాడుతూ.. "డిగ్రీ ఉన్నదంత మాత్రాన ఉద్యోగం రావడం లేదు. స్కిల్స్ లేనిదే కంపెనీలు ఆహ్వానించడం లేదు. అలాగే ₹25,000 జీతానికి రోజూ 9 గంటల పని. ఫ్రీలాన్స్ ప్లంబర్స్ మమ్మల్ని మించి సంపాదిస్తున్నారు." అని తెలిపారు. ‘ఫ్రెషర్లకు మారిన ప్రపంచానికి తగ్గట్టు స్కిల్స్ కావాలి. వాళ్ళు అప్‌గ్రేడ్ అవ్వాలి. లేదంటే ప్లంబర్, డ్రైవర్ జీతాలు మించిపోవడం సహజం." సునీత రెడ్డి అనే హెచ్ఆర్ మేనేజర్ తెలిపారు.
-ఇదే సరైన మార్గమా?
సాఫ్ట్‌వేర్ రంగం పూర్తిగా తప్పని చెప్పలేం. కానీ ఇప్పుడు సాధారణ డిగ్రీతో ఉద్యోగం పొందడం కష్టం. పైగా వేతనాలు తక్కువగా ఉండటం వలన మానసిక ఒత్తిడి పెరుగుతోంది. ఐటీ రంగంలో కొనసాగాలంటే, కొత్త టెక్నాలజీలు ఏఐ, ఎంఎల్, క్లౌడ్, డెవోప్స్ వంటి వాటిలో నైపుణ్యం సాధించడం అత్యవసరం.
"పేరు గొప్పది కంటే పనిలో నైపుణ్యం గొప్పది" అన్న నానుడి ఇప్పుడు నిజమవుతోంది. ఎవరైనా తమ పనిని ప్రతిష్టాత్మకంగా చూసుకుంటే, ఎంత చిన్న వృత్తమైనా మంచి ఆదాయాన్ని అందిస్తుంది. ఫ్రెష్ గ్రాడ్యుయేట్లు ఈ నిజాన్ని గుర్తించి, తమ స్కిల్స్‌ను అప్‌డేట్ చేసుకోవడమే మార్గం. లేదంటే... ప్లంబర్ మనల్ని మించిపోతాడు.. అది కేవలం ఉదాహరణ కాదు, నిష్ఠుర సత్యం.
