నెలకు రూ.15 లక్షల జీతం.. అయినా నాన్నకు నిద్ర లేదు.. ఎందుకో తెలుసా?
ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజాలు సైతం లక్షల సంఖ్యలో ఉద్యోగులను లేఆఫ్స్ పేరుతో ఇంటికి పంపించాయి.
By: A.N.Kumar | 14 Jun 2026 6:00 AM ISTఒకప్పుడు సమాజంలో "మా అబ్బాయి కలెక్టర్" అని చెప్పుకుంటే తండ్రులు మీసాలు మెలేసేవారు. కాలం మారింది.. ఐటీ రంగం ఊపందుకుంది. ఇప్పుడు "నా కొడుకు విదేశీ కంపెనీలో నెలకు 15 లక్షలు సంపాదిస్తున్నాడు" అని గర్వంగా చెప్పుకునే రోజులు వచ్చాయి. అయితే ఇంత భారీ జీతం వస్తున్నా కొందరు తల్లిదండ్రులు మాత్రం గుండెలపై చెయ్యేసుకుని నిట్టూర్పులు విడుస్తున్నారు. వారంలో ఐదు రోజులే పని.. శని-ఆదివారాలు సెలవులు, విదేశీ టూర్లు, ఫైవ్ స్టార్ మీటింగ్‌లు, చేతినిండా డబ్బు.. ఇవన్నీ ఉన్నా ఆ తండ్రి కళ్లల్లో ఆనందం లేదు. కారణం.. ప్రైవేట్ రంగాన్ని పట్టి పీడిస్తున్న "లేఆఫ్" అనే భూతం!
ఉద్యోగమా? టైమ్ బాంబా?
ప్రస్తుతం ప్రైవేట్, ముఖ్యంగా ఐటీ రంగంలో ఉద్యోగం అంటే ఉదయం ఆఫీస్‌కి వెళ్లేటప్పుడు ఉన్నది.. సాయంత్రానికి ఉంటుందో లేదో చెప్పలేని పరిస్థితి నెలకొంది. "మీ సేవలు ఇక మాకు అవసరం లేదు" అనే ఒక్క చిన్న ఈమెయిల్‌తో లక్షల రూపాయల జీతం, లగ్జరీ లైఫ్ ఒక్కసారిగా గాల్లో కలిసిపోతున్నాయి. నిన్నటి వరకు బెంజ్, ఆడి కార్లలో తిరిగిన ఉద్యోగి.. మరుసటి రోజు ఉదయం జాబ్ పోర్టల్స్‌లో రిజ్యూమ్ అప్‌డేట్ చేస్తూ కనిపిస్తున్నాడు. హోమ్ లోన్లు, కార్ ఈఎంఐలు, పిల్లల స్కూల్ ఫీజులు ఒక్కసారిగా భయంకరమైన కలల్లా వెంటాడుతున్నాయి. ఈ అనిశ్చితే తల్లిదండ్రుల నిద్రను దూరం చేస్తోంది.
ప్రభుత్వ ఉద్యోగమే 'పరమపదం' అనుకుంటున్నారా?
ఐటీ ఉద్యోగాల్లోని ఈ టెన్షన్లను చూస్తున్న పాతతరం తల్లిదండ్రులు ఒకటే కోరుకుంటున్నారు.. "బాబు.. ఆ 15 లక్షల ప్రైవేట్ ఉద్యోగం వద్దు, హాయిగా గ్రూప్స్ రాసి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకో" అని సలహాలు ఇస్తున్నారు. వారి దృష్టిలో ప్రభుత్వ ఉద్యోగం అంటే కేవలం జీతం మాత్రమే కాదు.. జీవితానికి ఒక బలమైన భద్రత. కంపెనీ నష్టాల్లో ఉన్నా ఆర్థిక మాంద్యం వచ్చినా ప్రభుత్వ ఉద్యోగిని ఎవరూ తొలగించలేరు. నెల మొదలైతే చాలు జీతం ఖాతాలో పడుతుంది. రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ కొన్ని ఉద్యోగాలకు , మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పటికీ మన సమాజంలో ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో "సాఫ్ట్‌వేర్ ఇంజనీర్" అనే హోదా కంటే "ప్రభుత్వ ఉద్యోగి" అనే మాటకు ఉండే బరువే వేరు. బంధువుల ముందు, సమాజంలో తలెత్తుకుని చెప్పుకునే గౌరవం దీనివల్ల లభిస్తుందని నమ్ముతారు.
ఏఐ భయాలు.. తల్లిదండ్రుల కొత్త లెక్కలు
ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజాలు సైతం లక్షల సంఖ్యలో ఉద్యోగులను లేఆఫ్స్ పేరుతో ఇంటికి పంపించాయి. దీనికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాక, కంపెనీల ఖర్చులు తగ్గించుకునే వ్యూహాలు ఐటీ రంగాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టాయి.
"నెలకు 15 లక్షలు సంపాదించడం గొప్పే కావొచ్చు.. కానీ ఆ ఉద్యోగం కనీసం 15 ఏళ్లయినా ఉంటుందా?" అనేది నేటి తల్లిదండ్రుల సూటి ప్రశ్న. కొడుకు కేవలం ప్రస్తుత "ప్యాకేజీ" గురించి ఆలోచిస్తుంటే తండ్రి మాత్రం భవిష్యత్తు "పర్మనెన్సీ" గురించి ఆరాటపడుతున్నాడు.
ప్యాకేజీయా? పర్మనెన్సీయా?
దీంతో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఒక కొత్త చర్చ మొదలైంది. "భారీ టెన్షన్ల మధ్య నెలకు రూ.15 లక్షలు ఇచ్చే ప్రైవేట్ ఉద్యోగం మేలా? లేక ప్రశాంతతతో పాటు లైఫ్ సెటిల్‌మెంట్ ఇచ్చే నెలకు రూ.1 లక్ష ప్రభుత్వ ఉద్యోగం మేలా?" అని నెటిజన్లు ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. నేటి యువత ఆర్థిక ఎదుగుదలకు, లగ్జరీ లైఫ్‌కు ప్రాధాన్యం ఇస్తుంటే తల్లిదండ్రులు మాత్రం భద్రతకే మొదటి ఓటు వేస్తున్నారు. ఈ రెండింటిలో ఏది బెటర్ అనే ప్రశ్నకు సమాధానం దొరికేలోపే.. మరో ఐటీ కంపెనీ లేఆఫ్స్ ప్రకటించేలా మార్కెట్ పరిస్థితులు కనిపిస్తున్నాయి..
