Begin typing your search above and press return to search.

మహేశ్‌ బావ వైరాగ్యానికి కారణం ఇదేనా?

2014తోపాటు వైసీపీ ప్రభంజనం వీచిన 2019లోనూ గుంటూరు లోక్‌ సభా నియోజకవర్గంలో టీడీపీనే ఘన విజయం సాధించింది.

By:  Tupaki Desk   |   8 Jan 2024 6:22 AM GMT
మహేశ్‌ బావ వైరాగ్యానికి కారణం ఇదేనా?
X

టీడీపీకి పట్టున్న లోక్‌ సభా నియోజకవర్గాల్లో గుంటూరు ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో కమ్మ సామాజికవర్గం సామాజికంగా, ఆర్థికంగా బలంగా ఉండటమే ఇందుకు కారణం. 2014తోపాటు వైసీపీ ప్రభంజనం వీచిన 2019లోనూ గుంటూరు లోక్‌ సభా నియోజకవర్గంలో టీడీపీనే ఘన విజయం సాధించింది.

ప్రస్తుతం గుంటూరు ఎంపీగా టీడీపీ తరఫున ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రముఖ సినీ నటుడు మహేశ్‌ బాబు బావ గల్లా జయదేవ్‌ ఉన్నారు. గత రెండు పర్యాయాలు ఆయనే ఎంపీగా గెలుపొందారు. అయితే ఈసారి ఆయన తన సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నుంచి అసెంబ్లీకి పోటీ చేసే యోచనలో ఉన్నారని టాక్‌ నడుస్తోంది. లేదా పూర్తిగా రాజకీయాల నుంచి విరమించుకుని వ్యాపారానికే పరిమితమవుతారని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ప్రముఖ పారిశ్రామికవేత్త, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పేరు వినిపిస్తోంది. సుజనా గతంలో టీడీపీ తరఫున రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. సుజనా కూడా కమ్మ సామాజికవర్గానికి చెందినవారే. 2019లో టీడీపీ ఎన్నికల్లో ఓడిపోయాక సుజనా చౌదరి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన బీజేపీలోనే ఉన్నా టీడీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు, పాత పరిచయాలను కొనసాగిస్తున్నారు.

ఈ నేపథ్యంలో గుంటూరు నుంచి లోక్‌ సభకు పోటీ చేయాలని అనుకుంటున్నారని టాక్‌ నడుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ఆయన మళ్లీ టీడీపీ తీర్థం పుచ్చుకోవచ్చని చెబుతున్నారు. లేదా టీడీపీ, జనసేనలతో బీజేపీ పొత్తు కుదిరితే బీజేపీ తరపున గుంటూరు నుంచి బరిలో ఉంటారని పేర్కొంటున్నారు. గుంటూరు జిల్లా టీడీపీ నేతలతో సుజనా చౌదరికి మంచి సత్సంబంధాలు ఉండటంతో గుంటూరు నుంచి పోటీకి వారు కూడా అభ్యంతరం చెప్పబోరని ఆయన భావిస్తున్నట్టు సమాచారం.

ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయని సుజనా ఈసారి బరిలోకి దిగి ఆ ముచ్చట కూడా తీర్చుకోవాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల గుంటూరు వచ్చిన సుజనా టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజా నివాసంలో పలువురు నేతలతో భేటీ అయ్యారు. మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గం కావడంతో ఇక్కడ నుంచి అయితే సులువుగా గెలుస్తాననే భావనలో సుజనా ఉన్నట్టు తెలుస్తోంది.