Begin typing your search above and press return to search.

ప్రయోగానికి 8 సెకన్ల ముందు ఆపేసినా.. సూపర్ సక్సెస్

అంతరిక్ష ప్రయోగాల్లో వరుస పెట్టి సక్సెస్ లను సొంతం చేసుకుంటున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (పొట్టిగా పిలవాలంటే ఇస్రో) మరో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

By:  Tupaki Desk   |   22 Oct 2023 5:55 AM GMT
ప్రయోగానికి 8 సెకన్ల ముందు ఆపేసినా.. సూపర్ సక్సెస్
X

అంతరిక్ష ప్రయోగాల్లో వరుస పెట్టి సక్సెస్ లను సొంతం చేసుకుంటున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (పొట్టిగా పిలవాలంటే ఇస్రో) మరో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అంతరిక్షంలోకి సొంతంగా వ్యోమోగాముల్నిపంపేందుకు సిద్ధమవుతున్న ఈ సంస్థ అందులో భాగంగా.. తన సామర్థ్యాన్ని టెస్టు చేసుకుంది. ఇందులో సక్సెస్ అయ్యింది. మిషన్ గగన్ యాన్ లో భాగంగా నిర్వహించిన తొలి పరీక్ష విజయవంతమైంది.

గగన్ యాన్ ప్రాజెక్టులో కీలకమైన ‘‘టెస్టు వెహికల్ అబార్డ్ మిషన్ (టీవీ-డీ1)’’ సక్సెస్ అయ్యింది. ఈ ప్రయోగానికి సరిగ్గా 8 సెకన్ల ముందు సాంకేతిక లోపాన్ని గుర్తించి ప్రయోగాన్ని కాసేపు నిలిపేశారు. అనంతరం లోపాన్ని సరిదిద్ది.. నిర్ణీత షెడ్యూల్ కు కాస్త ఆలస్యంగా మొదలు పెట్టారు. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ ఈ ప్రయోగానికి వేదికైంది.

తొలుత అనుకున్న సమయానికి కాస్త ఆలస్యంగా సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ నుంచి విడిపోయిన క్రూ మాడ్యూల్ పారాచూట్ల సాయంతో సురక్షితంగా నిర్దేశించిన సముద్ర ఉపరితలం మీద దిగటంతో గగన్ యాన్ టెస్ట్ లాంచ్ ప్రయోగం విజయవంతమైంది. రాకెట్ ను ప్రయోగించిన కాసేపటికి.. ప్రయోగంలో భాగంగా ‘అబార్డ్’ సంకేతాన్ని పంపారు. దీంతో.. రాకెట్ ముందు భాగంలో ఉన్న క్రూ ఎస్కేప్ వ్యవస్థకు సంబంధించిన ఘన ఇంధన మోటర్లు రగిలాయి. దాదాపు 12 కిలోమీటర్ల ఎత్తులో క్రూ ఎస్కేప్ వ్యవస్థను రాకెట్ వేరు చేశాయి. ఆపై 17 కిలోమీటర్ల ఎత్తులో క్రూ ఎస్కేప్ మాడ్యూల్.. క్రూ మాడ్యూల్ పరస్పరం విడిపోయి.. డ్రోగ్ పారాచూట్లు విప్పుకున్నాయి.

సెకన్ కు 8.5 మీటర్ల వేగంతో క్రూ మాడ్యూల్ షార్ తూర్పున 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న బంగాళాఖాతంలో సురక్షితంగా దిగింది. మిషన్ గగన్ యాన్ లో అత్యంత కీలకమైన.. వ్యోమగాముల భద్రతకు సంబంధించిన ఈ కీలక ప్రయోగం విజయవంతం కావటంపై ఇస్రో శాస్త్రవేత్తలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రయోగం మొదలైన ఎనిమిదిన్న నిమిషంలో తాము అనుకున్నది అనుకున్నట్లుగా చేయగలగటంతో ఇస్రో శాస్త్రవేత్తలు మిషన్ గగన్ యాన్ లో మరో ముందడుగు వేశారని చెప్పాలి.

అంతేకాదు.. సముద్రంలో పడిన టవీ డీ 1క్రూ మాడ్యూల్ ను విజయవంతంగా వెలికి తీయటమేకాదు.. దాన్ని బయటకు తీసుకొచ్చినట్లుగా ఇస్రో వెల్లడించింది. మొత్తంగా చూస్తే.. గగన్ యాన్ మిషన్ కు సంబంధించి మొత్తం ఇరవై సన్నాహాక ప్రయోగాల్ని నిర్వహించాల్సి ఉంటుంది. ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు. నిజానికి ఈ ప్రయోగాన్ని శనివారం ఉదయం 8 గంటలకు నిర్వహించాల్సి ఉన్నా.. ప్రయోగానికి ఎనిమిది సెకన్ల ముందు సాంకేతిక లోపాన్ని గుర్తించి.. ప్రయోగాన్ని నిలిపివేశారు. అనంతరం ఆ సమస్యను పరిష్కరించి.. రెండు గంటల ఆలస్యంగా తాము అనుకన్నది అనుకున్నట్లు సక్సెస్ అయ్యారు.