ఇస్రో 101వ రాకెట్ ప్రయోగం.. దీనివల్ల ప్రయోజనాలేమిటో తెలుసా?
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇటీవల పలు సంచలనాలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 18 May 2025 8:19 AMభారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇటీవల పలు సంచలనాలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా 101వ రాకెట్ ను ప్రయోగించింది. ఇందులో భాగంగా.. పీ.ఎస్.ఎల్.వీ - సీ 61 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. దీనితో.. ఈఓఎస్-09 (రీశాట్-1బి) ఉపగ్రహాన్ని పీ.ఎస్.ఎల్.వీ. నింగిలోకి తీసుకెళ్లింది. ఈ సమయంలో సాంకేతిక లోపం ఏర్పడింది.
అవును... ఇస్రో చేపట్టిన 101వ రాకెట్ ప్రయోగం పీ.ఎస్.ఎల్.వీ - సీ 61 ప్రయోగంలో సాంకేతిక సమస్య ఎదురైంది. భూ పరిశీలనకు చెందిన ఈఓఎస్ - 09 ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లిన కాసేపటి తర్వాత పీ.ఎస్.ఎల్.వీ - సీ 61 ప్రోగ్రాంలో సాంకేతిక సమస్య ఎదురైంది. దీంతో.. ఈ ప్రయోగం పూర్తి కాలేదు. దీనిపై ఇస్రో చైర్మన్ స్పందించారు.
ఈ సందర్భంగా స్పందించిన ఇస్రో ఛైర్మన్ నారాయణన్.. ప్రయోగంలో మూడో దశ తర్వాత రాకెట్ లో సమస్య వచ్చిందని.. విశ్లేషణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. కాగా... ఈ ఈఓఎస్ - 09 ఉపగ్రహం బరువు 1,696.24 కిలోలు కాగా.. దీని జీవితకాలం ఐదేళ్లు.
దీనివల్ల కలిగే ప్రయోజనాలు!:
ఈ ఉపగ్రహం అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ భూ ఉపరితల చిత్రాలను అధిక రిజల్యూషన్ తో తీయనుంది. ఈ క్రమంలో... నేషనల్ సెక్యూరిటీ, అటవీ పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ, పట్టణ ప్రణాళికతో పాటు వ్యవసాయానికి సంబంధించిన అంశాలను ఇమేజింగ్ చేస్తుంది. 2022లో ప్రయోగించిన ఈఓఎస్-04 ఉపగ్రహానికి ప్రత్యామ్నాయంగా ఈఓఎస్-09ను పంపారు.