Begin typing your search above and press return to search.

రేవంత్ కు మూణ్ణెళ్ల గండమా? ఆర్నెల్ల గండమా?

అప్పుల కుప్పలా మారిన ఆర్థిక పరిస్థితుల్ని చక్కదిద్దే విషయంలో రేవంత్ తన మార్కును ప్రదర్శించలేకపోతున్నట్లుగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   2 Jan 2024 5:31 AM GMT
రేవంత్ కు మూణ్ణెళ్ల గండమా? ఆర్నెల్ల గండమా?
X

రాజకీయ వర్గాల్లోనూ.. మీడియా సర్కిల్స్ లోనూ.. అధికార వర్గాల్లోనూ.. రియల్ ఎస్టేట్ వ్యాపారుల మాటల్లో తరచూ వినిపిస్తున్న అంశం.. రేవంత్ సర్కారు గండాన్ని ఎదుర్కొంటున్నారని. సాధారణ మెజార్టీకి కేవలం నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఆయన పరిమితులతో పని చేయాల్సి వస్తోందన్న వాదన వినిపిస్తోంది. సొంతంగా నిర్ణయాలు తీసుకోవట్లేదని.. భట్టి.. ఉత్తమ్.. కోమటిరెడ్డి.. పొంగులేటిలను కలుపుకుపోతూ బండి నడిపిస్తున్నట్లు చెబుతున్నారు. అప్పుల కుప్పలా మారిన ఆర్థిక పరిస్థితుల్ని చక్కదిద్దే విషయంలో రేవంత్ తన మార్కును ప్రదర్శించలేకపోతున్నట్లుగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంత? నిజంగానే.. సీఎం రేవంత్ పదవీ గండాన్ని ఎదుర్కొంటున్నారా? ఆయన ప్రభుత్వానికి ఎక్సపైరీ డేట్ మూణ్నెళ్లా? ఆర్నెల్లా? అన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇంతకూ ఈ వాదన ఎందుకు తరచూ వినిపిస్తోంది? అంటే.. ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన గంటల వ్యవధిలోనే ఫాంహౌస్ లో తన ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. ఇతర ప్రజాప్రతినిధులు..నేతలతో భేటీ అయిన గులాబీ బాస్ కేసీఆర్.. రేవంత్ ప్రభుత్వం మూణ్నెళ్లు కూడా ఉండదన్న మాటల అంచనాతోనే. మూణ్ణెళ్లు మౌనంగా ఉండాలని.. ఆర్నెల్లలో జరగాల్సింది జరుగుతుందన్న వ్యాఖ్యలు రేవంత్ సర్కారుకు తొలి గండంగా మారాయని అంటున్నారు. దీనికి కారణం.. కేసీఆర్ ఏదీ తొందరపాటుతో అనరని.. ఆయన నోటి నుంచి వచ్చిన మాటలకు ఇచ్చిన అధిక ప్రాధాన్యతను పరిగణలోకి తీసుకొని రేవంత్ సర్కారును తక్కువగా అంచనా వేయటం మొదలైందని చెప్పాలి.

ఇక.. పొలిటికల్ సర్కిల్స్.. మీడియా వర్గాల్లోనూ కొత్త విశ్లేషణ మొదలైంది. తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఓపక్క.. వంద రోజుల హామీల అమలుతో రేవంత్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి అవుతుందని చెబుతున్నారు. ఈ మాటల్ని చెబుతున్న వారు.. గతంలో తియ్యటి మాటలు చెప్పి.. ఏళ్లకు ఏళ్లు హామీల అమలు చేయని రోజుల్లో ఏం చేశారు? అన్నది ప్రశ్న. వంద రోజుల్లో హామీలు అమలు మాట చెప్పినప్పటికీ.. గత ప్రభుత్వం తాలుకూ ఆర్థిక గాయాల్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోదా? అన్నది ప్రశ్న.

మహాలక్ష్మి స్కీంలో భాగంగా జరిగిన సోషల్ మీడియా ప్రచారాన్ని చూసినప్పుడు.. ఉచితాలు అక్కర్లేదని.. ప్రభుత్వ పథకాల అవసరం కంటే కూడా డెవలప్ మెంట్ మీదా.. ఉపాధి మీద ఫోకస్ చేయాలని చెప్పిన మాటల్నే పరిగణలోకి తీసుకుంటే.. వంద రోజుల్లో హామీ అమలు కాస్త ఆలస్యమైనా అర్థం చేసుకోరా? అన్నది ప్రశ్న. దీనికి తోడు వంద రోజుల హామీ అమలుకు సార్వత్రిక ఎన్నికల కోడ్ కూడా అడ్డంకిగా మారుతుంది కాబట్టి.. వాటిపై అతిగా ఆలోచించటంలో అర్థం లేదంటున్నారు. ఇక.. సార్వత్రిక ఎన్నికల ఫలితాల ప్రభావం కూడా రేవంత్ సర్కారు మీద ఉంటుందని చెబుతున్నారు.

ఇక్కడ కూడా ఒక విషయాన్ని ప్రస్తావించాలి. 2018లో ఆశ్చర్యకర రీతిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి.. నాటి టీఆర్ఎస్ కు తిరుగులేదని..కేసీఆర్ సర్కారు దూసుకెళుతుందన్న ప్రచారం జరిగిన నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలు జరగటం.. వాటి ఫలితాలు అంచనాలకు సంబంధం లేకుండా ఉండటం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పు.. లోక్ సభకు జరిగే ఎన్నికల వేళలో ప్రజల తీర్పు భిన్నంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై అందరికి అవగాహన ఉన్నప్పుడు.. రేవంత్ ప్రభుత్వానికి గండం పొంచి ఉందన్న మాటలన్ని కూడా ఉత్త ప్రచారమే తప్పించి మరింకేమీ లేదని చెప్పాలి. మరింత స్పష్టంగా చెప్పాలంటే.. ఏదో అయిపోతుందన్న ప్రచారంతో రేవంత్ సర్కారు స్పీడ్ కు బ్రేకులు వేసే వ్యూహమే తప్పించి మరింకేమీ లేదన్న మాట వినిపిస్తోంది. తరచి చూస్తే.. అలాంటి కుట్ర ఏదో జరుగుతుందన్న భావన కలుగక మానదు.