Begin typing your search above and press return to search.

ఇజ్రాయేల్ - హమాస్ యుద్ధం... ఎంటరైన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు!

అవును... ఇజ్రాయెల్ - పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది.

By:  Tupaki Desk   |   18 Oct 2023 8:50 AM GMT
ఇజ్రాయేల్ - హమాస్  యుద్ధం... ఎంటరైన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు!
X

ఒకపక్క సుమారు 600 రోజులకు పైగా రష్యా – ఉక్రెయిన్ వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. అవిరామంగా ఆ రెండు దేశాల మధ్య భీకర పోరు జరుగుతుంది. ఈ నేపథ్యంలో పదిరోజుల క్రితం ఇజ్రాయేల్ పై హమాస్ ఉగ్ర దాడితో... ఇజ్రాయేల్ - హమాస్ యుద్ధం ప్రారంభమైంది. ఇరువైపులా వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో యుద్ధ నేరం అనే అంశం తెరపైకి వచ్చింది... దీంతోపాటు తదనుగుణంగా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) డ్యూటీ చర్చకు వచ్చింది.

అవును... ఇజ్రాయెల్ - పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. తొలుత హమాస్.. ఇజ్రాయెల్‌ పై కేవలం 20 నిమిషాల వ్యవధిలో ఐదు వేల రాకెట్లను ప్రయోగించింది. అమాయ్యక ప్రజలపై భూతల దాడులకు తెగపడింది. మ్యూజికల్ పార్టీలో ఎంటరై నరమేధం సృష్టించింది. చనిపోయినట్లు నటించిన వారి శ్వాస చెక్ చేసి మరీ కాల్పులు జరిపింది. ఇలా ఇజ్రాయేల్ లో హమాస్ సృష్టించిన నరమేధం అంతా ఇంతా కాదు.

దీనికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ తీవ్రస్థాయిలో ప్రతిదాడికి దిగింది. ఇందులో భాగంగా గాజా ను గజ గజ లాడించేస్తోంది. ముందుగా గాజాను అష్టదిగ్బంధనం చేసిన ఇజ్రాయేల్ సైన్యం... ప్రస్తుతం ఉత్తర గాజాపై ఆధిపత్యం ప్రదర్శిస్తోందని తెలుస్తోంది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్‌ లో ఇప్పటివరకూ 1,300 మంది పౌరులు మరణించగా... గాజా స్ట్రిప్‌ లో భారీ విధ్వంసం జరిగింది.

ఈ క్రమంలో... ఇజ్రాయేల్ దాడులతో ఇప్పటి వరకు 3,200 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 11వేల మంది గాయపడినట్లు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సమయంలో... హమాస్ - ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపధ్యంలో యుద్ధ నేరాలకు సంబంధించిన పలు ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఇదే క్రమంలో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) ఎప్పుడు ఏర్పడింది, అది ఎప్పుడు ఎంటర్ అవుతుంది అనేది ఆసక్తిగా మారింది.

1949లో జరిగిన జెనీవా సమావేశం యుద్ధ నేరాలపై చర్చించింది. ఆ సమావేశంలో యుద్ధంలో అనుసరించాల్సిన నియమాలను రూపొందించారు. ఇదే సమయంలో అంతర్జాతీయ యుద్ధ నేరాల ట్రిబ్యునల్‌ ను ఏర్పాటు చేశారు. దీంతో... ఈ నిర్ణయాలను ప్రతి దేశం ఆమోదించింది. ఇదే క్రమంలో... సాయుధ పోరాట చట్టం, మానవతా చట్టాలకు సంబంధించిన విధానాల రూపకల్పనను జెనీవా సమావేశంలో పలు దేశాలు అంగీకరించాయి.

ఇందులో భాగంగా... యుద్ధ సమయంలో సైన్యం ప్రవర్తన ఎలా ఉండాలి, అదేవిధంగా యుద్ధ ఖైదీల విషయంలో ఎలాంటి మార్గదర్శకాలు అనుసరించాలి అనే విషయాలను ఈ సమావేశంలో రూపొందించారు. ఈ చట్టాలు హమాస్ ఉగ్రవాదులతో సహా అన్ని వ్యవస్థీకృత సాయుధ సమూహాలకు వర్తిస్తాయి. ఈ విషయంలో ఐసీసీ కీలక పాత్ర పోషిస్తుంది.

ఇక తాజా ఇజ్రాయేల్ – హమాస్ యుద్ధం విషయనికొస్తే... ఈ యుద్ధంలో ముందుగా ఉగ్రదాడికి పాల్పడిన హమాస్ ఉగ్రవాదులు... ఇజ్రయేల్ లో చిన్నారులు, వృద్ధులు, మహిళలపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం ఇ‍జ్రాయెల్‌ కూడా హమాస్‌ పై ఎదురుదాడికి దిగింది. ఈ నేపధ్యంలో హేగ్‌ లోని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) ఇరు వైపులా అభియోగాలను నమోదు చేస్తుంది. ఈ చర్యలపై త్వరలో విచారించనుంది!

కాగా... తమ అధికార పరిధిలోని యుద్ధ నేరాల కేసుల్లో మాత్రమే దేశీయ న్యాయస్థానాలు నిర్ణయాలు తీసుకుంటాయి. అలా కాకుండా... ఏదైనా దేశంలోని పౌరులకు వ్యతిరేకంగా యుద్ధ నేరాలు చోటుచేసుకున్నప్పుడు, బాధిత దేశం చట్టాలను అమలు చేయలేని పరిస్థితులు ఏ‍ర్పడినప్పుడు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) జోక్యం చేసుకుని పరిష్కరిస్తుంది. ఈ క్రమంలోనే... ఇజ్రాయేల్ – హమాస్ దాడుల్లో యుద్ధ నేరాలు జరుగుతున్నాయనే అభియోగాలు నమోదు చేసింది.