Begin typing your search above and press return to search.

ఇజ్రాయల్ మీద ఆ బాంబులేస్తున్నాం.. కొత్త అడుగుల్లోకి ప్రతీకారం

అంతకంతకూ ముదురుతున్న ఇజ్రాయెల్ - పాలస్తీనా ఎపిసోడ్ లో మరో షాకింగ్ పరిణామం ఎదురైంది.

By:  Tupaki Desk   |   12 Nov 2023 4:52 AM GMT
ఇజ్రాయల్ మీద ఆ బాంబులేస్తున్నాం.. కొత్త అడుగుల్లోకి ప్రతీకారం
X

అంతకంతకూ ముదురుతున్న ఇజ్రాయెల్ - పాలస్తీనా ఎపిసోడ్ లో మరో షాకింగ్ పరిణామం ఎదురైంది. గాజా మీద వరుస దాడులకు పాల్పడుతున్న ఇజ్రాయెల్ మీద దాడి చేసేందుకు తాము తయారైనట్లుగా పేర్కొన్నారు లెబనాన్ లోని హెజ్ బొల్లా గ్రూపు. పాలస్తీనా ఎపిసోడ్ లో ప్రతీకారం తీర్చుకోవటానికి వీలుగా ఈ గ్రూపు ఇజ్రాయెల్ మీద దాడులకు పాల్పడుతోంది. ఇందులో భాగంగా తొలిసారి ఇజ్రాయెల్ మీద సరికొత్త క్షిపణులతో దాడులకు పాల్పడినట్లుగా పేర్కొంది. తాజా పరిణామాలు చూస్తుంటే.. ఉద్రిక్తలు అంతకంతకూ తీవ్రమయ్యే పరిస్థితి నెలకొందని చెప్పాలి.

కొన్ని రోజుల క్రితం ఇజ్రాయెల్ మీద పెద్ద ఎత్తున రాకెట్లు.. మోర్టార్ షెల్స్ ను ప్రయోగించిన హెజ్ బొల్లా గ్రూపు మీద ప్రతిదాడులకు తెర తీశారు. ఇందులో భాగంగా 68 మంది హెజ్ బొల్లా ఫైటర్లు మరణించారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ మీద కొత్త ఆయుధాలతో దాడులకు దిగుతున్నట్లుగా పేర్కొన్నారు. దీనికి సంబంధించి సదరు గ్రూప్ చీఫ్ హసన్ నస్రల్లా నుంచి రెండో వీడియో విడుదలైంది. ఇరాన్ మద్దతుతో గడిచిన వారంగా ఇజ్రాయెల్ మీద దాడులను.. ఆపరేషన్లను తీవ్రతరం చేసినట్లుగా పేర్కొన్నారు.

ఆధునిక ఆయుధాలతో దాడికి దిగబోతున్నట్లుగా పేర్కొన్న ఆయన.. ‘‘శనివారం తొలిసారి బుర్కాన్ క్షిపణుల్ని ప్రయోగించాం. ఒక్కో క్షిపణి 300-500 పెలోడ్లను మోయగలవు. దాడికి తెగబడే డ్రోన్లతో పాటు నిఘా డ్రోన్లను కూడా తాము ప్రయోగించాం’’ అని పేర్కొన్నారు. కొన్ని డ్రోన్లు ఇప్పటికే ఇజ్రాయెల్ లోని హైఫా.. సఫెద్ తదితర నగరాలపై నిఘా పెట్టినట్లుగా వెల్లడించారు. ఇజ్రాయెల్ లో టార్గెట్ చేసిన లక్ష్యాలపై దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పిన సదరు సంస్థ.. మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. అమెరికా సైన్యంపై దాడులు ఆగాలంటే.. గాజాతో జరుపుతున్న యుద్ధాన్ని ఆపేయాల్సిందిగా హెచ్చరించింది. ఇదంతా చూస్తే.. రానున్న రోజుల్లో ఈ ఉద్రిక్తతలు అంతకంతకూ ముదిరే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.