Begin typing your search above and press return to search.

హమాస్‌ ను అలా గుర్తించండి... భారత్‌ కు ఇజ్రాయెల్‌ విజ్ఞప్తి!

హమాస్‌ దాడికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు భీకరంగా చేస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   26 Oct 2023 3:53 AM GMT
హమాస్‌ ను అలా గుర్తించండి... భారత్‌ కు ఇజ్రాయెల్‌ విజ్ఞప్తి!
X

హమాస్‌ దాడికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు భీకరంగా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంతంగా ఉన్న ఇజ్రాయేల్ పై ఊహించని విధంగా రాకెట్లతో విరుచుకుపడింది. కేవలం 20 నిమిషాల వ్యవధిలో 5000 రాకెట్లతో దాడి చేయడమే కాకుండా... ఇజ్రాయేల్ లో చొరబడి అక్కడి అమాయక ప్రజలను ఊచకోత కోసింది. విచక్షణా రహితంగా కాల్పులు జరిపింది. ఈ దాడుల్లో సుమారు 1400 మంది ప్రాణాలు కోల్పోయారు. 200 మందికి పైగా బందీలుగా కొనిపోబడ్డారు.

ఈ సమయంలో హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయేల్ సైన్యం గాజాను గజగజ లాడించేస్తుంది. ఇదే సమయంలో ఈ యుద్ధం ప్రారంభం కాగానే అగ్రరాజ్యం అమెరికా, యూకేలతోపాటు భారత్ కూడా ఇజ్రాయేల్ కు మద్దతు ప్రకటించింది. ఉగ్రవాదం ఎక్కడున్న ఉపేక్షించకూడదని స్పష్టంగా తన అభిప్రాయం చెప్పింది. కారణం... భారత్ కూడా ఉగ్రవాదులవల్ల ఎన్నో ఇబ్బందులు చవి చూసింది. ఈ సమయంలో ఇజ్రాయేల్ భారత్ కు ఒక విజ్ఞప్తి చేసింది.

అవును... ఇజ్రాయేల్ పై దుర్మార్గపు చర్యకు పాల్పడిన హమాస్ విషయంలో ఆ దేశం భారత్ కు ఒక విజ్ఞప్తి చేసింది. ఇందులో భాగంగా... హమాస్‌ ను తీవ్రవాద సంస్థగా గుర్తించాలని భారత్‌ కు ఇజ్రాయెల్‌ విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే పలు దేశాలు హమాస్ ను ఉగ్ర సంస్థగా గుర్తించాయని తెలిపింది.

ఈ మేరకు భారత్‌ లోని ఇజ్రాయెల్‌ రాయబారి నావోర్‌ గిలన్‌ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... ఇజ్రాయెల్‌ పై కిరాతక చర్యకు పాల్పడిన హమాస్‌ కు సంబంధించిన వివరాలను తమ దేశం ఇప్పటికే భారత అధికారులకు అందించిందని తెలిపారు. ఈ విషయంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇప్పటికే హమాస్‌ పై దాడులకు 100 శాతం మద్దతుగా నిలిచినందుకు భారత్‌ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఇదే సమయంలో... హమాస్‌ తీవ్రవాద దాడులను ఖండించిన ప్రపంచ దేశాల నేతల్లో ప్రధాని నరేంద్ర మోడీ ముందు వరుసలో నిలిచారని కొనియాడారు. అదేవిధంగా... ప్రస్తుతం ప్రపంచంలో భారత్‌ ది అతి ముఖ్యమైన గొంతుక అని.. ప్రపంచానికీ, తమకూ కూడ్దా భారత్ అత్యంత ముఖ్యమైన దేశం అని అభిప్రాయపడ్డారు.

మరోపక్క... పశ్చిమాసియాలో పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో నిర్వహించిన సదస్సులో భారత్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందులో భాగంగా... ఇజ్రాయెల్‌, హమాస్‌ ఘర్షణ కారణంగా సంభవిస్తున్న భారీ పౌర మరణాలపై భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత ఘర్షణ మరోసారి ఇజ్రాయెల్‌, పాలస్తీనాల మధ్య చర్చలను ప్రారంభించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది.

ఇదే సమయంలో... ఇజ్రాయెల్‌, హమాస్‌ ఘర్షణ మొదలయ్యాక ఇజ్రాయెల్‌ లోని టెల్‌ అవీవ్‌ కు నడిపే విమానాలను ఎయిర్ ఇండియా ఇప్పటికే రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విమానాల రద్దును ఎయిరిండియా నవంబరు 2వ తేదీ వరకూ పొడిగించింది. కాగా.. ఈ నెల 7వ తేదీ ముందు వరకూ టెల్‌ అవీవ్‌ కు ఎయిరిండియా వారానికి ఐదు విమానాలను నడిపేది.