మరణానంతరం సంతానం.. ఇలా సాధ్యమయ్యేనా..?
యుద్ధం మనుషుల జీవితాలను మాత్రమే కాదు.. వారి కలలను, వారి కుటుంబ భవిష్యత్తును కూడా చెరిపేస్తుంది.
By: Tupaki Desk | 19 Nov 2025 7:00 PM ISTయుద్ధం మనుషుల జీవితాలను మాత్రమే కాదు.. వారి కలలను, వారి కుటుంబ భవిష్యత్తును కూడా చెరిపేస్తుంది. ఒక గుండె ఆగితే మరో గుండె కూడా దాని నిశ్శబ్దాన్ని భరించాలి. కానీ ఇజ్రాయెల్ వైద్యురాలు డాక్టర్ హడాస్ లెవి కథ ఆ నిశ్శబ్దాన్ని తిరగరాసింది. ప్రాణం కోల్పోయిన సన్నిహితుడి కోసం ఆమె చేసిన అద్భుతమైన పోరాటం.. మరణాంతరంగా జన్మించిన చిన్నారి రూపంలో పునర్జన్మలా మారింది. దుఃఖం ఎంత లోతుగా ఉన్నా, జీవితం మరోసారి పువ్వులా విరబూయగలదని ఈ కథ ప్రపంచాన్ని కట్టిపడేస్తుంది. ప్రేమ, నష్టం, విజ్ఞానం మూడూ కలిసిన ఈ ఘటన శాస్త్రానికి ఇచ్చే నిర్వచనాలను, జీవితం మీద పెట్టుకున్న విలువలను పూర్తిగా కొత్త కోణంలో చూసేలా చేస్తోంది.
మరణించిన 20 నిమిషాలకు స్పెర్మ్ కలెక్టర్..
డాక్టర్ హడాస్ లెవి ప్రేమించిన వ్యక్తి.. ఇజ్రాయెల్ రిజర్వ్ ఆఫీసర్ కెప్టెన్ నతనియేల్ సిల్బర్గ్ గాజాలో మరణించాడని తెలిసిన 20 నిమిషాలకే ఆమె తీసుకున్న నిర్ణయం వైద్య ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. Postmortem Sperm Retrieval (PMSR) అనే అరుదైన ప్రక్రియ ద్వారా అతని స్పెర్మ్‌ను రక్షించాలని ఆమె పరుగులు తీసింది. ప్రాణం లేని శరీరంలో ఆక్సిజన్ లేకపోవడం వల్ల స్పెర్మ్ దాదాపు పని చేయకపోవడం సహజమే. అయినప్పటికీ లెవి తీసుకున్న ధైర్యమైన నిర్ణయం భావోద్వేగంతో ముడిపడింది.
10 గంటల పాటు కష్టపడితే 9 కణాలు..
జెరుసలేం హడస్సా హాస్పిటల్‌లో 10 గంటల పాటు జరిగిన క్లిష్ట శస్త్రచికిత్సలో వైద్యులు మరణించిన శరీరంలో నుంచి జీవించగలిగే 9 స్పెర్మ్ కణాలను సేకరించారు. సాధారణంగా లక్షల్లో ఉండే స్పెర్మ్ సంఖ్య మృతదేహంలో కేవలం తొమ్మిదే హడాస్ లెవి కొత్త జీవితం కోసం పట్టుకున్న ఆశాకిరణం. ఈ ప్రక్రియ తర్వాత IVF చికిత్సలు, కోర్టు అనుమతులు, కుటుంబ ఒత్తిళ్లు.. అన్నీ దాటుకొని, 2024, అక్టోబరులో ఆమె గర్భం దాల్చింది. ఈ వేసవిలో ఆమెకు పుట్టిన చిన్నారి ఇప్పుడు ఇజ్రాయెల్‌లో మరణించిన సైనికుడి భాగస్వామి సంతానం పొందిన మొదటి ఉదాహరణ అయ్యాడు.
సాంకేతిక అద్భుతం..
ఈ విధానం సాంకేతికంగా అద్భుతం అయినప్పటికీ, ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన చట్టపరమైన, నైతిక పరమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. PMSR విధానం ప్రకారం సాధారణంగా మరణం జరిగిన తర్వాత 24–36 గంటలలోనే స్పెర్మ్‌ను సేకరిస్తారు. Epididymal aspiration, testicular biopsy వంటి ప్రత్యేక పద్ధతులు ఉపయోగించి సేకరించిన స్పెర్మ్ తర్వాత ఫ్రీజ్ చేసి IVFకు సిద్ధం చేస్తారు. 1980లో మొదటి PMSR రికార్డ్ అయింది. 1999లో ఈ విధానంతో మొదటి బిడ్డ పుట్టాడు. అయినప్పటికీ, ఈ ప్రక్రియ ప్రపంచ వ్యాప్తంగా కొన్ని నిబంధనలతో పని చేయడం లేదు.
విధానంపై అనేక అనుమానాలు..
మరణించిన వ్యక్తి ముందస్తు అనుమతి లేకుండా స్పెర్మ్ వినియోగించవచ్చా?
ఇలా పుట్టిన పిల్లలకు వారసత్వ హక్కులు ఉంటాయా? మరణం తర్వాత సంతానం పొందడం భావోద్వేగ హక్కా? లేక చట్టబద్ధ హక్కా? ఈ ప్రశ్నలు ప్రతి ప్రభుత్వానికి కలిగాయి. భారతదేశంలో ART చట్టం, 2021 ప్రకారం.. వివాహం అయిన వ్యక్తి మరణించిన సందర్భంలో, భాగస్వామి అభ్యర్థనతో PMSRకు అనుమతి ఉంది. కానీ కోర్టులు కొన్ని సందర్భాల్లో ‘సీమన్ కూడా ప్రాపర్టీగా పరిగణించవచ్చు’ అనే స్థాయికి వివరించిన తీర్పులు ఇవ్వడం ఈ చర్చను ఇంకా క్లిష్టంగా మారుస్తోంది.
లేవనెత్తుతున్న ప్రశ్నలు..
ఈ మొత్తం ఘటన చివరకు ఒక పెద్ద తాత్విక ప్రశ్నను లేవనెత్తుతుంది. వ్యక్తి చనిపోతే వారి జ్ఙాపకాలు కాలగర్భంలో కలుస్తాయి. కానీ విజ్ఙానం మాత్రం వారి గుర్తులను భవిష్యత్ తరాలకు అందిస్తుంది. అయితే దీని చుట్టూ ఉన్న నిబంధనలు ఎలా ఉన్నాయన్న దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. డాక్టర్ హడాస్ లెవి మాటలు పరిశీలిస్తే.. ‘ఈ బిడ్డ.. నా సమాధానం. నా కుటుంబ కథను నేను ముగియనివ్వలేదు.’ అంది.
