Begin typing your search above and press return to search.

వైరల్ ఇష్యూ: కావాలంటే నన్ను తీసుకెళ్లండి... మా వాళ్లను వదిలేయండి!

దీంతో ఆందోళన చెందిన యూనీ... గూగుల్ అకౌంట్ ద్వారా వారి ఆచూకీని గమనించాడు. ఇందులో భాగంగా తన భార్యా పిల్లలు గాజాలో ఉన్నట్లు గమనించాడు.

By:  Tupaki Desk   |   10 Oct 2023 10:30 AM GMT
వైరల్ ఇష్యూ: కావాలంటే నన్ను తీసుకెళ్లండి... మా వాళ్లను వదిలేయండి!
X

ఇజ్రాయెల్‌ పై హమాస్‌ ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో అనేక కన్నీటిగాథలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. అత్యంత విషాదకరమైన విషయాలు తెరపైకి వస్తున్నాయి. వీటిలో హమాస్ ముష్కరుల వికృత చేష్టలతో పాటు ఇజ్రాయేలీయుల దయణీయ స్థితి చర్చనీయాంశం అవుతుంది. మహిళలు, పిల్లలపై తెలిసి తెలిసి దాడులు చేయకూడదనే నీతి కనుమరుగైంది!

అవును... హమాస్ ముష్కరుల అదుపులో ఇప్పటికే వందలాది మహిళలు, పిల్లలు బందీలుగా ఉన్నారు. వారిని బందీలుగా గాజాకు తరలిస్తున్నారని తెలుస్తుంది. ఈ సమయంలో ఇజ్రాయెల్‌ కు చెందిన ఇద్దరు పిల్లలతో ఓ తల్లి కూడా బందీగా చిక్కింది. దీంతో... వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న ఆ పిల్లల తండ్రి ఆవేదన కంటతడి పెట్టిస్తోంది. భార్యా పిల్లల కోసం ఆ వ్యక్తి పడుతున్న ఆవేదన వర్ణనాతీతంగా ఉంది!

వివరాళ్లోకి వెళ్తే... ఇజ్రాయేల్ పై దాడి చేస్తున్న హమాస్ ఉగ్రవాదులు ఎంతోమంది మహిళలను, పిల్లలను బందీలుగా చేసుకుంటున్నారు. ఈ క్రమంలో డోరోన్ అషెర్ తన ఇద్దరు పిల్లలతో గాజా సరిహద్దులో ఉన్న అత్తగారి ఇంటికి వెళ్లింది. ఆమె భర్త యూనీ అషెర్ సెంట్రల్ ఇజ్రాయెల్‌ లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో హమాస్ ఉగ్రవాదులు ఇంట్లోకి చొరబడ్డారనే విషయాన్ని డోరోనే తన భర్తకు ఫోన్‌ లో తెలుపుతుండగానే మధ్యలో కాల్ కట్ అయిపోయింది.

దీంతో ఆందోళన చెందిన యూనీ... గూగుల్ అకౌంట్ ద్వారా వారి ఆచూకీని గమనించాడు. ఇందులో భాగంగా తన భార్యా పిల్లలు గాజాలో ఉన్నట్లు గమనించాడు. ఇదే క్రమంలో... తన భార్యా పిల్లలను హమాస్ ఉగ్రవాదులు ఎత్తుకుపోయిన విషయన్ని సోషల్ మీడియాలో వచ్చిన ఓ వీడియోలో గుర్తించి నిర్ధారించుకున్నాడు.

దీంతో తీవ్ర ఆవేదన చెందిన యూనీ... వ్యాన్‌ లో హమాస్ ఉగ్రవాదులు బందించి తీసుకువెళ్తున్నట్లు కనిపించిన ఆ వీడియోను చూసి కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ సందర్భంగా... మహిళలను, పిల్లలను కొట్టకండంటూ హమాస్ ఉగ్రవాదులను కోరుకుంటున్నాడు. తన పిల్లలకు ఐదేళ్లు కూడా నిండలేదని తెలిపాడు. ఇదే సమయంలో "కావాలంటే నేను మీకు బందీగా వస్తా.. కానీ నా భార్యా బిడ్డలను వదిలేయండి" అని వేడుకుంటున్నాడు. అతడు విలపిస్తున్న తీరు గుండెల్ని మెలిపెడుతోంది.

1500 మంది హమాస్‌ ఉగ్రవాదులు హతం:

ఇలా అవిరాంగా చెలరేగిపోతున్న హమాస్ మిలిటెంట్లకు గట్టిగానే ఎదురుతిరుగుతున్నట్లు నిర్ధారించే విషయాన్ని ఇజ్రాయేల్ వెల్లడించింది. ఇందులో భాగంగా... దాదాపు 1500 మంది ముష్కరులను హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం తాజాగా ప్రకటించింది. సరిహద్దులు కూడా పూర్తిగా తమ అధీనంలోకి వచ్చినట్లు వెల్లడించింది.

అవును... గాజా స్ట్రిప్‌ చుట్టూ ఉన్న ఇజ్రాయెల్‌ భూభాగంలో దాదాపు 1500 మంది హమాస్‌ మిలిటెంట్ల మృతదేహాలను గుర్తించామని, దక్షిణ ఇజ్రాయెల్‌ లో హమాస్‌ ఉగ్రవాదులు చొరబడిన ప్రాంతాలను తిరిగి తమ అధీనంలోకి తెచ్చుకున్నామని, సరిహద్దుల వెంబడి కూడా పరిస్థితి పూర్తిగా తమ నియంత్రణలోకి వచ్చిందని ఇజ్రాయెల్‌ ఆర్మీ అధికార ప్రతినిధి వెల్లడించారు.