Begin typing your search above and press return to search.

ఇజ్రాయెల్ - హమస్ యుద్ధం..టాప్ 5 షాకింగ్ పరిణామాలు

ఇజ్రాయెల్ - హమస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో పలు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వాటిల్లో ముఖ్యమైన ఐదు అంశాల్ని చూస్తే..

By:  Tupaki Desk   |   9 Oct 2023 11:21 AM GMT
ఇజ్రాయెల్ - హమస్ యుద్ధం..టాప్ 5 షాకింగ్ పరిణామాలు
X

అనూహ్య రీతిలో ఇజ్రాయెల్ మీద దాడికి పాల్పడిన హమస్.. ఆ టెక్నాలజీ దేశాన్ని ఎంతలా ఉక్కిరిబిక్కిరి చేసిందో తెలిసిందే. తాజా యుద్ధంలో ఇజ్రాయెల్ ను అందరూ బాధిత దేశంగా పలువురు అభివర్ణిస్తున్న విషయం తెలిసిందే. హమస్ ఉగ్రమూక జరిపిన దారుణ దాడిలో వారు వ్యవహరించిన తీరుకు సంబంధించిన పలు వీడియోలు ప్రపంచ వ్యాప్తంగా షాక్ కు గురి చేస్తున్నాయి. మహిళల్ని టార్గెట్ చేసి.. వారి పట్ల నాగరిక సమాజం సిగ్గుపడేలా వ్యవహరించిన వీరి దురాగతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

ఇజ్రాయెల్ - హమస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో పలు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వాటిల్లో ముఖ్యమైన ఐదు అంశాల్ని చూస్తే..

1. మునుపెన్నడూ చూడని హమస్ దురాగతాలు

ఇజ్రాయెల్ మీద మెరుపుదాడికి పాల్పడిన హమస్ ఉగ్రవాదులు.. అమాయక ప్రజల మీద జరిపిన దురాగతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇళ్లల్లోకి చొరబడిన ఉగ్రవాదులు అమాయక ప్రజలపై పాయింట్ బ్లాక్ లో కాల్పులు జరిపి వారి ప్రాణాలు తీసిన వైనాలు బయటకు వచ్చాయి. వీధుల్లో పిట్టల్ని కాల్చినట్లుగా.. పురుగుల్ని నలిపినట్లుగా.. ఇళ్లల్లోకి చొరబడి ప్రజలను పాయింట్ బ్లాంక్ లో కాల్చేశారని.. తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని బలవంతంగా లాక్కొని వారిని బంధించినట్లుగా ఇజ్రాయెల్ ప్రతినిధులు అంతర్జాతీయ వేదికల మీద చెబుతున్నారు. హమస్ దాడిలో వందలాది పౌరులు ప్రాణాలు కోల్పోయారని.. ఇవన్నీ యుద్ధ నేరాలే అన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

2. తీవ్రంగా మారిన దాడులు.. ప్రతిదాడులు

అనూహ్య రీతిలో విరుచుకుపడిన హమస్ ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ ప్రతిదాడుల్ని చేస్తోంది. గాజాలోని హమస్ స్థావరాలపై పెద్ద ఎత్తున బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది ఇజ్రాయెల్. అయితే.. ఇందుకు ప్రతిగా హమస్ సైతం.. ఇజ్రాయెల్ మీద దాడుల్ని కొనసాగిస్తోంది. దీంతో.. ఇరు వైపులా ప్రాణ నష్టం భారీగా జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే 1200లకు పైగా ప్రజలు మరణించి ఉంటారని భావిస్తున్నారు.

3. మాయా నగరంగా మారిన గాజా

ఇజ్రాయెల్ మీద అనూహ్య రీతిలో దాడికి పాల్పడి.. వందలాది మంది ప్రాణాలు తీసిన హమస్ ఉగ్రవాదులు.. పనిలో పనిగా పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ పౌరుల్ని తమ వెంట తీసుకుపోయారు ఉగ్రవాదులు. తమ వెంట తీసుకెళ్లిన ప్రజల్ని గాజా సిటీలోని సొరంగాలకు తరలించినట్లుగా చెబుతున్నారు. గాజా సిటీలో ఉన్న టన్నెల్ నెట్ వర్కు అత్యంత డేంజర్ అని చెబుతున్నారు. హమస్ అధీనంలో ఉన్న బందీలను రక్షించటం ఇజ్రాయల్ దళాల ముందున్న అతి పెద్ద సవాలుగా చెబుతున్నారు.

పాలస్తీనా ప్రజలు ఇజ్రాయెల్ ను దెబ్బ తీసేందుకు వీలుగా గాజా - ఇజ్రాయెల్ సరిహద్దుల్లో ఒక భారీ సొరంగాన్ని తవ్వారు. తమకు అనుగుణంగా ఇజ్రాయెల్ లోకి ఎంటరై.. తాము అనుకున్న టార్గెట్ ను పూర్తి చేసి వచ్చారు. గాజా సిటీ హమస్ ఉగ్రవాదుల గుప్పిట్లోకి వెళ్లిన నాటి నుంచి భూమి లోపల సొరంగాన్ని ఏర్పాటు చేసి.. దాన్నో సిటీగా మార్చినట్లుగా చెబుతారు. యుద్ధ విమానాలకు.. శాటిలైట్లకు చిక్కకుండా కేమో ఫ్లాజ్ టెక్నిక్ తో కప్పి పెడతారు. దీంతో.. గాజా సిటీ మొత్తం సొరంగం ఉచ్చులతో నిండి ఉంటుంది. ఈ నగరంలోని అడుగు పెట్టటం అంటే చావును కొని తెచ్చుకోవటమే. గాజాలో దాదాపు 1300లకు పైగాసొరంగాలు ఉన్నట్లుగా అంచనా. తాజాగా తీసుకొచ్చిన బంధీలను ఇందులో దాచటం ద్వారా.. ఇజ్రాయెల్ కు దిక్కుతోచని పరిస్థితిని కల్పించారని చెబుతున్నారు.

4. ఇజ్రాయెల్ కు అండగా అమెరికా యుద్ధ నౌకలు.. విమానాలు

హమస్ ఉగ్రవాదులు జరుపుతున్న దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ కు దన్నుగా నిలిచేందుకు అగ్రరాజ్యం అమెరికా తాజాగా యుద్ధనౌకల్ని, యుద్ధ విమానాల్ని పంపుతోంది. హమస్ ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా తప్పు పడుతున్న అమెరికా.. బైడెన్ ఆదేశాలతో యుద్ధ నౌకల్ని పంపుతున్నారు. విమానాలు సైతం తమ కొత్త స్థావరాలకు కదలినట్లుగా చెబుతున్నారు. తాజా దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రభుత్వానికి.. అక్కడి ప్రజలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని అమెరికా అధ్యక్షుడు హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. అమెరికా సాయాన్ని హమస్ తీవ్రంగా వ్యతిరేకించింది.

5. వీళ్లనేం చేయాలి? హమస్ దాడుల కు ప్రతిగా లండన్ లో సంబరాలు

ఇజ్రాయెల్ పై హమస్ ఉగ్రవాదుల దాడులను యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండిస్తోంది. అమాయక ప్రజల్ని పిట్టల మాదిరి కాల్చేయటం.. యువతుల్ని టార్గెట్ చేసి.. వారిని బంధీలుగా చేసే క్రమంలో ఉగ్రవాదులు వ్యవహరించిన తీరుకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే బయటకు రావటం తెలిసిందే. వీరి దారుణమారణకాండకు ప్రపంచం ఖండిస్తుంటే.. అందుకు భిన్నంగా లండన్ లో హమాస్ మద్దతుదారులు కొందరు బహిరంగంగా సంబరాలు చేసుకోవటం షాకింగ్ గా మారింది.

ఎంత స్వేచ్చా ప్రపంచం అయినప్పటికీ ఉగ్రదాడుల్ని సైతం పండుగలా చేసుకునే జనాల్ని చూసిన వారు మండిపడుతున్నారు. కాస్త ఆలస్యంగా మేల్కొన్న లండన్ పోలీసులు సైతం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని.. కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ఈ చర్యను తీవ్రంగా తప్పు పడుతున్న లండన్ పోలీసులు.. ఇలాంటి వాటిని అడ్డుకునేందుకు పోలీసుల నిఘా పెంచినట్లుగా చెబుతున్నారు. అంతే తప్పించి.. దీనికి బాధ్యులైన వారిని అదుపులోకి తీసుకొని.. వారికి సరైన పాఠాలు పరిచయం చేయాల్సిన అవసరం ఉంది కదా?