Begin typing your search above and press return to search.

ఇజ్రాయెల్ మట్టు పెడతానంటున్న గాజా ఎలా ఉంటుంది?

ఇజ్రాయెల్ - ఈజిప్టు సరిహద్దుల్లో ఉండే చిన్న ప్రాంతం గాజా సిటీ. దీని మొత్తం విస్తీర్ణం కేవలం 365 చదరపు కిలోమీటర్లే

By:  Tupaki Desk   |   11 Oct 2023 4:07 AM GMT
ఇజ్రాయెల్ మట్టు పెడతానంటున్న గాజా ఎలా ఉంటుంది?
X

గడిచిన మూడు.. నాలుగురోజులుగా అందరి నోట నానుతున్న పదం 'గాజా సిటీ'. ఇజ్రాయెల్ సరిహద్దుల్లోకి తెగబడిన హమస్ ఉగ్రమూక.. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా అత్యంత అనాగరికంగా చంపేసిన వైనంపై ఇజ్రాయెల్ కుతకుతలాడుతోంది. తమ శక్తి సామర్థ్యాల్ని చూపించే సమయం అసన్నమైందని.. ఈసారి గాజా సిటీలో మారణహోమాన్ని చేపడతామన్న ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ గాజా సిటీ ఏంటి? ఎలా ఉంటుంది? ఇదెంత విస్తీర్ణంలో ఉంటుంది? ఎంత మంది ప్రజలు ఉంటారు? దీన్ని పాలించేది ఎవరు? ఎవరి అధీనంలో ఉంది? చరిత్రలో గాజా సిటీకి ఉన్న ప్రాధాన్యత ఏమిటి? లాంటి వివరాల్ని తెలుకునే ప్రయత్నం చేస్తే..

ఇజ్రాయెల్ - ఈజిప్టు సరిహద్దుల్లో ఉండే చిన్న ప్రాంతం గాజా సిటీ. దీని మొత్తం విస్తీర్ణం కేవలం 365 చదరపు కిలోమీటర్లే. 41 కిలో మీటర్ల పొడవు.. 10 కిలో మీటర్ల వెడల్పుతో ఉంటే ఈ చిన్న ప్రాంతంలో పాలస్తీనా ప్రజలు ఎక్కువగా ఉంటారు. వీరు ఎక్కువగా ఉండే రెండో ప్రాంతాల్లో ఇదొకటి కాగా.. రెండోది వెస్ట్ బ్యాంక్. ఇంత చిన్న విస్తీర్ణంలో 23 లక్షల మంది నివసిస్తారు.

ప్రపంచంలో అత్యంత జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో గాజా సిటీ ఒకటి. ఈ సిటీలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణం చేయాలంటే పట్టే సమయం కేవలం గంట కంటే తక్కువని చెబుతారు. ఇంత స్వల్ప విస్తీర్ణంలోనే స్కూళ్లు.. కాలేజీలు.. ఆసుపత్రులు.. విశ్వవిద్యాలయం లాంటివన్నీ ఉన్నాయి. జనాభా ఎక్కువగా ఉండటంతో ఈ భాగాన్ని ఐదు భాగాలుగా చేశారు. అవి..

1. ఉత్తర గాజా

2. గాజా సిటీ

3. డెయిర్ ఎల్ బలాహ్

4. ఖాన్ యూనిస్

5. రఫా

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు పవిత్ర పుణ్యక్షేత్రమైన జెరూసలెంకు కేవలం వంద కిలోమీటర్ల దూరంలో గాజా ఉంటుంది. దీనికి ఉత్తరం.. తూర్పు వైపున ఇజ్రాయెల్.. దక్షిణంలో ఈజిప్టు సరిహద్దులుగా ఉంటాయి. పశ్చిమాన మధ్యధరా సముద్రం ఉంటుంది. ఇజ్రాయెల్ దేశంగా ఏర్పడింది 1948లో. అంటే.. మనకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాతే ఇజ్రాయెల్ కు స్వేచ్ఛ లభించింది. అప్పట్లో గాజా ఈజిప్టు నియంత్రణలో ఉండేది.

1967లో అరబ్ యుద్ధంలో ఇజ్రాయెల్ ఈ ప్రాంతాన్ని గెలుచుకుంది. ఆ తర్వాత 38 ఏళ్ల పాటు తన అధీనంలోనే గాజాను ఉంచుకుంది ఇజ్రాయెల్. ఈ సమయంలోనే గాజాలో 21 యూదు సెటిల్ మెంట్లను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఇరు పక్షాల మధ్య ఘర్షణలు పెరిగాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన ఒత్తిళ్ల కారణంగా గాజా నుంచి ఇజ్రాయెల్ వైదొలిగింది. 1993 ప్రాంతంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.

తర్వాతి సంవత్సరం అంటే 1994లో ఇజ్రాయెల్ -పాలస్తీనా విమోచన సంస్థ మధ్య ఒప్పందం జరిగింది. దీని ప్రకారం గాజా పాలనను పాలస్తీనా విమోచన సంస్థ షురూ చేసింది. 2005లో ఇజ్రాయెల్ 9 వేల మందితో పాటు తన సైన్యాన్ని వెనక్కి తీసుకుంది. పాలస్తీనా విమోచన సంస్థలోని సాయుధ అతివాద సంస్థే హమస్. దీని చేతికి 2006లో పగ్గాలు అందాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ అతివాద సంస్థ హమస్ చేతిలోనే గాజా పాలన సాగుతోంది. హమస్ చేతికి పగ్గాలు చిక్కిన తర్వాత ఎన్నికల్ని నిర్వహించింది లేదు.

గాజాలోకి ఎవరు రావాలన్నా.. బయటకు పోవాలన్నా.. చివరకు వస్తువులు తీసుకురావాలన్నా ఇజ్రాయెల్ అనుమతి ఉండాల్సిందే. ఈ నిర్బంధం లేకుంటే హమస్ మరింతగా చెలరేగుతుందన్నది ఇజ్రాయెల్ వాదన. మరోవైపు ఈజిప్టు కూడా గాజా సరిహద్దుల్ని చాలావరకు మూసే ఉంచుతుంది. వైద్యం లాంటి అత్యవసర సమయాల్లో మాత్రమే ఇక్కడి వారిని బయటకు వెళ్లేందుకు అనుమతిస్తారు. ఈ కారణంగానే గాజాను ఓపెన్ జైలుగా కొందరు అభివర్ణిస్తుంటారు. గాజాలో ఒకప్పుడు ఎయిర్ పోర్టు ఉన్నప్పటికీ2001లో ఇజ్రాయెల్ బాంబుదాడి తర్వాత అది నిరుపయోగంగా మారింది.

ఒకలాంటి దుర్బర పరిస్థితులు గాజాలో ఉంటాయి. ఈ కారణంగానే ఇక్కడి ప్రజల్లో అత్యధికులకు ఇజ్రాయెల్ అంటే కసి.. కోపం.. తమ జీవన ప్రమాణాలు ఏ మాత్రం బాగోలేకపోవటానికి తమ పట్ల ఈ దేశ విధానాలే కారణమని భావిస్తారు. మొత్తం జనాభాలో సగం మంది పిల్లలు అయితే.. 15 ఏళ్ల లోపు వారు 40 శాతం ఉంటారన్నది అంచనా. ఇక్కడ నివసించే 14 లక్షల మంది పాలస్తీనా శరణార్థులుగా ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి చెబుతుంటుంది.

ప్రపంచంలో మరే దేశంలో లేనంత నిరుద్యోగత ఈ ప్రాంతంలో ఉంటుంది. ఒక అంచనా ప్రకారం 45 శాతం నిరుద్యోగత ఉందని చెబుతారు. ఇక్కడ ఉండే ప్రజల్లో 75 శాతం మందికి రోజు వారీ ఆహారం కోసం కూడా అంతర్జాతీయ సాయం అవసరమవుతుంది. గాజాకు అవసరమైన మంచినీరు.. విద్యుత్ లాంటివి కూడా ఇజ్రాయెల్ దయ మీదనే అందుతాయి. ఆహారం.. ఇతర వస్తువులుసైతం ఇజ్రాయెల్.. ఈజిప్టు నుంచే వస్తాయి. అందుకే.. గాజాను పూర్తిగా నిర్బంధిస్తున్నామని ఇజ్రాయెల్ ప్రకటించిన నేపథ్యంలో.. అక్కడి ప్రజల పరిస్థితేంటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.