Begin typing your search above and press return to search.

ఊపిరి సలపని పొగలో జెరూసలెం.. ఇజ్రాయెల్ ను కమ్మేసిన కార్చిచ్చు

2023 అక్టోబరు 7న హమాస్ మిలిటెంట్లు తమ దేశంలోకి చొరబడి సాగించిన మారణకాండకు ఇజ్రాయెల్ అంతకంతకూ ప్రతీకారం తీర్చుకుంటోంది.

By:  Tupaki Desk   |   1 May 2025 12:31 PM IST
Israel Battles Wildfires Amid Prolonged War
X

ఏడాదిన్నరగా హమాస్ తో భీకర యుద్ధం.. లెబనాన్ పైనా దాడులు.. సిరియాపైనా బాంబులు.. ఇరాన్ తోనూ ఘర్షణ.. ఇదీ ఇజ్రాయెల్ పరిస్థితి.. అయినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా పోరాడుతోంది ఆ దేశం..

2023 అక్టోబరు 7న హమాస్ మిలిటెంట్లు తమ దేశంలోకి చొరబడి సాగించిన మారణకాండకు ఇజ్రాయెల్ అంతకంతకూ ప్రతీకారం తీర్చుకుంటోంది. మధ్యలో కాల్పుల విరమణ పాటించినా.. తర్వాత అది కొనసాగలేదు. ఇప్పటికీ హమాస్ ల స్థావరమైన గాజాపై భీకర దాడులు కొనసాగిస్తోంది.

తాజాగా ఇజ్రాయెల్ లో భీకర కార్చిచ్చు రేగింది. అది కూడా పవిత్ర పుణ్య క్షేత్రం జెరూసలెం శివారులోని అడవుల్లో. అక్కడ ఎగిసిన పొగ జెరూసలెం వరకు వ్యాపించింది. దీంతో జెరూసలెం పైన పొగ దట్టంగా అలముకుంది.

అత్యవసర పరిస్థితి

ఇజ్రాయెల్ లో జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించి.. గత 24 గంటల్లో వేలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ దేశంలో ఇప్పటివరకు చెలరేగిన అతిపెద్ద అగ్ని ప్రమాదాల్లో ఇదీ ఒకటని చెబుతున్నారు. ఇప్పటివరకు 13 మంది గాయపడినా ఒక్కరూ చనిపోయినట్లు తేలలేదు.

కాగా.. జెరూసలెంను కమ్మేసిన పొగ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సహజంగా పొడి వాతావరణం ఉంటే బలమైన గాలులు తోడైతే పొగ, మంటలు వేగంగా వ్యాపిస్తుంటాయి. రాజధాని టెల్ అవీవ్.. జెరూసలెంను కలిపే రోడ్డును మూసివేశారు. పలు రోడ్లపై దట్టంగా పొగ అలముకుంది.

జెరూసలెంకూ ముప్పు?

యూదు, క్రిస్టియన్, ముస్లిం.. ఇలా మూడు ప్రధాన మతాలకు కేంద్ర బిందువైన జెరూసలెంకూ కార్చిచ్చు ముప్పు ఉందని తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహూ తెలిపారు. పొగ కారణంగా ఇప్పటికే పలువురు తమ వాహనాలను వదలివెళ్తున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సైన్యాన్ని రంగంలోకి దించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.